వేణుస్వామి అని ఒక జ్యోతిష్కుడు ఉన్నాడు. ఆయన మామూలు జ్యోతిష్కుడు కాదు. సెలబ్రిటీలకు జాతకం చెప్పే వ్యక్తి. సెలబ్రిటీల భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పేస్తాడు. ఆయన చెప్పిన వాటిలో ఎక్కువ తప్పులే ఉంటాయి. చెప్పినవి జరగవు. అయినా సరే వేణుస్వామి సోషల్ మీడియాలో ఫేమస్. ఆయన ఏమి చెబుతాడా అని జనం ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా అదే పని చేస్తున్నారనిపిస్తోంది.వేణుస్వామి తరహా జ్యోతిష్కం చెబుతున్నట్లుగా ఉందీ ఆయన తీరు…
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ చాలా కాలం కలుగులో దాక్కున్నారు. తుంటి ఎముక ఆపరేషన్ తో ఇంటికే పరిమితమయ్యారు. లోక్ సభ ఎన్నికల ప్రచారం ఊపందుకున్న వేళ.. కేసీఆర్ మళ్లీ జనంలోకి వస్తున్నారు. రోడ్ షోలు నిర్వహిస్తూ ప్రత్యర్థులపై ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తగిలిన గాయానికి.. లోక్ సభ ఎన్నికలతో మందు రాయాలని బీఆర్ఎస్ భావిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలతో హోరెత్తించేస్తున్న కేసీఆర్… బీజేపీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా సత్తా చాటాలని బీజేపీ భావిస్తున్న వేళ… కేసీఆర్ జోస్యం చెప్పారు. ఇందులో భాగంగా… బీజేపీకి రెండు వందల సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని అన్నారు. ఇదే సమయంలో… కేంద్రంలో హంగ్ వస్తే.. పార్లమెంట్ లో బీఆర్ఎస్ పాత్ర కీలకం అవుతుందని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. అందుకే తమకు ఎక్కువ లోక్ సభ సీట్లు ఇవ్వాలని తెలంగాణ ప్రజలకు కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.పైగా బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్డీయేకు 400 సీట్లు రావాలని ప్రధాని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారు. కనిష్టంగా 350 సీట్లు వస్తాయని అన్ని సర్వేలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీకి 200 సీట్లు మించవని కేసీఆర్ చెప్పడం వేణుస్వామి జాతకమే అవుతుందని జనం చర్చించుకుంటున్నారు….
బీఆర్ఎస్ ను బలోపేతం చేయాల్సిన తరుణంలో కేసీఆర్ ఆ దిశగా ఆలోచిస్తున్నారా లేదా అన్నది పెద్ద ప్రశ్న. లోక్ సభ ఎన్నికల్లో గెలిచేందుకు పాజిటివ్ ప్రచారానికి దిగుతారా లేదా అన్నది మరో అనుమానం. వాటిని వదిలేసి ఆయన వేణుస్వామి జాతకం మొదలు పెట్టారని విమర్శలు వస్తున్నాయి….
ఏప్రిల్ 27న బీఆర్ఎస్ 23వ వ్యవస్థాపక దినోత్సవం జరిగింది. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో అందరూ బిజీగా ఉన్నందున వేడుకలు వద్దని పార్టీ కార్యాలయాల్లో జెండాలు ఎగురవేయాలని అధిష్టానం ఆదేశించింది. అయితే చాలా చోట్ల ఆ పని కూడా జరగలేదని చెబుతున్నారు. నేతలంతా జారిపోయి కాంగ్రెస్, బీజేపీలో చేరడమే ఇందుకు కారణంగా చెప్పొచ్చు. బీఆర్ఎస్ ప్రస్తుత పరిస్తితికి కూడా ఏప్రిల్ 27 దర్పణం పడుతుంది. తెలంగాణ ఉద్యమం నాటి రోజులు కావివి. ఏది నిజమో, ఏది అబద్దమో ప్రజలకు మొత్తం తెలుసు. అలాంటప్పుడు కాకలు తీరిన కేసీఆర్ లాంటి రాజకీయ నాయకుడు ప్రదర్శించే రాజకీయ వ్యూహాలు ఫలిస్తాయనే గ్యారంటీ ఇప్పుడు లేదు. అంటే ఇవి ఫలించక పోవని కూడా లేదు. ప్రస్తుతం కేసీఆర్ కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నారు కాబట్టి పార్లమెంటు ఎన్నికల్లో కొన్ని సీట్లు ఆ పార్టీ గెలుస్తుందని అంచనాలు ఉన్నాయి. ఒకవేళ ఈ సీట్లు కూడా గెలిచే పరిస్థితి లేకపోతే.. వచ్చే ఆవిర్భావ దినోత్సవ నాటికి పార్టీ జెండా ఎగరవేసే పరిస్థితి కూడా ఉండదు .
పార్టీ పరిస్థితిని అర్థం చేసుకుని కేసీఆర్ ప్రవర్తించాలి. పార్టీ నేతలను ఉత్తేజ పరిచి.. వాళ్లు జారిపోకుండా చూసుకోవాలి. లోక్ సభ ఎన్నికల్లో ఫలితం సంగతి పక్కన పెట్టి పార్టీ భవిష్యత్తుపై దృష్టి పెట్టాలి. నిజమైన కార్యకర్తలకు తగిన గౌరవం కల్పించాలి.అంతే గానీ వేణుస్వామి జాతకాల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు….
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…