తెలంగాణలో పోటీ చేసి జనసేన ఆంధ్రప్రదేశ్లో కష్టాలు కొని తెచ్చుకుందా ? తెలంగాణలో పోటీ తూ తూ మంత్రంగా మారిందన్నఫీలింగ్ వచ్చేసిందా ? దానితో ఏపీ జనసేన కేడర్ లో కొత్త భయాలు పట్టుకున్నాయా ? జనసేనకు సొంత బలం లేదన్న ప్రచారాన్ని ఆ పార్టీ తిప్పుకొట్టే అవకాశాలున్నాయా ? ఈ పరిస్థితి తెలుగుదేశానికి అడ్వాంటేజ్ గా మారుతుందా…
తెలుగుదేశం చేయలేని పని తాను చేస్తున్నానని జబ్బలు చరుచుకున్న జనసేనకు ఇప్పుడు కొత్త సమస్యలు వచ్చిపడ్డాయి. అనుకున్నదొక్కటీ, ఐనదొక్కటీ అన్నట్లుగా తయారైన పరిస్థితి నుంచి బయట పడేందుకు తంటాలు పడటం జనసేనపై పడింది. బలమూ, బలహీనత తెలుసుకోకుండా ఆ పార్టీ తెలంగాణ బరిలోకి దిగిందన్న ఆరోపణలు వినిపించడానికి కారణాలు ఏమిటి. 32 సీట్లలో బలం ఉందని బాకా ఊదుకుని… చివరకు ఎనిమిది స్థానాల పోటీకి పరిమితమైన జనసేన అక్కడ కూడా అభ్యర్థులు లేక వెలవెలబోయిన మాట వాస్తవం . 8 స్థానాలకు జనసేన అభ్యర్థులను ప్రకటిస్తే.. అందులో కేవలం అయిదుగురు మాత్రమే.. పార్టీతో ముందునుంచి అనుబంధం కలిగి ఉన్న వారు. 8 లో 3 స్థానాలకు కనీసం తమ సొంత అభ్యర్థులకు గతిలేని, ఫిరాయించి వచ్చిన వారికి టికెటివ్వడమే తప్ప వేరే దోవ లేని దీనస్థితిలో ఆ పార్టీ ఉంది. కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి ముందురోజు వరకు బీజేపీ టికెట్ కోసం ప్రయత్నించిన ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ హఠాత్తుగా జనసేనలోకి ఒక గెంతు వేసి టక్కున టికెట్ పట్టేశారు. కొత్తగూడెం అభ్యర్థి లక్కినేని సురేందర్ రావు, అశ్వారావు పేట అభ్యర్థి ముయబోయిన ఉమాదేవీ.. రెండు రోజుల ముందే జనసేనలో చేరారు. వాపు కూడా లేని చోట బలుపు ఉన్నట్లుగా చూపించుకోవడం అంత అవసరమా అన్న ప్రశ్న ఇలాంటి చర్యల వల్లే కలిగిందని చెప్పుకోవాలి.
తెలంగాణలో పోటీ నుంచి టీడీపీ తప్పుకుంది. వైసీపీ అలాంటి ప్రయత్నమే చేయలేదు. ఇక్కడ గెలవడం కుదరదని తెలుసుకుని ఆ రెండు పార్టీలు దూరం జరిగాయి. బలమున్నట్లుగా ఎలాంటి ఆధారాలు లేని జనసేన మాత్రం బీజేపీ అండ చూసుకుని బరిలోకి దూకింది. తెలంగాణలో బీజేపీకి కొంత బలమున్న మాట నిజమే అయినా… రెండు పార్టీల అసలు స్నేహం ఆంధ్రప్రదేశ్లోనేనని చెప్పుకోవాలి. అక్కడి బలాన్ని, ఇక్కడి సెటిలర్ల మద్దతును క్యాష్ చేసుకునేందుకు జనసేనను బీజేపీ రంగంలోకి దించిందని చెప్పుకోక తప్పుదు. ఆ ట్రాప్ లో జనసేన పడిపోయిన కారణంగా ఏపీలో రేపటి పరిస్తితులేమిటన్న ప్రశ్న తలెత్తుతోంది.
డిసెంబరు 3న తెలంగాణ ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. పోటీ చేసిన 8 స్థానాల్లో జనసేన ఎన్ని చోట్ల గెలుస్తుందో తేలిపోతుంది. కనీసం సగం చోట్లయినా గెలవకపోతే పవన్ కల్యాణ్ కు గడ్డుకాలం తప్పదన్న చర్చ జరుగుతోంది. అక్కడ గెలవని పార్టీ ఇక్కడెందుకని ఏపీ ప్రజలు ఆలోచించొచ్చు. ఆ ఆలోచన టీడీపీలో కూడా వస్తే పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పైగా ఒక పర్సెంట్ కూడా ఓట్ షేర్ లేని బీజేపీని నమ్మి పొత్తు ఎందుకు పెట్టుకున్నారన్నది కూడా మరో ప్రశ్న. ఎందుకంటే బీజేపీతో అంటకాగేందుకు టీడీపీ ఇష్టపడటం లేదు. తప్పని సరి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోవాల్సి రావచ్చు. ఐనా తెలంగాణలో బీజేపీతో కలిసినందువల్ల జనసేన పట్ల టీడీపీ అభిమానుల్లో కాస్త వ్యతిరేకత వ్యక్తమైన మాట వాస్తవం. సెటిలర్లలో మెజార్టీ వర్గం బీఆర్ఎస్, బీజేపీలకు వ్యతిరేకంగా ఉన్నారన్న సంగతి పవన్ కల్యాణ్ కు తెలీదా. తెలిసి కూడా పోలరైజేషన్ గేమ్ ఆడారా అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. కొందరైతే పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ కు ద్రోహం చేశారన్న ఆరోపణలు కూడా చేస్తున్నారు.
జనసైన్యాధ్యక్షుడు, జన సైనికుల మధ్య ఒక చిన్న తేడా ఉంది. పవన్ కల్యాణ్ కు ఎంత బలముందన్నది జనసైనికులకు, వీర మహిళలకు పట్టదు. పవన్ ను సీఎంగా చూడటమే వారి ముందున్న ఏకైక లక్ష్యం. వాళ్లకు భిన్నంగా పవన్ ఆలోచించాలి. తన బలమేమిటో తెలుసుకుని ప్రవర్తించాలి. లేకపోతే కొంచెం దెబ్బతిన్న రాజకీయ ప్రత్యర్థులే కాకుండా, మిత్రపక్షమైన తెలుగుదేశం కూడా దూరం పెట్టే అవకాశం ఉంది. బలం లేదని నిరూపితమైన తర్వాత మీ డిమాండ్లను ఎందుకు పట్టించుకోవాలని నిలదీసే అవకాశం ఉంది. ఐనా చేయగలిగిందేముందీ గోదాలోకి దిగారు కదా.. ఏ జరుగుతుందో చూద్దాం…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…