బీఆర్ఎస్ ఆసంతృప్తి నేతల్లో ఒకరైన జూపల్లి కృష్ణారావు వేరు దారి చూసుకునే టైమ్ వచ్చిందనే చెప్పాలి. చాలా కాలంగా పార్టీకి ఇబ్బందికరమైన కామెంట్స్ చేస్తున్న ఆయన ఇప్పుడు డైరెక్ట్ అటాక్ చేస్తున్నారు. తాను పార్టీలో ఉన్నానో లేదో అధిష్టానమే నిర్ణయించాలని జూపల్లి అనడం భారీ డైలాగే అవుతుందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. బీఆర్ఎస్ రెబెల్ లీడర్ పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి నిర్వహించిన ఆత్మీయ సమ్మెళనానికి జూపల్లి హాజరయ్యారు. కొత్తగూడెంలో జరిగిన సభలో తన మనసులో మాటను బయటపెడ్డారు. ఇక అంతా బీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయమన్నట్లుగా మాట్లాడారు. పార్టీలో అవమానాలు ఎదుర్కొంటున్నానని ఆవేదన చెందారు. ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు కొల్హాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆధిపత్య పోరు చినికి చినికి గాలివానగా మారి జూపల్లి అసంతృప్తికి కారణమైంది. పార్టీ తనను పట్టించుకోవడం లేదని కావాలనే నిర్లక్ష్యం చేస్తోందని జూపల్లి నిర్ణయానికి వచ్చారు. క్షేత్రస్థాయిలో తనను తన అనుచరులను ఇబ్బంది పెట్టేందుకు జరుగుతున్న చర్యలను నిరోధించడంలో అధిష్టానం ఆసక్తి చూపడం లేదని జూపల్లి పలు పర్యాయాలు అభ్యంతరం చెప్పారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదంటే పొమ్మనకుండా పొగ పెట్టడమే అవుతుందని జూపల్లి భావిస్తున్నారు. గౌరవం లేని చోట ఉండి ప్రయోజనం లేదని ఆయన నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.
జూపల్లి ఇటీవలి కాలంలో షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి జూపల్లి గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. మంత్రిగా పనిచేశారు. రైతు ఉద్యమాల్లో జైలుకు కూడా వెళ్లారు. ఒక దశలో బేషరత్తుగా తెలంగాణ ఉద్యమానికి మద్దతు పలికిన జూపల్లి తర్వాతి కాలంలో బీఆర్ఎస్ లో చేరారు. కేసీఆర్ కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. కొల్హాపూర్ కింగ్ గా పిలిచే జూపల్లి 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. బీఆర్ఎస్ నేతలే తనను వెన్నుపోటు పొడిచారని జూపల్లి చెప్పుకునేవారు. కేసీఆర్ అమలు చేసిన ఆపరేషన్ గులాబీ ప్రభావం కొల్హాపూర్ నియోజకవర్గం మీద కూడా పడింది. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన హర్షవర్థన్ రెడ్డిని బీఆర్ఎస్లో చేర్చుకున్నారు. దానితో జూపల్లికి పార్టీలో పట్టుతగ్గింది నియోజకవర్గంలో హర్షవర్థన్ డామినేషన్ పెరగడంతో జూపల్లిలో అసహనానికి లోనయ్యారు. తరచూ ఎమ్మెల్యేలపై ఛాలెంజులు చేస్తూ పరిస్థితిని ఉద్రిక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక బాధ్యతను అధిష్టానం హర్షవర్థన్ రెడ్డిపై పెట్టడంతో జూపల్లికి చిర్రెత్తుకొచ్చింది. హర్షవర్థన్ కు సహకరించాలని కేటీఆర్ స్వయంగా సందేశం పంపినా జూపల్లి పట్టించుకోలేదు. మున్సిపల్ ఎన్నికల్లో తన అనుచరులను ఇండిపెండెంట్లుగా నిలబెట్టారు. కొన్ని చోట్ల వాళ్లు గెలిచారు. దానితో అధిష్టానానికి కోపమొచ్చి జూపల్లిని మరింతగా దూరం పెట్టడం మొదలు పెట్టింది.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని సస్పెండ్ చేస్తామని అధిష్టానం ప్రకటించినా జూపల్లి పట్టించుకోలేదు. కేవలం ఓడిపోయానన్న సాకుతో తనను దూరం పెట్టారన్న ఆగ్రహం ఆయనతో ఉంది. జూపల్లికి ఇప్పుడు బీజేపీ గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది. పాలమూరులో ఒకప్పుడు జూపల్లి గ్రూపు డీకే అరుణ గ్రూపులుండేవి. డీకే అరుణ ప్రస్తుతం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. జూపల్లి రావడంలో తనకెలాంటి అభ్యంతరం లేదని అరుణ ప్రకటించడంతో లైన్ క్లియర్ అయ్యింది. దానితో ఇప్పుడాయన బీజేపీలో చేరతారా వేరే గ్రూపులో ఉంటారా అన్నది చూడాలి.