తెలంగాణా ఇచ్చినా మొదటి రెండు ఎన్నికల్లో అధికారం దక్కించుకోలేకపోయిన కాంగ్రెస్ పార్టీ ఈ సారి ప్రజలు తమను దీవించేశారని ధీమాగా ఉంది. అభ్యర్ధుల ఎంపిక నుంచి ప్రచార పర్వం వరకు అన్ని దశల్లోనూ గతంలో చేసిన పొరపాట్లు చేయకుండా పకడ్బందీగా వ్యవహరించింది కాంగ్రెస్ నాయకత్వం. పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల ప్రచారమే ప్రజలను పార్టీకి చేరువ చేసిందని పార్టీ వ్యూహకర్తలు భావిస్తున్నారు. ఇక పార్టీ మేనిఫెస్టోతో పాటు ఆరు గ్యారంటీలకు జనం ఓటు వేశారని కాంగ్రెస్ నాయకత్వం అంటోంది. తాము ఇచ్చిన తెలంగాణా రాష్ట్రంలో మొదటి సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని నమ్మకంగా ఉంది.
2014లో తెలంగాణా రాష్ట్రం అవతరించిన తర్వాత ఇప్పటి వరకు రెండు ఎన్నికలు జరిగితే రెండింటిలోనూ కాంగ్రెస్ ప్రతిపక్షానికే పరిమితం కావలసి వచ్చింది. ఇక ఈ ఎన్నికల్లోనూ గెలవలేకపోతే తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణా ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించింది కాంగ్రెస్ నాయకత్వం.2014,2018 ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలోనూ వ్యూహాలు రచించుకోవడంలోనూ ఘోరంగా విఫలమయ్యామని భావించిన కాంగ్రెస్ నాయకత్వం ఈ సారి ఆ తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తలు పడే ప్రయత్నం అయితే చేసింది.
అభ్యర్ధుల ఎంపికలో గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలన్న సిద్దాంతాన్ని చాలా కచ్చితంగా అమలు చేశామని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఎన్నికలకు కొద్ది నెలల ముందు వరకు తెలంగాణా కాంగ్రెస్ లో గందరగోళమే ఉండింది. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి పార్టీలోని సీనియర్లకు మధ్య పొసగక పోవడంతో నిత్యం అసమ్మతి నినాదాలు వెక్కిరిస్తూ వచ్చాయి. ఈ పంచాయతీలు తీర్చడానికి పార్టీ హైకమాండ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ ని మార్చి మాణిక్ రావు ఠాక్రే ను రంగంలోకి దించాల్సి వచ్చింది. ఆయన రావడంతోనే పార్టీలో సీనియర్ల మధ్య తాత్కాలికంగానైనా కొద్ది పాటి సయోధ్య కుదర్చగలిగారన్నది పార్టీ వర్గాల మాట.
పార్టీ దిశానిర్దేశనంలేక అయోమయంలో ఉన్న సమయంలోనే కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఒక్కసారిగా తెలంగాణా కాంగ్రెస్ కు ఊపిరి పోసినట్లయ్యింది. శ్రేణుల్లో ఉత్సాహం వచ్చింది. కార్యకర్తల్లో జోష్ పెరిగింది. నాయకుల్లో నమ్మకం రావడం మొదలైంది. ఎన్నికలు అయ్యే వరకు అయినా మనం కొట్లాడుకోవద్దు అని నేతలు ఓ అవగాహనకు రావడంతో సమష్ఠిగా ప్రచారం చేశారు. అభ్యర్ధుల ఎంపికలో అక్కడక్కడా నిరసన జ్వాలలు మిన్నంటాయి. నాగం జనార్ధనరెడ్డి, పొన్నాల లక్ష్మయ్య వంటి వారు పార్టీకి గుడ్ బై చెప్పారు. కొందరు రెబెల్స్ గా బరిలో దిగారు.అయితే అందరినీ బుజ్జగించుకుంటూ కాంగ్రెస్ నాయకత్వం ఎన్నికల సమరానికి సిద్ధమైంది.
ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు గ్రామీణ తెలంగాణానూ చుట్టేయడం పార్టీకి కొంత కలిసొచ్చిందనే చెప్పాలి. ప్రియాంక గాంధీ సభలకు ప్రజల నుండి ..ప్రత్యేకించి యువత నుండి అద్భుతమైన స్పందన లభించింది. అయితే అవి ఏ మేరకు ఓట్లు కురిపిస్తాయో డిసెంబరు మూడున మాత్రమే తేలుతుంది. కాకపోతే కాంగ్రెస్ నాయకత్వం మాత్రం ఈ సారి గాలి తమకు అనుకూలంగా ఉందని నమ్ముతోంది. ఘన విజయం సాధించడం లాంఛనమే అంటోంది.కర్నాటక తరహాలోనే తెలంగాణాలోనూ ఆరు గ్యారంటీలతో కార్డులు పంచిపెట్టారు. ఆ గ్యారంటీలకు తోడు పార్టీ మేనిఫెస్టోలోనూ పలు ప్రజారంజక హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. తమకు అనుకూలంగా ఉన్న గాలికి తోడు తొమ్మిదేళ్ల బి.ఆర్.ఎస్. పాలనపట్ల సహజ సిద్ధంగా ఉండే వ్యతిరేకత తమని అధికారంలోకి తీసుకురావడంలో దోహదపడిందని కాంగ్రెస్ నేతలు అంచనాలు వేసుకుంటున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవి తమదే అని పార్టీలోని కొందరు నేతలు పోటీలూ పడుతున్నారు. ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు.. ఎన్నికల ఫలితాలు ఇంకా వెలువడనే లేదు కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం డిసెంబరు మూడున తాము గెలుస్తామని డిసెంబరు 9న సోనియా గాంధీ పుట్టినరోజు నాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమాగా జోస్యాలు చెప్పేస్తున్నారు.అయితే ఈవీఎంలలో నిక్షిప్తమైన ప్రజాతీర్పు ఏం చెప్పిందో డిసెంబరు మూడునే తెలుస్తుంది…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…