బీజేపీలో చేరాలని కల్వకుంట్ల కవితపై ఒత్తిడి

By KTV Telugu On 18 November, 2022
image

సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం కేసీఆర్‌
2. ఇంత కంటే ఘోరం మరొకటి ఉంటుందా అని ఆగ్రహం

నలుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణలో ఇప్పుడప్పుడే సద్దుమనిగేలా లేదు. ఈ కేసులో అధికార పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేశారనే ఆరోపణలతో ముగ్గురు నిందితులపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరుపుతోంది. అధికారంలో ఉన్న పార్టీలను కూల్చడానికి బీజేపీ ఎలాంటి కుట్రలకు పాల్పడుతుందో తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు సీఎం కేసీఆర్‌. ఈ విషయాన్ని తాను వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఎంపీలు,పార్టీ కీలక నేతలతో కలిసి మంగళవారం కేసీఆర్ ఓ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. 3 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఆయన బీజేపీ నేతల తీరుపై ఘాటు విమర్శలు గుప్పించారు.

ఐటీ, ఈడీ, సీబీఐ దాడుల పేరిట కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రత్యర్తులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆయన విమర్శించారు. ఈ సమావేశంలో నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు జరిగిన కుట్రలను ప్రస్తావించిన కేసీఆర్ బీజేపీ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్వయంగా తన కుమార్తె కవితనే పార్టీ మారాలని బీజేపీ నేతలు అడిగారని చెప్పారు కేసీఆర్. ఇంతకంటే ఘోరం ఇంకొకటి ఉంటుందా అని ప్రశ్నించారు. తెలంగాణలో షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని, విపక్షాల ఎదురు దాడులను తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. బీజేపీతో ఇక యుద్ధమే అని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీతో పాటు ఇతర ప్రతిపక్షాల నుంచి రాజకీయంగా ఎదురు దాడి ఉంటుందన్న కేసీఆర్ ఆ దాడులను తిప్పికొట్టే దిశగా నేతలు సిద్ధం కావాలని సూచించారు.