ముఖ్యమంత్రి పీఠానికి జానెడు దూరం

By KTV Telugu On 20 October, 2023
image

KTV TELUGU :-

ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు అమితాబ్ బచ్చన్ అన్నట్లు ఉంది  తెలంగానా కాంగ్రెస్ వ్యవహారం. వచ్చే ఎన్నికల్లో విజయం తమదేనని ధీమాగా ఉంది కాంగ్రెస్ పార్టీ. అందుకే వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ లోకి వలసలు పోటెత్తుతున్నాయి. ఇక ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరు ? అన్న ప్రశ్నలు కూడా షికార్లు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్ధులకు కొదవేముంది? కనీసం ఓ పది మంది ముఖ్యమంత్రి అభ్యర్ధులు తేలిగ్గా దొరుకుతారు. మరి  కిరీటం దక్కేది ఎవరికి అన్నదే ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది.

తెలంగాణా కాంగ్రెస్ లోనే అత్యంత సీనియర్ అయిన కుందూరు జానారెడ్డి అయిదు సార్లు చలకుర్తి నియోజక వర్గం నుండి రెండు సార్లు నాగార్జున సాగర్ నియోజక వర్గం నుండి విజయభేరి మోగించారు. ఈ ఎన్నికల్లో ఆయన  సొంత నియోజక వర్గం అయిన నాగార్జున సాగర్ నుండి జానారెడ్డి తనయుడు జైవీర్ రెడ్డి బరిలో దిగుతున్నారు. కొద్ది వారాలుగా తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ హవా చాలా గట్టిగా వీస్తోంది. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని అంతటా అనుకుంటున్నారు. దాంతో కాంగ్రెస్ శ్రేణుల్లో సహజంగానే విపరీతమైన జోష్ పెరిగిపోయింది. ఒక వేళ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం ముఖ్యమంత్రి రేసులో చాలా మంది ఉంటారు.

తెలంగాణా కాంగ్రెస్ నేతల్లోనే కాదు ఆ మాటకొస్తే  దేశంలోనే  ఎక్కువ కాలం మంత్రిగా వ్యవహరించిన రికార్డు జానారెడ్డి సొంతం. 1978లోనే  రాజకీయాల్లో అడుగు పెట్టారు జానారెడ్డి. మొదటి ఎన్నికల్లో జనతా పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. 1983లో దివంగత ఎన్టీయార్  టిడిపిని స్థాపించినపుడు  అందులో చేరి ఘన విజయం సాధించారు. ఎన్టీయార్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. 1989 ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరిన జానారెడ్డి ఆ ఎన్నికల్లోనూ  విజయం సాధించి మంత్రి అయ్యారు. 1994 ఎన్నికల్లో ఎన్టీయార్ ప్రభంజనంలో ఓటమి చెందిన జానారెడ్డి 1999 నుండి వరుసగా నాలుగు ఎన్నికల్లో  గెలుస్తూ జైత్రయాత్ర చేశారు.

రాష్ట్ర విభజన తర్వాత  2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలిచారు జానారెడ్డి. అపుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే  ముఖ్యమంత్రి రేసులో ఆయన కూడా ముందంజలో ఉండేవారే. కాకపోతే ఆ ఎన్నికల్లో బి.ఆర్.ఎస్. అధికారంలోకి రావడంతో  కాంగ్రెస్  ప్రతిపక్షానికి పరిమితం అయ్యింది. 2018 ఎన్నికల్లో  జానారెడ్డి ఓటమి చెందారు. నోముల నర్సింహయ్య చేతుల్లో ఓడిపోయారు. రెండేళ్ల తర్వాత నోముల మరణంతో వచ్చిన ఉప ఎన్నికల్లోనూ జానా ఓటమి చెందారు.

తాజాగా మీడియా ప్రతినిథులు  జానారెడ్డిని కలిసినపుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీరు ముఖ్యమంత్రి పదవి రేసేలో ఉంటారా? అని ప్రశ్నించారు. దానికి జానారెడ్డి తనదైన శైలిలో రిటార్ట్ ఇచ్చారు. నేను ఎప్పుడూ కూడా పదవుల రేసులో ఉండను. పదవులే జానా రేసులో దూసుకుపోతూ ఉంటాయి. తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ముఖ్యమంత్రి పదవే రేసులో దూసుకొంటూ జానా దగ్గరకు వస్తుంది అని నవ్వేశారు. జానారెడ్డి  సరదాకి అన్నా కూడా తెలంగాణా కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడానికి అన్ని విధాల అర్హతలు ఉన్న  రాజకీయ కురువృద్ధుల్లో జానా ముందంజలోనే ఉన్నారని చెప్పక తప్పదు.

నవంబరు 30న తెలంగాణా  కు ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబరు 3న  పార్టీల జాతకాలు తేలిపోతాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే స్థానాలు సాధిస్తే  పార్టీ హై కమాండ్ గత కొన్నేళ్లుగా దేశంలో ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తోన్న విధానాన్నే ఇక్కడ కొనసాగిస్తే జానారెడ్డి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉంటాయంటున్నారు. మధ్య ప్రదేశ్‌, రాజస్థాన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయాల్లో యువ నేతలు జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలట్ లు కీలక పాత్ర పోషించినా.. హై కమాండ్ మాత్రం సీనియర్లు అయిన కమల్ నాథ్, అశోక్ గెహ్లాట్ లనే ముఖ్యమంత్రులను చేసింది. తెలంగాణాలోనూ అదే ఫార్ములా అమలు చేస్తే  పార్టీ విజయంలో రేవంత్ రెడ్డి  కీలక పాత్ర పోషించినా ముఖ్యమంత్రి పదవి మాత్రం సీనియర్లకే దక్కుతుందని అందులో జానారెడ్డి అగ్రగణ్యుడని రాజకీయ పండితులు అంటున్నారు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి