ఈడీ దూకుడు…ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బడా నేతలు
కవిత, మాగుంట పేర్లు వెలుగులోకి రావడంతో కలకలం. విచారణకు ఓకే అన్న కవిత..జైలుకు పంపుతారా?
దక్షిణాదిపై కేంద్రం కుట్ర చేస్తోందన్న వైసీపీ ఎంపీ
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మద్యం కుంభకోణం వ్యవహారానికి సంబంధించి ఈడీ మరింతగా దూకుడు వెళ్తోంది. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పేర్లు తెరపైకి రావడం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఢిల్లీ మద్యం కేసులో 38 మంది ప్రమేయం ఉన్నట్లు ఈడీ నిర్ధారించింది. కోర్టుకు సమర్పించిన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో వారి పేర్లు ప్రస్తావించింది. అందులో కవిత, మాగుంట శ్రీనివాసుల రెడ్డితో పాటు శరత్ రెడ్డి, గోరంట్ల బుచ్చిబాబు, బోయినపల్లి అశోక్ పాత్రను ప్రస్తావించారు. 32 పేజీల రిపోర్టులో మూడు చోట్ల కవిత పేరును ప్రస్తావించారు. ఢిల్లీలో సంచలనం సృష్టించిన మద్యం కేసులో సౌత్ గ్రూపు నుంచి రూ. 100 కోట్లు తరలించినట్లు ఈడీ అధికారులు ఇప్పటికే గుర్తించారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రైవేట్ విమానాల్లో డబ్బు తరలించినట్లు అనుమానిస్తున్నారు. ఈ సౌత్ గ్రూప్‌ను శరత్ చంద్రారెడ్డి, కవిత, మాగుంట నియంత్రించినట్లు తాజా రిమాండ్ రిపోర్టులో పేర్కొనడం గమనార్హం. ఈ వ్యవహారంలో కార్యకలాపాల నిమిత్తం ఉపయోగించిన 10 సెల్‌ఫోన్లను ధ్వంసం చేసినట్లు తాజా రిమాండ్ రిపోర్టులో ఈడీ పేర్కొంది. ఈ కేసులో మొత్తం 36 మంది సాక్ష్యాలు లేకుండా చేసేందుకు రూ.1.38 కోట్ల విలువైన 170 మొబైల్ ఫోన్లను ధ్వంసం చేశారని ఈడీ పేర్కొంది.
గుర్గావ్‌కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అమిత్ అరోరాను ఈడీ అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఆయన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సన్నిహితుడని తెలుస్తోంది. ఢిల్లీ మద్యం పాలసీ, మనీలాండరింగ్ కేసులో అమిత్ అరోరా కీలకంగా వ్యవహరించినట్లుగా సమాచారం. ప్రాథమిక దర్యాప్తులో అమిత్ అరోరా ఇచ్చిన వాగ్మూలంలో ధ్రువీకరించిన అంశాల ఆధారంగా రిమాండ్ రిపోర్ట్ నివేదించినట్లు ఈడీ అధికారులు చెబుతున్నారు. లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి రిమాండ్ రిపోర్ట్‌లో తన పేరు చేర్చడంపై కేసీఆర్ తనయ కవిత స్పందించారు. విచారణకు సహకరిస్తామని స్పష్టం చేసారు. మోడీ అధికారంలో ఉన్న ఈ ఎనిమిదేళ్ల కాలంలో తొమ్మది ప్రభుత్వాలను కూల్చారని కవిత ఆరోపించారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో మోడీ కంటే ముందు ఈడీ రావటం సర్వ సాధారణ అంశంగా మారిందని చెప్పారు. రాజకీయ కుట్రలో భాగంగానే తన పైనా, తన పార్టీ నేతల పైన సీబీఐ, ఈడీ కేసులు నమోదవుతున్నాయని చెప్పుకొచ్చారు. సీబీఐ, ఈడీ, మోడీ అన్నింటినీ ఎదుర్కొనే సత్తా తమకు ఉందన్న కవిత. జైళ్లో పెట్టాలనేదే వారి ఆలోచన అయితే అందుకు సిద్దమన్నారు. అంతేకానీ వారికి భయపడేదే లేదని చెప్పుకొచ్చారు. కవిత విచారణకు సిద్దమని చెబుతూనే జైలుకు వెళ్లటానికైనా రెడీ అంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
లిక్కర్ స్కామ్ ఇష్యూపై స్పందిస్తూ వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర సర్కార్ కుట్ర చేస్తోందంటూ మండిపడ్డారు మాగుంట. అమిత్ అరోరా ఎవరో తనకు తెలియదన్నారు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి. అమిత్ అరోరా నార్త్ ఇండియన్ అతనితో తామెందుకు లిక్కర్ వ్యాపారాలు చేస్తామని ప్రశ్నించారు. అతని రిమాండ్ రిపోర్టులో తన పేరు ఎందుకు చేర్చారో కూడా తెలియదన్నారు. ఈడీ విచారణ సమయంలో ఎంపీ మాగుంట కుమారుడికి నోటీసులు జజారీ చేసింది. ఇప్పుడు రిమాండ్ రిపోర్టులో మాగుంట కుమారుడు రాఘవకు చెందిన మాగుంట ఆగ్రో ఫామ్స్ ప్రైవేటు లిమిటెడ్ రెండు జోన్లకు దక్కించుకుందని వివరించింది. శరత్ చంద్రారెడ్డికే అధిక రిటైల్ జోన్లు దక్కినట్లు వివరించింది. శరత్‌కు చెందిన అవంతికా కాంట్రాక్టర్స్ లిమిటెడ్, ట్రైడెంట్ కెమ్‌ఫర్ లిమిటెడ్, ఆర్గానోమిక్స్ ఎకోసిస్టమ్స్ లిమిటెడ్ ఐదు జోన్లను దక్కించుకున్నాయి. ఇప్పుడు ఈ రిమాండ్ రిపోర్టు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయంగా చర్చకు కారణమైంది. ఇటీవలే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు ముగ్గురి అరెస్ట్‌లు జరగగా ఈ కేసులో ఇప్పుడు కేసీఆర్ కూతురు, వైసీపీ ఎంపీ పేర్లు చేర్చడం సంచలనంగా మారింది.