ప్రియమైన శత్రువు చేసిన ఫిర్యాదు ఏమిటి ?

By KTV Telugu On 10 December, 2022
image

జగ్గారెడ్డి ఢిల్లీలో ఏం చేశారు ? బీఆర్ఎస్, బీజేపీ తీరును కాంగ్రెస్ అధిష్టానానికి వివరించేందుకే వెళ్లారా ? పెద్దలను మంచి చేసుకుంటే భవిష్యత్తులో ఉపయోగపడుతుందనుకున్నారా ? పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లారా ?

పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రేవంత్, జగ్గారెడ్డి బంధం.
రేవంత్ తగ్గినా.. పట్టు వీడని జగ్గా
పీసీసీ అధ్యక్షుడిపై జగ్గారెడ్డి ఫిర్యాదుల పర్వం.
ఢిల్లీలో ఖర్గే, వేణుగోపాల్ తో జగ్గారెడ్డి భేటీ.
రేవంత్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని జగ్గన్న ఫిర్యాదు.
కొందరికీ మాత్రమే రేవంత్ ప్రాధాన్యం.

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఇద్దరూ ప్రియమైన శత్రువులనే చెప్పాలి. జగ్గారెడ్డికి రేవంత్ పనితీరు నచ్చదు. ఇద్దరు నేతలు బయట నుంచి పార్టీలోకి వచ్చిన వారే ఆయినా జగ్గారెడ్డి తనకు తాను సీనియర్ అని భావిస్తుంటారు. అప్పుడప్పుడు అలుగుతారు. తిడతారు ఇంకేదేదో చేస్తారు. రేవంత్ స్వయంగా వచ్చి రాజీకి ప్రయత్నించినా ఆ కాసేపు మెదలకుండా ఉంటారు. తర్వాత మళ్లీ ముసుగులో గుద్దులాట జరుగుతూనే ఉంటుంది. ఇటీవల రేవంత్ వచ్చి జగ్గారెడ్డిని కలుసుకున్నారు. తమవి గిల్లికజ్జాలు మాత్రమేనని పగలు కొట్టుకుంటామని రాత్రి మందు కొడతామని చెప్పకున్నారు. జగ్గారెడ్డి కూడా నవ్వుతూ ఊరుకున్నారు..

ఫ్రెండ్ షిప్ ఉత్తుత్తి మాటే ఎందుకంటే కాంగ్రెస్ లో అది కుదరని పని. ఒక నాయకుడు రెండు మెట్లు ఎక్కితే మిగితా వాళ్లు నాలుగు మెట్లు వెనక్కి లాగడం హస్తం పార్టీకి ముందునుంచి ఉన్న ఆనవాయితీ. అందుకే జగ్గారెడ్డి ఢిల్లీలో ల్యాండ్ కాగానే ఆయన ఏం చేస్తున్నారు. ఎవరెవరిని కలుస్తున్నారు అన్న చర్చ మొదలైంది. పార్టీ తాజా అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ లాంటి నేతలను కలిసిన జగ్గారెడ్డి తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు చెబుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ లేదని చెప్పేందుకు టీఆర్ఎస్, బీజేపీ పనిచేస్తున్నాయని ఖర్గే దృష్టికి జగ్గా రెడ్డి తీసుకెళ్లారు.

రాష్ట్ర నాయకత్వంపై తనకు ఎలాంటి ఫిర్యాదులు లేవని జగ్గారెడ్డి చెప్పడం ఆ మాట నిజమేనని అధిష్టానం తలూపడం విడ్డూరంగా అనిపిస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ లో అందరినీ కలుపుకుని వెళ్లాలని ఖర్గే స్వయంగా జగ్గారెడ్డికి హితబోధ చేశారని బయటకు వినిపిస్తున్న మాట. అయితే లోపల చాలానే జరిగిందని అంటున్నారు. రేవంత్ రెడ్డిపై జగ్గన్న పెద్ద ఫిర్యాదుల చిట్టానే విప్పేశారట. ఒక లెటర్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. రేవంత్ ఒంటెత్తు పోకడతో పార్టీలో చాలా మందికి ఇబ్బంది కలుగుతోందని జగ్గారెడ్డి ఆ లేఖలో ఆరోపించారు. రేవంత్ ఒక గ్రూపును తయారు చేసుకుని మిగతా వారిని దగ్గరకు రానివ్వడం లేదని జగ్గా ప్రధాన ఆరోపణ. రేవంత్ రెడ్డి గ్రూపులో మల్లు రవి కీలక నేత అని పీసీసీ అధ్యక్షుడి వ్యవహారాన్నీ ఆయనే చూసుకుంటున్నారని జగ్గా ఫిర్యాదు చేశారు. మల్లు రవితో మాట్లాడితేనే పనులయ్యే పరిస్థితి ఉందట. అలా ఒకరిద్దరు నేతలను ప్రోత్సహిస్తూ మిగతావారిని పట్టించుకోవడం లేదని కూడా ఆరోపించారు.

జిల్లా శాఖలను రేవంత్ పూర్తిగా వదిలేశారని కొందరు నేతలు అంటున్నారు. అలా ఆరోపించే వారిలో జగ్గారెడ్డి కూడా ఒకరు. జిల్లాల్లో మొదటి నుంచి కష్టపడిన నేతలను వదిలేసి తనకు నచ్చిన వారితో రేవంత్ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారన్నది కూడా ఒక ప్రధాన ఆరోపణ. గత ఎన్నికల్లో గెలిచేందుకు తాము పడిన శ్రమను కూడా జగ్గా వివరించారట నిజానికి ఎన్నికల్లో ఓడిపోయే పరిస్థితి ఉండగా ఆస్తులు అమ్మి డబ్బులు ఖర్చుపెట్టి జగ్గారెడ్డి గెలిచారని పార్టీ వారే అంగీకరిస్తున్నారు అంత శ్రమపడిన తాను పదవులు ఆశించి టీఆర్ఎస్ లోకి వెళ్లకుండా కాంగ్రెస్ నే అంటిపెట్టుకుని ఉంటే అధిష్టానం మాత్రం రేవంత్ ను నెత్తిన పెట్టుకుందన్న ఆగ్రహం జగ్గారెడ్డిలో కనిపిస్తోంది. అదే ఆయన ఫిర్యాదులకు కారణమైంది. అధిష్టానం మాత్రం ఇలాంటి ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని సమాచారం.