తెలంగాణలో పవన్‌ కళ్యాణ్ రాజకీయం

By KTV Telugu On 12 December, 2022
image

తెలంగాణ అసెంబ్లీకి ఇంకో ఏడాదిలో ఎన్నికలు జరగనున్నాయి. అంతవరకు ఆగకుండా సీఎం కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తాడనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు రాజకీయా పార్టీలు ఇప్పటినుంచే అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. దాంతో రాష్ట్రంలో పొలిటికల్‌ హీట్ పెరిగిపోయింది. ముచ్చటగా మూడో సారి గెలిచి అధికారంలోకి రావడానికి సీఎం కేసీఆర్‌ వ్యూహాలు రచిస్తున్నారు. ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలనే ఆలోచనతో బీజేపీ రంగంలోకి దిగుతోంది. అంతర్గత కలహాలతో కాంగ్రెస్‌ పార్టీ ఉనికి కోసం పోరాడుతోంది. దాంతో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ ప్రధానంగా టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్యే ఉంటుందని చెప్పవచ్చు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌కు మద్దతు పలికిన కమ్యూనిస్టులు వచ్చే ఎన్నికల్లో కూడా కేసీఆర్‌ వెంట నడిచే అవకాశం ఉంది.

ఇకపోతే షర్మిల స్థాపించిన వైఎస్‌ఆర్‌టీపీ ప్రభావం ఎలా ఉంటుందో చెప్పలేము. పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లిన షర్మిలను తెలంగాణ ప్రజలు ఆదరిస్తారా లేదా అనేది కూడా చెప్పలేము. ఇకపోతే తెలుగుదేశం పార్టీ దుకాణం ఎప్పుడో క్లోస్‌ చేసేశారు. ఇలాంటి సిట్యుయేషన్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అయింది జనసేన పార్టీ. 32 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటోంది. ఇందుకోసం ఆయా నియోజవర్గాల్లో కార్య నిర్వాహకులను పార్టీ నియమించింది. వీరంతా ఆయా నియోజకవర్గాల్లో పర్యటించి నివేదిక తయారు చేస్తారని దాని ప్రకారం టికెట్లు కేటాయిస్తామని జనసేన తెలంగాణ ఇన్‌చార్జి శంకర్‌ గౌడ్ స్పష్టం చేశారు. గతంలో మంగళగిరిలో జరిగిన జనసేన పార్టీ సమావేశంలో పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ తెలంగాణలో ఏడు నుంచి పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు కంటే ఎక్కువ పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు కార్యకర్తలు రెడీగా ఉండాలని సూచించారు. త్వరలో తెలంగాణలోని కొండగట్టు దేవస్థానం వద్ద నుంచి తాను పాదయాత్ర ప్రారంభిస్తానని అన్నారు. ప్రస్తుతం జనసేన ఆంధ్రప‌్రదేశ్‌ లో బీజేపీతో సహవాసం చేస్తోంది. మరి తెలంగాణలో కూడా బీజేపీతో కలిసి పోటీ చేస్తుందా లేక ఒంటరిగా వెళ్తుందా అనేది తెలియదు.

ఏపీలో తాము జనసేన కలిసే ఎన్నికలకు వెళ్తామని అక్కడి బీజేపీ నేతలు చెబుతుంటే, తెలంగాణలో పవన్‌తో పొత్తు సమస్యే లేదు అని ఇక్కడి బీజేపీ నాయకులు ఇదివరకే స్పష్టం చేశారు. అదీ కాకుండా పవన్‌ కళ్యాణ్‌ కొంతకాలంగా ఏపీ సీఎం జగన్‌ పైన వైసీపీ నాయకులపైనా నోటికొచ్చినట్లు విమర్శలు చేస్తున్నారు. ఆ మధ్య చెప్పు చూపిస్తూ ఇంకో సారి తనను విమర్శిస్తే చెప్పుతో కొడతా కొడకల్లారా అని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల బరిలో దిగాలనుకుంటున్న పవన్‌ అధికార పార్టీ చేస్తున్న తప్పులను ఎత్తిచూపక తప్పదు. సీఎం కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ నాయకులపై విమర్శలు గుప్పించక తప్పదు. కేసీఆర్‌ను ఏమైనా అంటే ఏపీలో ఊరుకున్నట్లు ఇక్కడ టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఊరుకునే పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పుడు తాను పదకొండు రోజులు అన్నం తినలేదని గతంలో పవన్‌ చేసిన వ్యాఖ్యలను ఎవరూ మర్చిపోలేదు. పవన్‌ కు తెలంగాణాలో లక్షల మంది అభిమానులు ఉన్నాకూడా వారిలో ఎంత మంది ఆయనకు ఓట్లు వేస్తారో తెలియదు. నిజంగా పవన్‌ కళ్యాణ్‌ గనక తెలంగాణాలో ఎన్నికల బరిలోకి దిగితే పోటీ రసవత్తరంగా ఉంటుందని చెప్పక త్పదు.