ఏం జేద్దామంటవ్ మరి!? పాట హిట్టయ్యిందిగా !

By KTV Telugu On 18 July, 2024
image

KTV TELUGU :-

ఏం జేద్దామంటవ్ మరి?.. లాక్ డౌన్ టైంలో ఓ ప్రెస్ మీట్ లో కేసీఆర్ చెప్పిన ఈ డైలాగ్.. సోషల్ మీడియాలో ఎంత పాపులరో అందరికీ తెలుసు. అంత పాపులర్ డైలాగ్ కాబట్టే.. పూరీ జగన్నాథ్ తన సినిమా పాటలో పెట్టేశాడు. లేటెస్ట్‌గా రిలీజైన మార్ ముంత.. చోడ్ చింత సాంగ్‌లో.. కేసీఆర్ డైలాగ్‌ని ఇరికించేశారు. అది కాస్తా మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. కానీ.. ఇక్కడే కొత్త రచ్చ మొదలైంది. కేసీఆర్ డైలాగ్ ఉన్న ఈ పాటపై కొత్త కాంట్రవర్శీ మొదలైంది. కొందరు కేసీఆర్ అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అట్లెట్ల మా సార్ డైలాగ్ పాటల పెడతర్రాభయ్ అంటూ.. సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్నారు.

ఈ మార్ ముంత.. చోడ్ చింత పాటలో.. హీరో, హీరోయిన్ కల్లు బాటిళ్లు పట్టుకొని చిందేస్తుంటారు. పాట మధ్యలో.. ఏం జేద్దామంటవ్ మరీ.. అనే కేసీఆర్ డైలాగ్ వస్తుంది. దాంతో.. కేసీఆర్ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. తెలంగాణ అంటే తాగుడు అనే భావన వచ్చేలా.. పాట మధ్యలో కేసీఆర్ టోన్ ఉపయోగించారంటూ ఫైర్ అవుతున్నారు. తెలంగాణ కల్చర్‌ను.. తాగుడు కల్చర్‌లా ప్రొజెక్ట్ చేసేలా సాంగ్ ఉందంటున్నారు.

నిజానికి.. పాపులర్ పొలిటీషియన్ల డైలాగుల్ని సినిమాల్లో వాడటం ఇదేం కొత్త కాదు. ఇదే ఆఖరిది కాదు. ఎందుకంటే.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో పాపులర్ అయిన వాళ్ల డైలాగుల్ని.. పాటల్లోకి ఎక్కించేస్తున్నారు. మొన్న జరిగిన ఏపీ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ చెప్పిన రానీలేమ్మా.. రానీలేమ్మా.. డైలాగును కూడా.. గొర్రె పురాణం టీజర్‌లో వాడేశారు. ఇప్పుడు.. కేసీఆర్ డైలాగ్‌ని పాటలో ఇరికించారు. అంతెందుకు.. మహేశ్ బాబు లేటెస్ట్ మూవీ గుంటూరు కారంలోనూ.. కుర్చీ తాత ఫేమస్ డైలాగ్.. కుర్చీని మడతపెట్టి.. అనే వాయిస్‌ని వాడుకొని ఓ పాటను వదిలారు. అదెంత.. బ్లాక్ బస్టర్ అయిందో చూశాం. ఇప్పుడీ.. మార్ ముంత సాంగ్ కూడా అంతే హిట్ అయింది.

అయితే.. ఇలాంటి వివాదాలు, మనోభావాలు దెబ్బతినడంపై.. గతంలోనే పూరీ రెస్పాండ్ అయ్యారు. బిజినెస్‌మ్యాన్ మూవీ ప్రమోషన్స్‌లో మాట్లాడుతూ.. పనీ పాట లేని వాళ్లకే మనోభావాలు దెబ్బతింటూ ఉంటాయని కామెంట్ చేశారు. ఇప్పుడు.. ఆ డైలాగులు కూడా వైరల్ అవుతున్నాయ్. ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటంటే.. ఈ పాట రాసింది, పాడింది కూడా తెలంగాణకు చెందిన వాళ్లే.! కాసర్ల శ్యామే ఈ పాట రాారు. రాహుల్ సిప్లిగంజ్ ఈ పాట పాడారు. దాంతో.. ఇద్దరూ తెలంగాణ ప్రాంతం వాళ్లై.. కేసీఆర్ డైలాగును పెట్టడమేంటనే ప్రశ్నలు లేవదీస్తున్నారు.