ఆధారాలు ప‌క్కా.. ఆ విష‌యం చెప్ప‌దు క‌విత‌క్క‌!

By KTV Telugu On 1 December, 2022
image

ఫాంహౌస్ కేసుతో బీజేపీ జుట్టు త‌న చేతికి చిక్కింద‌నుకున్నారు కేసీఆర్‌. కానీ మాయ‌ల‌ఫ‌కీరు ప్రాణం చిల‌క‌లో ఉన్న‌ట్లు ఆయ‌న ప్రాణ‌ప్ర‌ద‌మైన కూతురు బీజేపీ పంజ‌రంలో చిక్కింది. కేంద్రం ద‌ర్యాప్తుసంస్థ‌ల‌ను దుర్వినియోగం చేస్తోంది టీఆర్ఎస్ దుమ్మెత్తిపోస్తోంది. మోడీ రావ‌డానికి ముందు ఈడీ రావ‌డం మామూలేనంటోంది. కానీ ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌కి రూట్‌మ్యాప్ ఇచ్చిన సౌత్‌గ్రూప్‌లో కేసీఆర్ కూతురి పాత్రమాత్రం అనుమాన‌స్ప‌ద‌మే. అల్లాట‌ప్పాగా ఆమె పేరు ఇరికించ‌లేదు ఈడీ. ఆధారాలు చూపిస్తోంది. ఫోన్ నెంబ‌ర్ల‌ను ప్ర‌స్తావిస్తోంది. మిగిలిన నిందితుల‌తో ఆమె కాంటాక్ట్‌ల‌ను కోర్టుకు స‌మ‌ర్పించింది.

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత పాత్ర ఉంద‌ని బ‌ల్ల‌గుద్ది చెబుతోంది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌. ఇప్ప‌టిదాకా క‌ల్వ‌కుంట్ల క‌విత ప్ర‌మేయంపై లీకుల‌కే ప‌రిమిత‌మైన ఈడీ ప‌క్కాగా ఆధారాలు సిద్ధంచేసుకుంది. సీబీఐ ప్రత్యేక కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్ట్‌లో కవిత ప్ర‌మేయంపై ఆధారాలు చూపింది. క‌విత‌తో పాటు అరబిందో ఫార్మా డైరెక్టర్‌ శరత్‌చంద్రారెడ్డి, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిల పాత్ర‌ ఆప్‌ నేతలకు రూ.100 కోట్ల ముడుపులు ఎవ‌రిచ్చారు? ఎవ‌రెవ‌రు ల‌బ్ధిపొందారో అమిత్ అరోరా రిపోర్టులో లోతుగా ప్ర‌స్తావించింది.

అమిత్‌ అరోరా ఎంక్వ‌యిరీలోనే కవిత, శరత్‌, మాగుంటల పేర్లు బ‌య‌టికొచ్చాయి. హోల్‌సేల్‌లో 12 శాతం, రిటైల్ వ్యాపారుల‌కు 180 శాతం లాభాలు ద‌క్కేలా రూపొందిన ఢిల్లీ మద్యం పాలసీ గుట్టు ర‌ట్టుచేసే ప‌నిలో రోజుకో సంచ‌ల‌నం వెలుగుచూస్తోంది. ఆప్‌ నేతలకు మేలు చేసేందుకు సౌత్ గ్రూప్ కీల‌కంగా వ్య‌వ‌హ‌రించింద‌ని ఈడీ గుర్తించింది. ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో ఉన్న కవిత, శరత్‌, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా తదితరులు తరచూ సెల్‌ఫోన్లను మార్చార‌ని ఈడీ రిమాండ్‌ రిపోర్టులో పేర్కొంది. ఆధారాలు దొర‌క్కుండా చేసేందుకు 170 ఫోన్ల‌ని ధ్వంసంచేశార‌ని ఈడీ రిమాండ్ రిపోర్ట్‌లో ఉంది.

62099 99999. ఈ ఫ్యాన్సీ నెంబ‌ర్ క‌ల్వ‌కుంట్ల క‌విత వాడేదేన‌ని తేలింది. ఈ నెంబ‌ర్ ఫోన్‌ని 2021 డిసెంబరు 25 నుంచి 2022 ఏప్రిల్4లోపు నాలుగునెల‌ల్లోనే ఆరుసార్లు మార్చారు. 89856 99999 నెంబ‌రున్న మ‌రో ఫోన్‌ని 2021 సెప్టెంబరు1 నుంచి 2022 ఆగస్టు 22 మ‌ధ్య కాలంలో నాలుగుసార్లు మార్చిన విష‌యం ఈడీ ఎంక్వ‌యిరీలో బ‌య‌ట‌ప‌డింది. ఈడీ రిమాండ్ రిపోర్ట్ టీఆర్ఎస్‌ని కుదిపేస్తోంది. క‌విత ఖండ‌న‌లు ఇస్తున్న స‌మ‌యంలోనే కాక‌తాళీయంగా ఫాంహౌస్ కేసు నిందితుల‌కు బెయిల్ వ‌చ్చింది. మ‌హా అయితే జైలుకు పంపుతారు అంతేగా అని క‌విత గాంభీర్యం ప్ర‌ద‌ర్శిస్తున్నా ఈ స్కామ్‌లో ఆమె కూరుకుపోయేలా ఉన్నారు.

ఈడీ రిమాండ్ రిపోర్ట్‌లో ప్ర‌స్తావించిన ఆ ఫోన్ నెంబ‌ర్లు త‌న‌వికాద‌ని గానీ, అందులో ప్ర‌స్తావించిన వాళ్లెవ‌రూ త‌న‌కు తెలీద‌ని తానెప్పుడూ మాట్లాడ‌లేద‌ని క‌విత చెప్ప‌టం లేదు. కేవ‌లం రాజ‌కీయ క‌క్ష‌సాధింపుచ‌ర్య‌గానే ప్ర‌తిదాడికి దిగుతున్నారు. ఫాంహౌస్ కేసులో ఫోన్‌నెంబ‌ర్లు, వాట్సాప్ చాట్స్ ఆధారాలుగా చూపిస్తున్న‌ప్పుడు క‌విత ప్ర‌మేయంపై ఈడీ చూపే సాక్ష్యాల‌ను అబ‌ద్ధాల‌ని కొట్టిపారేయ‌లేం. పిక్చ‌ర్ తెలిసిపోతోంది. ఫాంహౌస్ కేసులో టీఆర్ఎస్ ప్ర‌భుత్వం దూకుడు ప్ర‌ద‌ర్శిస్తే లిక్క‌ర్ స్కామ్ ఎపిసోడ్ కూడా అలాగే ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీని ప్ర‌క‌టించి దేశ‌మంతా దున్నేయాల‌నుకుంటున్న కేసీఆర్‌కి బిడ్డ‌మీద వ‌చ్చిన ఆరోప‌ణ‌లు మింగుడుప‌డ‌టం లేదు.