హైదరాబాద్ కే పరిమితం, నియోజకవర్గానికి దూరం..

By KTV Telugu On 2 November, 2024
image

KTV TELUGU :-

ఆయనకు మాటల మరాఠీగా పేరుంది. ప్రజల పక్షాన పోరాడేందుకు ఎంతటి త్యాగానికైనా సిద్ధపడే నైజం ఉంది. కేసీఆర్ లాంటి బలమైన నాయకుడికి కాదనుకుని ఆయన బయటకు వచ్చారు. రాజకీయ యుద్ధంలో దేనికైనా రెడీ అనే టైపు ఆయన. అలాంటి నేత ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. సీఎం రేవంత్ రెడ్డి పక్కన ఉండి ఏదైనా సాధించుకోవాల్సిన నాయకుడు ఇప్పుడు ఎక్కడో దాక్కుని మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఆయనే మంత్రి జూపల్లి కృష్ణా రావు…

రాజకీయాల్లో ఆయనది థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ. తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలకపాత్ర. అప్పట్లో రాజీనామా కూడా చేశారు.. ఆరు సార్లు ఎమ్మెల్యే అయినప్పటికీ చాలా సాదాసీదాగా కనిపిస్తారు. అందరినీ కలుపుకుని పోయేందుకే ప్రయత్నిస్తారు. ఇప్పుడు మూడో సారి ఆయన మంత్రి అయ్యారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఒకప్పుడు ఆయన కీలక నేత. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిది కూడా పాలమూరు జిల్లానే అయినప్పటికీ కృష్ణరావు తన విలక్షణ రాజకీయ శైలితో అన్ని సమస్యలను చక్కబెడతారనుకున్నారు. పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. సమస్యలన్నింటినీ సీఎం వద్దకు తీసుకెళ్లి పరిష్కరిస్తారనుకున్న జూపల్లి కృష్ణారావు ఎక్కడా కనిపించడం లేదు. ప్రజలను కలవడం లేదు. వారి బాగోగులు తెలసుకోవడం లేదు.సొంత కొల్హాపూర్ నియోజకవర్గానికి ఇలా వచ్చి అలా వెళ్తున్నారు. ఎక్కువ సమయం హైదరాబాద్ నగరానికే పరిమితమవుతున్నారు…

కొల్హాపూర్ జనాన్ని జూపల్లి దూరం పెడుతున్నారు. ఒక పక్క సీఎం రేవంత్ రెడ్డి తన సొంత ఊరు కొండారెడ్డిపల్లికి అన్ని హంగులు అమర్చుకుంటుంటే.. కృష్ణారావు మాత్రం తనకో నియోజకవర్గం లేనట్లే ప్రవర్తిస్తున్నారు. పైగా మొత్తం వ్యవహారాన్ని తన వ్యక్తిగత కార్యదర్శి చేతుల్లో పెట్టి హైదరాబాద్ లో టైమ్ పాస్ చేస్తున్నారు. దానితో జూపల్లి గారి పీఏది ఆడిందే ఆట పాడిందే పాట అయిపోయింది. మంత్రి పేరు చెప్పుకుని పీఏ భారీగా వసూళ్లకు దిగుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుున్నాయి.

ఇక మంత్రి జూపల్లి పరిస్థితి కూడా ఆగమ్యగోచరంగా ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఆయన పెద్దగా కనిపించడం లేదు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు లాంటి వారు నిత్యం వార్తల్లో ఉంటుంటే..జూపల్లి మాత్రం మన్నుతిన్న పాములాగ మౌనంగా ఉంటున్నారు. దానితో నియోజకవర్గం ప్రజలు జూపల్లిపై బహిరంగ విమర్శలు చేస్తున్నారు ఆయన కంటే ఎంపీ మల్లు రవి బెటరని చెప్పుకుంటున్నారు. తమ సమస్యలను మల్లు రవి దగ్గరకు వెళ్లి చెప్పుకుంటున్నారు. దానితో ఆగ్రహం చెందుతున్న జూపల్లి…తన పీఏ ద్వారా కొందరు కాంగ్రెస్ కార్యకర్తలకు హెచ్చరికలు చేస్తున్నారట. మల్లు రవిని కలిస్తే ఊరుకునేది లేదని చెబుతున్నారట. నిజానికి కొల్హాపూర్ నియోజకవర్గానికి చెందిన మూడు మండలాలు వనపర్తి జిల్లాలో కూడా ఉన్నాయి. దానితో అక్కడి జనం ఇప్పుడు జూపల్లిని పట్టించుకోవడం మానేశారు. కొందరు కార్యకర్తలు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డితో టచ్ లోకి వెళ్లిపోయారు. జూపల్లి పద్ధతి మార్చుకోకపోతే ఆయన్ను వదిలేసి.. చిన్నారెడ్డిని తమ నాయకుడిగా పరిగణిస్తామని వారు చెబుతున్నారు. మరి ఇప్పుడు జూపల్లి ఏం చేస్తారో చూడాలి..

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి