పార్టీకి తన వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని ప్రకటించి మరీ కాంగ్రెస్ లో చేరిన స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే అయిన మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో వివాదాలకు కేంద్రబిందువయ్యారు. నియోజకవర్గంలోనే కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాలో సైతం తన పెత్తనం సాగాలన్నట్లుగా శ్రీహరి తీరు ఉందని సగటు కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం చెందుతున్నారు.ఆయన కుటుంబ పెత్తనాన్ని సహించేది లేదని హెచ్చరిస్తున్నారు….
బీఆర్ఎస్ తరపున కడియం శ్రీహరి.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం నుంచి గెలిచారు. మాజీ మంత్రి తాటికొండ రాజయ్యను కాదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయనకు టికెటిచ్చారు. కట్ చేసి చూస్తే లోక్ సభ ఎన్నికల నాటికి శ్రీహరి కుటుంబం అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిపోయింది. తన కుమార్తె కడియం కావ్యకు ఎంపీ టికెట్ ఇప్పించుకుని శ్రీహరి గెలిపించుకున్నారు. ఇప్పుడు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పేందుకు తండ్రీ, కుమార్తెలు ప్రయత్నిస్తూ గందరగోళం సృష్టిస్తున్నారు. దీనితో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పాతవాళ్లు, కొత్తవాళ్లు అన్న వివాదాలు కూడా కొనసాగుతున్నాయి.
కడియం వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా ఇప్పుడు స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో గొడవలు జరుగుతున్నాయి. పదేళ్లుగా కష్టపడి పనిచేసిన వాళ్లని కడియం శ్రీహరి పక్కన పెట్టి నియోజకవర్గం కమిటీల్లో కొత్త వారికి అవకాశం ఇస్తున్నారని సగటు కాంగ్రెస్ కార్యకర్తలు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పుడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. కడియం గ్రూపు ఒకటైతే… సింగాపురం ఇందిర వర్గం మరోకటిగా చెప్పుకోవాలి. మొదటి నుంచి ఉన్న ఇందిర .. కడియం కుటుంబానికి అడ్డు తగలాలని ప్రయత్నిస్తున్నారు. కడియం కాంగ్రెస్ పార్టీలో చేరతారని చెప్పినప్పటి నుంచి తాము భయపడుతూనే ఉన్నామని ఇందిర వర్గం ఇప్పుడు అంటోంది. కడియం కుటుంబం కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తోందని ఇందిర మద్దతుదారులు ఆరోపిస్తున్నారు..పార్టీ వారితో సంబంధం లేకుండా కడియం శ్రీహరి సొంతంగా పనిచేసుకుపోతున్నారని కొందరు ఆగ్రహం చెందుతున్నారు..
ఇటీవల ఇందిరమ్మ కమిటీల ఎంపికపై అసంతృప్త జ్వాలలు రగులుకున్నాయి. తొలి నుంచి పాత, కొత్త కాంగ్రెస్ క్యాడర్ నడుమ పొడచూపిన విభేదాలు ఒక్కసారిగా రోడ్డెక్కాయి. ఊరూరా ఇందిరమ్మ కమిటీల్లో తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ధర్మసాగర్ మండల కేంద్రంలో ఏకంగా పాతకాంగ్రెస్ క్యాడర్ రాస్తారోకోకు దిగింది. మండల కాంగ్రెస్ కో ఆర్డినేటర్ భిక్షపతి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆయన వైఖరిని తప్పుబట్టారు.ఇందిరమ్మ కమిటీలే కాకుండా, కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాలు తమకు తెలియకుండానే నిర్వహిస్తూ వస్తున్నారని మండిపడ్డారు. రోడ్డుపైనే కడియం శ్రీహరి దిష్టిబొమ్మ దహనం చేసేందుకు రెడీ అయ్యారు. అయితే కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిన సింగాపురం ఇందిర ఫోన్లో నచ్చజెప్పడంతో కార్యకర్తలు దిష్టిబొమ్మ దగ్ధాన్ని విరమించుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్న పదేండ్లు కాంగ్రెస్ కోసం కష్టపడ్డామని, కడియం శ్రీహరి కొత్తగా వచ్చి తమను పక్కనబెడుతున్నారని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎంపీగా ఉన్న శ్రీహరి కుమార్తె కడియం కావ్య తీరుపై కూడా కార్యకర్తలు ఒకింత గుర్రుగా ఉన్నారు. ఆమె ఎవరికీ అందుబాటులో ఉండరని ఆగ్రహం చెందుతున్నారు. ఎంత చిన్న పని అడిగినా ఇప్పుడు కాదూ.. తర్వాత కనిపించండీ అంటున్నారని ఆవేదన చెందుతున్నారు. దీనితో ఇప్పుడు కడియంపై ఆరోపణలన్నీ హైదరాబాద్ చేరాయి. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి మొత్తం వ్యవహారాన్ని తీసుకెళ్లారు. వారి స్పందన కోసం వరంగల్ నేతలు ఎదురు చూస్తున్నారు…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…