జనసేన పార్టీ గేర్ మార్చింది. ఏపీలో వారాహి నాలుగో విడత యాత్రతో ప్రకంపనలు సృష్టిస్తోంది.ఇటు తెలంగాణాలోనూ వచ్చే ఎన్నికల్లో 32 నియోజక వర్గాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించి దూకుడు ప్రదర్శించింది.ఒక వేళ తెలంగాణాలో ఏ పార్టీతో అయినా పొత్తులు అనివార్యం అయితే అపుడు తాము పోటీ చేయబోయే నియోజక వర్గాలు కొన్ని అటూ ఇటూ కావచ్చునని ఆ పార్టీ అంటోంది. ఏపీలో అయితే వచ్చే ఎన్నికల తర్వాత టిడిపి-జనసేన ప్రభుత్వమే వస్తుందని పవన్ కళ్యాణ్ ఇప్పటికే ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణాలోనూ బలమైన ముద్ర వేస్తామని అంటున్నారు. అయితే జనసేన అభ్యర్ధులు బరిలో ఉంటే ఏదో ఒక పార్టీకి చెందిన ఓట్లు గణనీయంగా చీలే అవకాశాలు ఉంటాయని రాజకీయ పండితులు భావిస్తున్నారు.
2019 ఎన్నికల తర్వాత బిజెపితో జట్టు కట్టిన జనసేన ఆ తర్వాత జరిగిన వివిధ ఎన్నికల్లో మాత్రం బిజెపితో పొత్తు పెట్టుకోలేదు. అలాగని జనసేన అభ్యర్ధులనూ బరిలోకి దింపలేదు.మరో రెండు నెలల్లో జరగనున్న తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల బరిలో మాత్రం కచ్చితంగా పోటీ చేయాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. జనసేనకు పాతిక్కి పైగా నియోజక వర్గాల్లో చాలా ఎక్కువ సంఖ్యలో ఓటర్ల బలం ఉందని వారు భావిస్తున్నారు. కొన్ని నియోజక వర్గాల్లో జనసేన విజయం సాధించడం ఖాయమని వారు అంచనాలు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే 32 నియోజక వర్గాల్లో పోటీ చేయాలని డిసైడ్ చేశారు. అందులో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే 9 నియోజక వర్గాల్లో అభ్యర్ధులను నిలబెట్టాలని భావిస్తున్నట్లు జనసేన తెలంగాణా విభాగం ఉపాధ్యక్షుడు బొంగునూరి మహేందర్ రెడ్డి ప్రకటించారు.
గ్రేటర్ పరిధిలోని ఎల్బీ నగర్, ఉప్పల్, మేడ్చల్, మల్కాజగిరి, కుత్బుల్లా పూర్, కూకట్ పల్లి, శేరిలింగం పల్లి,పటాన్ చెరు ,సనత్ నగర్ నియోజక వర్గాలనుంచి జనసేన పోటీ చేయాలని భావిస్తోంది. ఇక మిగతా తెలంగాణా జిల్లాల్లో కొత్తగూడెం, సత్తుపల్లి, అశ్వారావు పేట, వైరా, ఖమ్మం, పాలేరు, ఇల్లందు ,మధిర, మునుగోడు, నకిరేకల్, హుజూర్ నగర్, కోదాడ, నాగర్ కర్నూల్, పాలకుర్తి, నర్సంపేట, హుస్నాబాద్, స్టేషన్ ఘన్ పూర్, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్, మంథని,జగిత్యాల, రామగుండం, ఖానాపూర్ నియోజక వర్గాల నుండి జనసేన పోటీ చేయబోతోంది. ఈ నియోజక వర్గాలన్నింటా పవన్ కళ్యాణ్ కు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారని వారంటున్నారు. ఈ స్థానాల్లో జనసేనే కింగ్ మేకర్ గా అవతరిస్తుందని వారంటున్నారు.
ఏపీలో తెలుగుదేశంతో పొత్తులో ఉన్న జనసేన ఇప్పటికీ బిజెపితో పొత్తులోనే ఉన్నానని చెబుతోంది. మరి తెలంగాణాలో ఎవరితో పొత్తు పెట్టుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఏపీలో టిడిపితో పొత్తు పెట్టుకున్నట్లే తెలంగాణాలోనూ అదే పార్టీతో జట్టు కడుతుందా? లేక తెలంగాణాలో బిజెపితో పొత్తు పెట్టుకుంటుందా? అన్నది తేలాల్సి ఉంది. ఒక వేళ టిడిపి-బిజెపిలు రెండింటితోనూ కలిసి ముందుకు సాగే అవకాశాలను కూడా కొట్టి పారేయలేం అంటున్నారు రాజకీయ పండితులు. పొత్తులు ఎవరితోనూ అన్నది ఖరారు అయితే జనసేన పోటీ చేయబోయే నియోజక వర్గాల్లో కొన్ని మార్పులు కూడా ఉండే అవకాశాలు ఉంటాయంటున్నారు. చంద్రబాబు నాయుడి అరెస్ట్ నేపథ్యంలో టిడిపితో కలిసి వెళ్తామని ప్రకటించిన పవన్ కళ్యాణ్ తెలంగాణాలోనూ ఆ స్నేహాన్ని కొనసాగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని టిడిపి వర్గాలు ప్రచారం చేసుకుంటున్నాయి.
తెలంగాణాలో జనసేన అభ్యర్ధులు బరిలో దిగితే అది ఏ పార్టీపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుందన్నది చర్చనీయాంశమవుతోంది. జనసేనకు కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఆకర్షితులవుతారు కాబట్టి ఆ సామాజిక వర్గం ఓట్లు పెద్ద సంఖ్యలో జనసేనకు పడే అవకాశాలున్నాయి. ఇది కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు గండి కొడుతుందా లేక పాలక బి.ఆర్.ఎస్. కి నష్టం చేకూరుస్తుందా అన్నది చూడాలి. ఒక వేళ జనసేన తాను పోటీ చేయబోయే 32 నియోజక వర్గాల్లో మెజారిటీ స్థానాల్లో విజయం సాధిస్తే మాత్రం తెలంగాణాలో కింగ్ మేకర్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. కర్నాటకలో జేడీయూ బాటలో జనసేన నేతలు కీలక పదవులు పొందే అవకాశాలనూ తోసి పుచ్చలేం అంటున్నారు రాజకీయ పండితులు.
తెలంగాణాలో చాలా సమస్యలపై జనసేన ప్రజల తరపున పోరాటాలు చేసిందంటున్నారు మహేందర్ రెడ్డి.మరో వారం రోజుల్లో జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందా లేక పొత్తులతో బరిలోకి దిగుతుందా అన్నది తేలిపోతుంది. మరో పది రోజుల్లో తెలంగాణా ఎన్నికలకు నగారా మోగనుంది. ప్రస్తుతం ఏపీలో వారాహి యాత్ర నాలుగో విడత నిర్వహిస్తోన్న పవన్ కళ్యాణ్ తెలంగాణా లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఏపీలో టిడిపితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటోన్న పవన్ కళ్యాణ్ తెలంగాణాలోనూ కుంభస్థలాన్ని కొట్టాలని చూస్తున్నట్లు ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…