తెలంగాణాలో అధికారాన్ని కోల్పోయిన బి.ఆర్.ఎస్. ఓటమిని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతోన్నట్లుంది. తమను కుర్చీ నుంచి దింపేసిన కాంగ్రెస్ పార్టీపై నిత్యం విద్వేషం వెళ్లగక్కుతూనే ఉన్నారు గులాబీ నేతలు. కాంగ్రెస్ పూర్తి కాలం అధికారంలో ఉండదని పదే పదే అంటున్నారు. దీనిపై కాంగ్రెస్ నేతలు కూడా విరుచుకు పడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే 40శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పూర్తి కాలం అధికారంలో ఉండదో బి.ఆర్.ఎస్. నేతలు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. ఎన్నికైన ప్రభుత్వం పడిపోతుందని ఎవరైనా అంటే తన్ని తరిమేయండని పిలుపు నిచ్చారు.
ఇటీవలి ఎన్నికల్లో కచ్చితంగా తామే గెలుస్తామని బి.ఆర్.ఎస్. నేతలు అనుకున్నారు. హ్యాట్రిక్ సిఎం గా కేసీయార్ ప్రమాణ స్వీకారం చేస్తారని వారు భావించారు. గ్రేటర్ హైదరాబాద్ లో ప్రజలు ఏకపక్షంగా బి.ఆర్.ఎస్. కు బ్రహ్మరథం పట్టినా జిల్లాల్లో మాత్రం కాంగ్రెస్ కు ఘన విజయాలు అందించారు తెలంగాణా ప్రజలు. ఓటమిని అస్సలు ఊహించని బి.ఆర్.ఎస్. నాయకత్వం షాక్ కు గురయ్యింది. రైతు బంధు, దళిత బంధు , రైతు భరోసా వంటి అద్భుతమైన పథకాలు అమలు చేసినా పార్టీ ఎందుకు ఓడిందో వారికి ఇప్పటికీ అర్ధం కావడం లేదు.
తమని గద్దె దింపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీపై బి.ఆర్.ఎస్. నాయకత్వానికి సహజంగానే మంటగా ఉంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజులకే కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఏమయ్యాయంటూ బి.ఆర్.ఎస్. నేతలు వెంటపడ్డారు. ప్రమాణ స్వీకారం చేసిన వంద రోజుల్లోపు గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ వివరణ ఇచ్చింది. అందులోభాగంగా ఇప్పటికే నాలుగు గ్యారంటీలను అమలు చేస్తోంది. వంద రోజుల పాలన దాటిపోయినా ఆరు గ్యారంటీలు అమలు చేయలేదంటూ బి.ఆర్.ఎస్. యాగీ చేస్తోంది. ఇది హుందాగా లేదని రాజకీయ పరిశీలకులు కూడా అంటున్నారు.
2014లో బి.ఆర్.ఎస్. తాము అధికారంలోకి వస్తే దళితుణ్ని ముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఇచ్చింది. ప్రతీ దళిత కుటుంబానికీ మూడు ఎకరాల భూమి ఇస్తామని మరో హామీ ఇచ్చింది. పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తామంది. అయితే ఈ హామీలేవీ తొమ్మిదేళ్ల బి.ఆర్.ఎస్. పాలనలో అమలు చేయలేదని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. తొమ్మిదేళ్లుగా దళితులకు ఇచ్చిన హామీలు అమలు చేయని బి.ఆర్.ఎస్. నేతలకు కాంగ్రెస్ ను నిలదీసే అర్హత హక్కు రెండూ లేవంటున్నారు కాంగ్రెస్ నేతలు.
ఒక వైపు గ్యారంటీల అమలు కోసం ప్రశ్నిస్తున్న బి.ఆర్.ఎస్. నేతలు మరో వైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం అధికారంలో ఉండదని మళ్లీ కేసీయార్ ముఖ్యమంత్రి అవుతారని అంటున్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం పూర్తి కాలం పదవిలో ఉండదని ఎలా చెబుతారని కాంగ్రెస్ మండిపడుతోంది. రేవంత్ రెడ్డి అయితే ఇలాంటి పిచ్చి కూతలు కూసే వారిని వదిలిపెట్టవద్దని పార్టీ నేతలకు పిలుపు నిచ్చారు. అధికారం పోయిందన్న ఉక్రోషంలోనే బి.ఆర్.ఎస్. నేతలు తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ అంటోంది.
అధికారం పోతే పోయింది కానీ.. బి.ఆర్.ఎస్. నేతలు మరి కొద్ది నెలల పాటు సంయమనంతో ఉంటే హుందాగా ఉండేదంటున్నారు రాజకీయ పండితులు. అధికారం పోయిందన్న ఆక్రోశం వెళ్లగక్కితే ప్రజల్లో మరింత పలచన అయ్యే ప్రమాదం ఉందని వారంటున్నారు. బి.ఆర్.ఎస్. ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయలేకపోయిన గులాబీ నేతలు ఒక్కో హామీని అమలు చేసుకుంటూ పోతోన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని వెంటాడి వేటాడి వేధించడం మంచి పద్ధతి కాదని వారు సూచిస్తున్నారు. ఈ వైఖరి లోక్ సభ ఎన్నికల్లో కూడా చెడు ప్రభావం చూపే ప్రమాదం ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…