మరిన్ని దాడులు జరుగుతాయన్న పల్లా
తెలంగాణలో వరుసగా జరుగుతున్న ఐటీ, ఈడీ దాడులు. మంత్రులు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల్లో గుబులు పుట్టిస్తోంది. ఇలాంటి దాడులకు తాము భయపడం అని పైకి చెబుతున్నా చాలామందికి లోపల్లోపల ఆందోళనగానే ఉంది. ఇటీవల ఈడీ అధికారులు మంత్రి గంగుల కమలాకర్ ఇళ్లు, కార్యాలయాలపై దాడి చేశారు. తాళం వేసి ఉన్న మంత్రి ఇంటి తలుపులు బద్దలు కొట్టి మరీ లోపలికి వెళ్లి తనిఖీలు చేశారు. ఇంకోవైపు క్యాసినో వ్యవహారంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇద్దరు సోదరులను, పి.ఎను విచారించారు. తలసాని కుమారుడు సాయికృష్ణకు కూడా నోటీసులు జారీ చేశారు.
అది అలా ఉండగానే మంగళవారం తెల్లవారు జామున మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడి చేశారు. దాదాపు 65 బృందాలు మల్లారెడ్డి కుమారులు, బంధువుల ఇళ్లలో సోదాలు చేశాయి. ఇప్పటివరకు 8 కోట్ల నగదు, వందలాది ఎకరాల భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఎనిమిది బ్యాంకుల్లో 12 లాకర్లను గుర్తించారు. రాజకీయ కక్షలో భాగంగానే బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలను తమపై ఉసిగొల్పుతోందిని టీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అయినా తాము భయపడేది లేదని పదే పదే స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. మల్లారెడ్డి తరువాత ఐటీ ఎవరిని టార్గెట్ చేస్తుందనేది ఇప్పుడు టీఆర్‌ఎస్ నేతలకు నిద్ర లేకుండా చేస్తోంది.
ఇలాంటి దాడులు జరుగుతాయని తమకు ముందే తెలుసు అన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి. బీజేపీ కేంద్ర సంస్థలను రాజకీయాలకు వాడుకుంటోందని మండిపడ్డారు. దేశంలో 4 వేలమందిపై ఐటీ, ఈడీ, సీబీఐ దాడులు జరిగితే వారిలో 3,900 మంది బీజేపీలో చేరారని రాజేశ్వర్ రెడ్డి వెల్లడించారు. ఒకప్పుడు అవినీతి, అక్రమాల ఆరోపణలు ఎదుర్కొన్న వారు ఇప్పుడు బీజేపీలో చేరగానే నీతిమంతులు అయిపోతారా అని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి దాడులు మరిన్ని జరుగుతాయని భావిస్తున్నామని కానీ తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇలాంటి దాడులకు భయపడబోరని పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ఏ రైడ్ చేసుకుంటారో చేసుకోండి ఏ కేసు పెట్టుకుంటారో పెట్టుకోండి. ప్రజలు గమనిస్తున్నారు మీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో వారికి తెలుసు అని వ్యాఖ్యానించారు. దాడులకు భయపడి ఇతర పార్టీల్లో చేరే ప్రసక్తేలేదని తేల్చి చెప్పారు.
ప్రస్తుతం మంత్రులను టార్గెట్ చేసిన ఈడీ, ఐటీ అధికారులు ముందు ముందు కేసీఆర్, కేటీఆర్‌కు సన్నిహితంగా మెసిలే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీను కూడా టార్గెట్ చేసుకునే అవకాశం ఉందని టీఆర్‌ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, విద్యాసంస్థలు, నిర్వహించేవారు. కాంట్రాక్టులు చేసే వారి మీద ఐటీ వింగ్ కన్నేసిందని చెప్పుకుంటున్నారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు సన్నిహితంగా ఉంటారని అందరికీ తెలుసు. మల్లారెడ్డికి ఉన్నట్లే పల్లాకు కూడా ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. దాంతో ఐటీ తరువాత టార్గెట్ అయనే అయి ఉండవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణలో ఇలాంటి దాడులు మరిన్ని జరుగుతాయని అయినా తాము భయపడే ప్రసక్తే లేదని పల్లా చెప్పడం వెనకాల కారణం ఇదే అనంటున్నారు విశ్లేషకులు.
ఈడీ, ఐటీ దాడుల నేపథ్యంలో ఇప్పటికే చాలామంది నేతలు తమ ఆస్తిపాస్తులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరక్కుండా జాగ్రత్త పడినట్లు సమాచారం. ఎందుకైనా మంచిదని జిల్లా స్థాయి టీఆర్ఎస్ నేతలు కూడా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారని చెప్పుకుంటున్నారు. మరి ఐటీ నెక్స్‌ట్ టార్గెట్ ఎవరో తెలియాలంటే వెయిట్ చేయక తప్పదు.