మళ్లీ మళ్లీ రాజకీయాల్లోకి రావడంలో జయప్రద దిట్ట. పార్టీలు మారి ప్రయోజనం పొందడంలో కూడా మాస్టర్. ఆమె రాజ్యసభను చూశారు. లోక్ సభనూ చూశారు. అసెంబ్లీకి వచ్చి స్టేట్ మినిష్టర్ అవుదామనుకుంటే ఆమెకు కుదరలేదు. ఇప్పుడామె మళ్లీ లోక్ సభకు వెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. అదీ కొత్త పార్టీ టికెట్ మీద.. ఎంత మేర సక్సెస్ అవుతారో..
సినిమా, పాలిటిక్స్ రెండింటింలోనూ రాణించి…. అప్ అండ్ డౌన్స్ ఎదుర్కొన్న జయప్రద సరికొత్త ఇన్నింగ్స్ కు తెరతీస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుటికే మూడో పార్టీలో ఉన్న జయప్రద..ఇప్పుడు గులాబీ కండువా కప్పుకుని కారెక్కేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రం దాటి వెళ్లడం ఆమెకు అలవాటే అయినా ఈ సారి పడమట ప్రయాణం సేఫ్ అనుకున్నట్లుగా చెబుతున్నారు. కేసీఆర్ ఈ మేరకు ఆమెకు ఆఫరిచ్చారన్నది ప్రధాన వార్త…
అతి చిన్న వయసులోనే హీరోయిన్ గా రాణించిన సినీ నాయకి జయప్రద ఇప్పుడు తన రాజకీయ జీవితంలో కీలక చౌరస్తాలో నిల్చుని ఉన్నారు. సినీరంగంలో తనదైన ముద్ర వేసిన ఆమె 1994లో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 1996లో టీడీపీ రాజ్యసభ సభ్యురాలయ్యారు. తర్వాత పార్టీ మారి సమాజ్ వాదీలో చేరారు. 2004 నుంచి 2014 వరకు ఉత్తర ప్రదేశ్లోని రాంపూర్ లోక్ సభా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు సెకెండ్ టర్మ్ లో ఆమెకు సమాజ్ వాదీ పార్టీలో ఇబ్బందులు ఎదురై.. పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. అప్పుడు అమర్ సింగ్ తో కలిసి వేరు పార్టీ పెట్టుకున్నారు. 2019లో ఆమె బీజేపీలో చేరినా ఆ పార్టీలో ఆమె క్రియాశీలంగా లేరు. ఇప్పుడామె బీజేపీని వదిలేసే ఆలోచనలో ఉన్నారు..
బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ర చంద్రశేఖర్ రావు ఆమెకు ఒక ఆఫరిచ్చినట్లు తెలుస్తోంది. ఆయన ఆహ్వానం మేరకు ఇప్పుడు జయప్రద బీఆర్ఎస్‌లో చేరేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఆమెను ఏపీ నుంచో.. తెలంగాణ నుంచో కాకుండా.. మహారాష్ట్ర నుంచి పోటీ చేయించాలని కేసీఆర్ ఆలోచన చేస్తున్నారు. మహారాష్ట్రపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. మహారాష్ట్ర, తెలంగాణల్లో అన్ని పార్లమెంట్ సీట్లు గెల్చుకుంటే కేంద్రంలో చక్రం తిప్పవచ్చని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే ఇతర రాష్ట్రాలపై దృష్టి పెట్టకుండా ఒక్క మహారాష్ట్రపైనే వ్యూహాలు పన్నుతున్నారు. జయప్రద దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న నటి మాత్రమే కాదు రాజకీయ నాయకురాలు కూడా కావడంతో ఆమెను మహారాష్ట్రలో పోటీ చేయిస్తే విజయం nఖాయమని భావిస్తున్నారు.
తెలంగాణకు సరిహద్దుల్లో ఉన్న ఒక మహారాష్ట్ర నియోజకవర్గం నుంచి జయప్రదను పోటీ చేయించాలని కేసీఆర్ భావిస్తున్నారు. దాని వల్ల పక్కనున్న మరాఠా నియోజకవర్గాలతో పాటు తెలంగాణ లోక్ సభా స్థానాల్లో కూడా జయప్రదతో ప్రచారం చేయించే వీలుంటుందని విశ్వవిస్తున్నారు. జయప్రద మంచి మాటకారి. మంచి హిందీ స్పీకర్ కూడా. దానితో ఆమె ఓటర్లపై సమ్మోహనాస్త్రం వేయగలరని విశ్వసిస్తున్నారు. పైగా సినీ గ్లామర్ ఉన్న జయప్రదను జనం ఈజీగా గుర్తుపట్టడం ఆమెకు ప్లస్ పాయింట్ అవుతుంది. ఆమె బాలీవుడ్ లో కూడా నటించారు. ఓట్లు బాగా రాలతాయన్న విశ్వాసం కూడా కేసీఆర్ కు కలిగినందునే ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమయ్యారు. పైగా బీఆర్ఎస్ లో సినీ గ్లామర్ లోపించింది. జాతీయ పార్టీగా అవతరించిన తర్వాత సినీ గ్లామర్ కూడా అవసరమవుతుంది. ఆ సెగ్మెంట్ ను జయప్రదతో మొదలు పెట్టాలని కేసీఆర్ అనుకుంటున్నట్లుగా సమాచారం.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…