మానవ నిర్మిత మహా ప్రాజెక్టుగా కాళేశ్వరం గురించి తెలంగాణ సర్కార్ ప్రచారం చేసుకుంటోంది. దీనిపై డిస్కవరీ చానల్‌లోనూ కథనాలు వచ్చేలా చూసుకున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల ఎంత ఉపయోగం అనే చర్చ రాకుండా ఎక్కడ నీళ్లు కనిపించినా కాళేశ్వరం నీళ్లే అన్నట్లుగా ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వీటన్నింటినీ పక్కన పెడితే కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు గుదిబండగా మారిందనేది నిపుణులు చెబుతున్నమాట. ఈ ప్రాజెక్టు కోసం తెచ్చిన అలవి మాలిన అప్పులు.. వాటికి కడుతున్న అప్పులు.. వాయిదాలు కలిసి తడిసి మోపెడవుతున్నాయి. దీనికి ఈ ప్రాజెక్టు నిర్వహణ ఖర్చు అదనం. ఈ అప్పుల కారణంగానే ధనిక రాష్ట్రమైన తెలంగాణ.. ఆర్థిక సమస్యల్లో చిక్కుకుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అసలు కాళేశ్వరం కోసం తెలంగాణ సర్కార్ చేసిన అప్పు ఎంత ? ఎంత వడ్డీ కడుతుందో ఓ సారి చూద్దాం !
కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓ శ్రీశైలం లేదా పోలవరం ప్రాజెక్ట్ లాగా ఒక్క చోట కట్టేది కాదు. ఒక చోట నుంచి ఎత్తి పోసుకుంటూ..మరో ప్రాంతానికి ..మళ్లీ అక్కడ్నుంచి ఎత్తి పోసుకుని ఎగువ ప్రాంతానికి తరలించుకుంటూ రావాలి. ఓ రకంగా ఇది ఎత్తిపోతల ప్రాజెక్ట్. కానీ ఎత్తి పోసిన తర్వాత నీళ్లు నిల్వ చేసుకోవడానికి రిజర్వాయర్లు కూడా నిర్మించారు. ఇందు కోసం భూసేకరణ చేయాల్సి వచ్చింది. అందుకే ప్రాజెక్ట్ అత్యంత ఖరీదైనదిగా మారింది. ప్రభుత్వాలు ఏ ప్రాజెక్టు కట్టాలన్నా అప్పులు తేవాల్సిందే. సొంత డబ్బులతో కట్టే అవకాశం ఉండదు. ప్రభుత్వ నిర్వహణకే ఆదాయం సరిపోతుంది. అభివృద్ధి పనులన్నింటికీ అప్పులే దిక్కు. కాళేశ్వరాన్ని కూడా పూర్తిగా అప్పులతోనే నిర్మించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి అప్పులు తీసుకు వచ్చారు. కాగ్ నివేదిక మేరకు కాళేశ్వరం డీపీఆర్ ప్రకారం నిర్మాణ వ్యయం రూ.81,911 కోట్లుగా ఉంది. కాగ్ ప్రస్తుత అంచనా లెక్కల మేరకు 1 లక్ష 49,317 కోట్లుగా ఉంది. అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంకా వంద శాతం పూర్తి కాలేదు. ఈ కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణం గత ఏడాది అక్టోబర్ నాటికి అక్షరాలా రూ.97.5 వేల కోట్లు. ఈ మధ్య కాలంలో మరో పది వేల కోట్ల వరకూ రుణాలు తెచ్చి ఉంటారన్న ప్రచారం ఉంది. గత ఏడాది అక్టోబర్ నాటికి అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం కాళేశ్వరంపై భరించలేనంత అప్పులు చేశారు.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత కేసీఆర్ ప్రాజెక్టులను రీ డిజైన్ చేసి ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరంగా మార్చారు. తుమ్మిడిహెట్టి నుంచి వంద కి.మీ.ల దిగువకు తీసుకెళ్లి మేడిగడ్డ నుంచి మూడు స్టేజీల్లో ఎల్లంపల్లికి ఎత్తిపోసేలా మార్పులు చేశారు. పాత ప్రాజెక్టు డిజైన్‌లోనూ పలు మార్పులు చేశారు. ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణ అంచనా 35 వేల కోట్లు మాత్రమే. కానీ రీడిజైన్ చేయడం వల్ల రూ.81 వేల కోట్లకు చేరింది. కానీ ఎప్పటికప్పుడు పనుల ఎస్కలేషన్‌కారణంగా ఖర్చు రూ.87 వేల కోట్లకు పెరిగింది. అడిషనల్ టీఎంసీ పనులతో నిర్మాణ వ్యయం రూ.1.15 లక్షల కోట్లు అయింది. కానీ ధరలు పెరుగుతూండటంతో ఇప్పుడు అది 1 లక్ష 49,317 కోట్లకు చేరిందని కాగ్ అంచనా వేస్తోంది.
ఈ ప్రాజెక్టుకు భారీగా నిధులు అవసరం ఉండటంతో బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి లోన్లు తీసుకునేందుకు 2015లో కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేశారు. ఇదే కార్పొరేషన్‌లో పాలమూరు – రంగారెడ్డిని కూడా కలిపారు. ఈ కార్పొరేషన్ ద్వారా కాళేశ్వరం కోసం 87,449 కోట్లు అప్పు తెచ్చారు. పాలమూరు ప్రాజెక్ట్ కోసం 10 వేల కోట్ల లోన్ తీసుకున్నారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి అత్యధికంగా 37,737 కోట్లు తీసుకున్నారు. అలాగే రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ నుంచి కూడా 30,536 కోట్లు అప్పు చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆధ్వర్యంలోని కన్సార్షియం 11,400 కోట్లు, నాబార్డ్ 8,225.97 కోట్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని కన్సార్షియం 7,400 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా 2,150 కోట్ల లోన్లు ఇచ్చాయి.
బ్యాంకులతో పాటు పీఎఫ్‌సీ, ఆర్ఎఫ్‌సీల నుంచి తెచ్చిన రుణాలకు వడ్డీలు చాలా ఎక్కువ. కొన్ని లోన్లకు పది శాతం వరకూ వడ్డీలు చెల్లించాల్సి ఉంది. ఫలితంగా ఇప్పుడు తెలంగాణ అర్థిక పరిస్థితికి ఈ కాళేశ్వరం రుణాలు గుదిబండగా మారాయి.
బ్యాంకులతో పాటు పీఎఫ్‌సీ, ఆర్ఎఫ్‌సీల నుంచి తెచ్చిన అప్పులకు 7.80 శాతం నుంచి 10.90 శాతం వరకు వడ్డీ కలిపి రీపేమెంట్స్ చేస్తున్నారు. నాబార్డ్ మొదటి విడతలో మంజూరు చేసిన 1,500 కోట్లకు 2021 – 22 ఆర్థిక సంవత్సరంలో వడ్డీతో కలిపి 213 కోట్లను మూడు ఇన్‌స్టాల్‌మెంట్లలో చెల్లించారు. గత ఆర్థిక సంవత్సరంలో ఒక్క కాళేశ్వరం కార్పొరేషన్ కోసం తీసుకున్న అన్ని లోన్లకు కలిపి 5,267 కోట్లు రీపేమెంట్ చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.11 వేల కోట్లు, ఆ తర్వాతి సంవత్సరం నుంచి వరుసగా పదేండ్ల పాటు ఏటా 13,746 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని అంచనా. 2034 -35లో వరకూ ఇలా కట్టుకుంటూ పోతే.. ఆ ఏడాదితో కాళేశ్వరం అప్పుల రీపేమెంట్ ముగియనుంది. తర్వాత 2036 నుంచి వరుసగా ఐదేండ్లు పాలమూరు కోసం తీసుకున్న లోన్లకు ఐదు ఇన్‌స్టాల్‌మెంట్లలో మొత్తం 7,633 కోట్లు చెల్లించాల్సి ఉంది. అంటే ఏటా రైతుబంధు స్కీం కోసం ఖర్చు చేస్తున్న మొత్తానికి సమాన స్థాయిలో వడ్డీలు , కిస్తీలు చెల్లించాల్సి వస్తోంది. గత ఏడాది అక్టోబర్ వరకూ ఉన్న లెక్కల ప్రకారం తెచ్చిన అసలుకు వడ్డీగా మరో 71 వేల కోట్లు చెల్లించాల్సిఉంది. అంటే అసలు, వడ్డీ కలిపి మొత్తం లక్షా 69 వేల లక్షల కోట్లను బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు రానున్న 18 ఏండ్లలో తిరిగి కట్టాలి. ఈ ప్రాజెక్టు పనుల్లో ఎస్కలేషన్‌లు, ఇంకా అదనపు రుణాలను కలుపుకుంటే తిరిగి చెల్లింపులు రెండు లక్షల కోట్లు దాటిపోతాయి.
కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధాన పనులు ముగిసినా ఇంకా కొన్ని లింకుల్లో పనులు పెండింగ్‌లో ఉన్నాయి. అవి పూర్తి చేయడానికి ఇప్పుడు తీసుకున్న లోన్లకు తోడు ఇంకో నాలుగైదు వేల కోట్ల వరకు అదనంగా అప్పు తీసుకోవాల్సి ఉంటుంది. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 35 వేల కోట్ల నుంచి .54 వేల కోట్లకు చేరింది. ఇందులో పంపుహౌస్‌లు, ఎలక్ట్రో మెకానికల్ పనుల కోసం ఇంకో 10 వేల కోట్లకు పైగా లోన్లు తీసుకోవాల్సి ఉంది. అయితే అప్పులు, వడ్డీలతోనే అయిపోదు ఈ ప్రాజెక్టు నిర్వహణ ఎంత భారమో ఊహించుకుుంటే గుండె గుభిల్లుమంటుంది. ప్రాజెక్టును పూర్తి స్థాయిలో వినియోగిస్తే కరెంట్ బిల్లులకు ఏటా 4,500 కోట్లు, మెయింటెనెన్స్‌కు ఇంకో 500 కోట్ల వరకు ఖర్చవుతుంది. ఈ లెక్కన బడ్జెట్‌లో పదో వంతు కాళేశ్వరం ఖర్చులకే పోనుంది.
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల కాళేశ్వరం కోసం చేసిన అప్పులు తీరిపోయాయనని ప్రకటించారు. దీంతో విపక్షాలు ఒక్క సారిగా విరుచుకుపడ్డాయి. అదే నిజం అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం తెచ్చిన అప్పులు, కట్టిన వడ్డీల వివరాలను పూర్తి స్థాయిలో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిజానికి ప్రభుత్వం ఎప్పుడూ కాళేశ్వరం అప్పుల గురించి పూర్తి స్థాయిలో వివరాలు బయట పెట్టలేదు. సమాచార హక్కు చట్టం కింద ఇతరులు సేకరించిన సమాచారాన్ని బట్టే వివరాలు తెలుస్తున్నాయి. నిజంగా కాళేశ్వరం అప్పుల గురించి బయట పెడితే… ఆ ప్రాజెక్ట్ తెలంగాణకు గుదిబండగా మారిందన్న విషయం అందరికీ తెలిసిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
ఎంత ఖర్చు పెట్టినా .. ఎన్ని వడ్డీలు కట్టినా కాళేశ్వరంతో సంపద జనరేట్ అవుతుందని అనుకుంటే.. అది పెద్ద ఆస్తిగానే చెప్పవచ్చు. కానీ రెండు లక్షల కోట్లు పెట్టుబడి పెట్టి.. ఏటా ఐదు వేల కోట్ల వరకూ నిర్వహణ వ్యయం చేసినా… మొత్తం ఈ ప్రాజెక్టు వల్ల సృష్టించే సంపద ఐదు వేల కోట్లు కూడా ఉండదని విశ్లేషణలు వస్తూండటమే అసలు సమస్య.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి …..