చేతులు కాలాక మళ్లీ జై తెలంగాణ – పాపం కేటీఆర్ !

By KTV Telugu On 5 January, 2024
image

KTV TELUGU:-

తెలంగాణ బలం.. తెలంగాణ గళం.. తెలంగాణ దళం పార్లమెంట్‌లో ఉండాలి అంటే బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలని కేటీఆర్ గట్టిగా చెబుతున్నారు.  పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై తెలంగాణ భవన్ లో సమావేశం ఏర్పాటు చేశారు. తర్వాత తమ పార్టీ తెలంగాణ బ్రాండ్ అని ప్రకటించుకున్నారు. అందుకే గెలిపాంచాలన్నారు. కానీ ఆయన భారత రాష్ట్ర సమితి అని తమ పార్టీ పూర్తి పేరును ప్రకటించలేకపోయారు. ఎందుకంటే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు అడగాలనుకున్న కాన్సెప్ట్‌కు.. పార్టీ పేరుకు మ్యాచ్ కావడం లేదు. ఎలా చూసినా చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకుందామన్న ప్రయత్నంలో బీఆర్ఎస్ అగ్రనేతలు ఉన్నట్లుగా స్పష్టమవుతుంది. ఎలా చూసినా ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేదు. మరి మళ్లీ  పార్టీని బీఆర్ఎస్‌గా మారుస్తారా ?

తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరులో ఓ ఎమోషన్ ఉంది. అది తెలంగాణ ప్రజలకు మాత్రమే తెలుసు. తెలంగాణ వాదం నరనరాన  నింపుకున్న వారికి మాత్రమే అనుభవమవుతుంది. ప్రతి రాజకీయ పార్టీలు కొంత ఓటు బ్యాంక్ ఉంటుంది. చాలా పార్టీలకు కులం.. బీజేపీకి మతం వంటివి ఓటు బ్యాంకులు. కానీ టీఆర్ఎస్‌కు ఓటు బ్యాంక్ తెలంగాణ వాదం. కుల, మతాలకు అతీతంగా తెలంగాణ వాదమో ఓటు బ్యాంక్.  ఓ రకంగా ఈ సెంటిమెంటే బీఆర్ఎస్‌కు కవచ కుండలాలు కానీ.. కేసీఆర్ ఏం ఆలోచించారో కానీ..జాతీయ నాయకుడు అయిపోవాలన్న ఉద్దేశంతో ఆ సెంటిమెంట్ ను వదిలేసుకున్నారు. తన పార్టీ పేరు నుంచి తెలంగాణ తీసేశారు. భారత్ అని తగిలించుకున్నారు. తెలంగాణ కోసం ఎంతో చేశామని ఇక దేశానికి చేయాల్సి ఉందని.. అందుకే జాతీయ వాదాన్ని అందుకున్నామన్నారు. ఏడాది తర్వాత తిరగిి చూసుకుంటే.. ఇప్పుడు మళ్లీ తెలంగాణ వాదంతోనే ఎన్నికలకు వెళ్తామని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పడిన దెబ్బ నుంచి కోలుకునేందుకు లోక్‌సభ ఎన్నికల్లో కనీస సీట్లు సాధించేందుకు వదిలేసిన తెలంగాణ సెంటిమెంట్ ను అద్దెకు తెచ్చుకుంటున్నారు.

లోక్ సభ ఎన్నికల్లో వారి ముందున్న అసలు సవాల్.. బీఆర్ఎస్‌కు ఎందుకు ఓటేయాలో ప్రజలకు చెప్పడం. అసెంబ్లీకే వద్దనుకున్న ప్రజలు పార్లమెంట్‌కు బీఆర్ఎస్‌కు ఎందుకు ఓటేస్తారన్న సందేహం సహజంగానే బీఆర్ెస్ నేతలకు వస్తోంది. ప్రజలను ఎలా కన్విన్స్ చేయాలా అని మేథోమథనం చేశారు. చివరికి తెలంగాణ బలం,  తెలంగాణ గళం , తెలంగాణ దళం బీఆర్ఎస్ కాబట్టి ఓటేయాలన్నారు. పార్లమెంట్‌లో తెలంగాణ వాయిస్ బలంగా వినిపించాలంటే బీఆర్ఎస్‌కే ఓటేయాలని ప్రజలకు చెప్పాలనుకుంటున్నారు.  పార్లమెంట్ ఎన్నికలు ప్రత్యేకంగా జరుగుతున్నందున  ఇప్పుడు ఓటింగ్ ప్రయారిటీ ఖచ్చితంగా జాతీయ అంశాలపై ఆధారపడి ఉంటుంది. దేశానికి ప్రధానమంత్రి ఎవరు కావాలన్న టాపిక్ మీద ప్రజలు ఓట్లేస్తారు. మోదీ మూడో సారి ప్రధానిగా కొనసాగాలా లేకపోతే రాహుల్ గాందీకి చాన్సివ్వాలా అన్న చాయిస్ పరంగా ఓటింగ్ జరుగుతుంది. మరీ ఈ చాయిస్ లో బీఆర్ఎస్ ప్రస్తావన రావడానికి అవకాశం లేదు. మరి ఓటింగ్ ఎలా వస్తుంది.  ఇక్కడా  బీఆర్ఎస్ పార్టీ చేసిన వ్యూహాత్మక తప్పిదాలు అడ్డం వస్తున్నాయి. బీఆర్ఎస్ అని జాతీయ పార్టీగా మార్చి  తెలంగాణ కోసమే కొట్లాడుతామని తమను గెలిపించాలని కోరడం  కాస్త అతిశయోక్తిగా ఉంటుంది. కానీ ఇంతకు మించి మరో ఆప్షన్ లేదు.

తెలంగాణ వాయిస్‌ను మాత్రమే పార్లమెంట్ లో వినిపిస్తామని బీఆర్ఎస్‌కే ఓటేయాలని అడగలాని విధానంగా పెట్టుకున్నారు కాబట్టి ఇతర రాష్ట్రాల్లో పోటీ ఆలోచనను బీఆర్ఎస్ విరమించుకున్నట్లుగా తెలుస్తోంది.గతంలో మహారాష్ట్ర, తెలంగాణలో కలిసి యాభై లోక్ సభ సీట్లు గెలిస్తే కేంద్రంలో చక్రం తిప్పవచ్చని  కేసీఆర్, కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.  ఇప్పుడు .. మహారాష్ట్ర వైపు చూసేందుకు కూడా తీరిక ఉండటం లేదు. గతంలో తెలంగాణ రాజకీయాల కన్నా మహారాష్ట్ర రాజకీయాలపైనే కేసీఆర్ ఎక్కువ దృష్టి పెట్టేవారు.  ఇప్పుడు బీఆర్ఎస్ కోసం మహారాష్ట్ర నుంచి ఒక్కరూ రావడం లేదు. చేరికల గురించి ఎలాంటి ప్రచారం లేదు. బీఆర్ఎస్ నేతలు మహారాష్ట్ర వైపు పోవడం లేదు. చివరికి కేసీఆర్ కూడా ఎలాంటి ఆలోచనలు చేస్తున్నట్లుగా కనిపించడం లేదు. వేరే  రాష్ట్రాల్లో పోటీ చేస్తే.. తెలంగాణ కోసమే నిలబడతామన్న తమ ప్రకటనలకు విలువ ఉండదని అందుకే ఇతర రాష్ట్రాల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

బీఆర్ఎస్ ఇప్పుడు ఉనికి సమస్యలో డబుల్ డిజిట్ పార్లమెంట్ సీట్లు సాధించకపోతే.. రెండు జాతీయ పార్టీలు మీదపడిపోతాయి. బీఆర్ఎస్  ను బలహీనం చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తాయి. అందుకే  బీఆర్ఎస్ కు ఇప్పుడు లోక్ సభ ఎన్నికలు అత్యంత విషమ పరీక్ష. గెలవకపోతే  పార్టీని కాపాడుకోవడం చాలా కష్టమవుతుంది. అందుకే వదిలేసిన తెలంగాణ సెంటిమెంట్ అనే కవచ కుండలాలతో మళ్లీ పోరాటానికి సిద్ధమయింది. కానీ వాటి పవర్ ఇంకా ఉందా లేదా అన్నది మాత్రం ఫలితాల తర్వాతే తేలుతుంది. కానీ తెలిసి చేసిన ఓ తప్పు తమ పార్టీని క్రమంగా దహించి వేస్తోందని బీఆర్ఎస్ పెద్దలకు ఇప్పటికైనా అర్థమయిందా లేదా అన్నది మాత్రం సస్పెన్సే…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి