కాంగ్రెస్ పార్టీకి వేరే బయటి శత్రువుల అవసరమే లేదు

By KTV Telugu On 22 April, 2023
image

కాంగ్రెస్ పార్టీకి వేరే బయటి శత్రువుల అవసరమే లేదు. స్వపక్షంలోనే విపక్షం అనేది కాంగ్రెస్ ప్రత్యేకత. తెలంగాణా కాంగ్రెస్ ను కూడా ఇపుడు ఇదే పట్టి పీడిస్తోంది. ఒక పక్క ఎన్నికలకు ఆరు నెలల సమయం కూడా లేని తరుణంలో పార్టీలోని సీనియర్ నేతలు తలోదారీ పడుతున్నారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఎవరూ సహకరించడం లేదు. సీనియర్లకు ఆయన గౌరవం ఇవ్వలేదు కాబట్టే ఎవరూ కలిసి రావడం లేదన్నది ఒక వాదన. అయితే ఎవరూ సహకరించకపోవడం వల్లనే రేవంత్ వారికి గౌరవం ఇవ్వడం లేదన్నది రేవంత్ వర్గీయుల సమాధానం. చెట్టు ముందా విత్తు ముందా అన్నట్లు ఇది తేలేది కాదంటున్నారు రాజకీయ పండితులు. కాంగ్రెస్ పార్టీలో గ్రూప్‌లు గొడవలు కొట్లాటల గురించి ఎంత చెప్పకున్నా తక్కువే. అధికారం ఉన్నా లేకపోయినా ఒకరిపై ఒకరు కత్తులు నూరుకోవడంలో హస్తం పార్టీ నేతలు ఏమాత్రం వెనకడగు వేయరని టాక్. ఈ మ‌ధ్య కాలంలో రేవంత్‌కు వ్యతిరేకంగా సీనియ‌ర్స్ వేస్తున్న స్కెచ్‌లు బాగా వ‌ర్క్ అవుట్ అవుతున్నాయ‌ంటూ గాంధీభ‌వ‌న్‌లో హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికి మూడు సార్లు టీపీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్‌ రెడ్డిని ఒంటరి చేయడంలో సీనియర్లు సక్సెస్ అయ్యారట.

మంచిర్యాలలో నిర్వహించిన సత్యాగ్రహ దీక్ష సందర్భంగా రేవంత్‌కు ప్రాధాన్యత లేకుండా చేశారని టాక్ నడుస్తోంది. అదేవిధంగా నల్గొండలో 21వ తేదీన రేవంత్‌ నిర్వహించాలని నిర్ణయించిన నిరుద్యోగ నిరసన దీక్షను వాయిదా వేయించడంలో సీనియర్ల్ విజయం సాధించారు. మరీ ముఖ్యంగా సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి తన నియోజకవర్గంలో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు రాష్ట్ర ఇన్‌చార్జ్‌ ఠాక్రేతో సహా సీనియర్లందరినీ ఆహ్వానించారు ఒక్క రేవంత్‌రెడ్డిని మినహా. ఇలా పలుసార్లు రేవంత్‌ను ఒంటరి చేయడంలో సీనియర్లు విజయం సాధించారంటూ చర్చ జరుగుతోంది. మంచిర్యాలలో నిర్వహించిన సత్యాగ్రహ దీక్షలో ఆలిండియా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు. హైదరాబాద్‌ నుంచి మంచిర్యాల వరకు హెలికాప్టర్‌లో ప్రోటోకాల్‌ ప్రకారం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రేవంత్‌ జాతీయ పార్టీ అధ్యక్షుడు ఖర్గేతో కలిసి ప్రయాణించాలి. అయితే సభ జరిగిన మంచిర్యాలకు ఖర్గే వచ్చిన హెలికాప్టర్‌లో కేవలం మూడుసీట్లు ఉన్నదాన్నే ఏర్పాటు చేశారు. దీనిలో ఖర్గేతో పాటు ఆయన పీఏ, రాష్ట్ర ఇన్‌చార్జ్‌ ఠాక్రే సరిపోయారు. మంచిర్యాలలో ఉన్న ఠాక్రేను ఆగమేఘాల మీద హైదరాబాద్‌ పంపించి అక్కడి నుంచి ఖర్గేతో హెలికాప్టర్‌లో వచ్చేలా ప్లాన్ చేశారట. దీంతో రేవంత్‌ కారులోనే మంచిర్యాలకు రావాల్సి వచ్చింది.  హెలికాప్టర్‌లో ఖర్గేతో కలిసి రేవంత్‌ రాకుండా చేయాలన్న సీనియర్ల పన్నాగం ఫలించిదట. సభ వేదిక మీద కూడా రేవంత్‌కు ప్రాధాన్యం లేకుండా చేశారట.

వరుస పరిణామాలతో ఖంగు తిన్న రేవంత్‌రెడ్డి సీనియర్లకు ఝలక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. నిరుద్యోగ దీక్ష నల్గొండలో జరగకుండా అడ్డుకున్న సీనియర్లకు ఖమ్మంలో నిర్వహించడం ద్వారా కౌంటర్‌ ఇవ్వబోతున్నారట. ఖమ్మం జిల్లాలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు యాంటీగా ఉండే కేంద్ర మాజీమంత్రి రేణుకా చౌదరితో రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఖమ్మం సభను విజయవంతం చేయడానికి రేణుకాచౌదరి సహాయ సహకారాలు కోరినట్లు పార్టీ వర్గాల సమాచారం. అలాగే ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరిక అంశం ఆయన పార్టీ ముందు పెట్టిన డిమాండ్లపై రేణుకతో రేవంత్ చర్చించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని రేణుకాచౌదరి నివాసంలో రేవంత్ తో పాటు ఆయనకు అనుకూలంగా ఉండే అంజన్ కుమార్ యాదవ్ తదితర మరో ఐదుగురు నేతలు సమావేశమయ్యారు. ఖమ్మం సభను గ్రాండ్ సక్సెస్ చేసి మంచిర్యాల సభకు రివేంజ్ తీర్చుకోవాలని రేవంత్ చూస్తున్నారట. టి.కాంగ్రెస్‌లో గ్రూప్ పాలిటిక్స్‌ ఎప్పుడూ ఉండేవే కాని రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక గొడవలు పీక్స్‌కు చేరాయి. సీనియర్లంతా రేవంత్‌ను వ్యతిరేకిస్తుండటంతో వారితో పోరాడుతూ రేవంత్‌ ముందుకు సాగాల్సి వస్తోంది. ముందు ముందు తెలంగాణ కాంగ్రెస్‌లో ఇంకెన్ని ఆధిపత్య పోరాటాలు చూడాల్సి వస్తుందో.