లోక్ సభ ఎన్నికల నగారా మోగిన వేళ అన్ని పార్టీలు ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. సరిగ్గా ఈ సమయంలోనే వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతల ఇళ్లల్లో సోదాలు చేయడమో నేతలను అరెస్ట్ చేయడమో జరుగుతోంది. ఇక కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలను అయితే ఏకంగా ఫ్రీజ్ చేశారు. తమకి చేతిలో డబ్బులు ఆడకపోవడంతో చాలా ఇబ్బందిగా ఉందని పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆక్రోశం వ్యక్తం చేశారు. ఇది అధికారాన్ని దుర్వినియోగం చేయడమే అన్నారు. విపక్షాలపై కక్ష సాధించే కుట్రే అని విమర్శించారు.
లోక్ సభ ఎన్నికల షెడ్యూలును ప్రకటించేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఏడు దశల్లో దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అదే రోజు ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. కేంద్రంలోనూ నాలుగు రాష్ట్రాల్లోనూ అధికారంలోకి వచ్చేది ఎవరో ఆ రోజే తేలిపోతుంది. ఎన్నికల నగారా మోగడానికి ముందే కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమి 400 ఎంపీ స్థానాలను టార్గెట్ గా పెట్టుకుంది. దానికి తగ్గట్లే వివిధ రాష్ట్రాల్లో తమతో కలిసొచ్చే పార్టీలతో పొత్తులు పెట్టుకుంటోంది బిజెపి.
ఎన్డీయే కి దీటుగా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి కూడా ఎన్నికల సమరానికి సమాయత్తం అవుతోంది. అటు ఎన్డీయే..ఇటు ఇండియా కూటముల్లో లేని తటస్థ పార్టీలు కూడా ఎన్నికల యుద్ధానికి అస్త్రాలు సమకూర్చుకుంటున్నాయి. ఆయుధాలకు పదును పెట్టుకుంటున్నాయి. సరిగ్గా ఈ తరుణంలోనే కేంద్ర దర్యాప్తు సంస్థలు కొన్ని రాజకీయ పార్టీల నేతల వెంట పడ్డం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది. ఎన్నికల సమయంలో ప్రత్యర్ధులను భయ భ్రాంతులకు గురి చేసి వారిని బలహీన పర్చడమే బిజెపి అజెండాగా ఉందని విపక్షాలు నిప్పులు చెరుగుతున్నాయి.
ఇండియా కూటమికి నాయకత్వం వహిస్తోన్న ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ను అచేతనం చేసేందుకు ఆ పార్టీ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసినట్లు ఆ పార్టీ అగ్రనేతలు ఆరోపించారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు మీడియా ముందుకు వచ్చి కేంద్రంలోని బిజెపిపై విమర్శలు చేశారు. సరిగ్గా ఎన్నికల ముందు మా బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయడం ద్వారా మా చేతుల్లో డబ్బులు ఆడకుండా చేశారు. దీంతో మా పార్టీ అభ్యర్ధులకు, నేతలకు కనీస అవసరాలకు ఇవ్వడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి నెలకొంది. విమాన టికెట్లు కాదు కనీసం రైల్ టికెట్లు కొనే పరిస్థితి కూడా లేకుండా చేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇది మంచి పద్ధతి కాదన్నారు.
ఎన్డీయేని వ్యతిరేకించే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కేంద్ర దర్యాప్తు సంస్థ వెంటాడుతూనే ఉంది. కొద్ది వారాలుగా కేజ్రీవాల్ కు సమన్లు జారీ చేస్తూనే ఉన్నారు అధికారులు. విచారణకు వెళ్తే కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని ఆప్ నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ ను అరెస్ట్ చేస్తే ఆప్ విజయావకాశాలను దెబ్బతీయవచ్చునన్నది బిజెపి కుట్ర అంటున్నారు వారు. అందుకే తనని అరెస్ట్ చేయకుండా ఆదేశించాలంటూ కేజ్రీవాల్ న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వస్తోంది. బిజెపిని గట్టిగా విమర్శించే మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ నూ దర్యాప్తు సంస్థలు వదలడం లేదు. మమత పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే ఇంట్లో సోదాలు చేస్తున్నారు. అదే విధంగా ఇండియా కూటమిలో భాగస్వామి అయిన డిఎంకే ఎమ్మెల్యే ఇంట్లోనూ సోదాలు చేస్తున్నారు.
ఏ కూటమిలోనూ లోని భారత రాష్ట్ర సమితి నాయకురాలు కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసి ఈడీ కస్టడీకి తరలించారు. గతంలోనే ఆమెను విచారించి వదిలేసిన అధికారులు సరిగ్గా ఎన్నికల సమయంలో అరెస్ట్ చేయడం లోక్ సభ ఎన్నికల్లో బి.ఆర్.ఎస్. ను దెబ్బతీయడానికే అని రాజకీయ పండితులు అనుమానిస్తున్నారు. మొత్తానికి తమ దారికి అడ్డు వస్తారనుకున్న పార్టీలనూ.. తమను వ్యతిరేకించే నాయకులనూ భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా ఎన్నికల్లో వారు చురుగ్గా ఉండే పరిస్థితులు లేకుండా చేయాలని బిజెపి చూస్తోందని విపక్షాలు దుయ్యబడుతున్నాయి. అయితే దర్యాప్తు సంస్థలకు బిజెపికి సంబంధం లేదని కమలనాథులు అంటున్నారు. తాము ఎవరినీ టార్గెట్ చేయడం లేదంటున్నారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…