కవిత అరెస్టు దిశగా మరో ముందడుగు

By KTV Telugu On 3 December, 2022
image

ఆశించింది కాకపోయిన ఊహించిందే జరిగిందా ? కవిత చుట్టూ దర్యాప్తు సంస్థలు సాక్ష్యాలను పటిష్టం చేస్తున్నాయా ? కల్వకుంట్ల వారి అమ్మాయిని ప్రశ్నిస్తే మరిన్ని వాస్తవాలు తెలుస్తాయని నిర్ణయానికి వచ్చాయా. అందుకే అమిత వేగంగా ఆమెకు నోటీసులు పంపారా.

ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణ వేగవంతం
కవితకు నోటీసులు పంపిన సీబీఐ
తన నివాసంలోనే ప్రశ్నించాలన్న కవిత
డిసెంబరు 6 ఉదయం 11 గంటలకు విచారణ
నోటీసులు అందినట్లు కవిత అంగీకారం
ఈడీ రిమాండ్ రిపోర్టులో కవిత పేరు
రూ. 100 కోట్ల ముడుపులపై ప్రశ్నించే అవకాశం
ఈడీ విచారణకు హాజరైన కవిత ఆడిటర్ బుచ్చుబాబు
ఇప్పటికే సిసోడియాను ప్రశ్నించిన సీబీఐ
కేంద్ర దర్యాప్తు సంస్థ ముప్పేట దాడి
కవితను అరెస్టు చేస్తారా ?

అనుకున్నదే అయ్యింది. ఉచ్చు మరింత గట్టిగా బిగుసుకుంటోంది. టీఆర్ఎస్ ను ఉక్కిరిబిక్కిరి చేసేందుకు కేంద్రం డిసైడైంది. సాక్ష్యాధారాలను పటిష్టం చేసే దిశగా దర్యాప్తు సంస్థలు స్పీడు పెంచాయి. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ స్కామ్‌లో కవిత పాత్రపై సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.ఇప్పుడు . ఆమెను విచారించాలని సీబీఐ నిర్ణయించింది. ఈ మేరకు సీఆర్‌పీసీ సెక్షన్‌ 160 కింద దర్యాప్తు అధికారి అలోక్‌ కుమార్‌ షాహి కవితకు నోటీసులు జారీ చేశారు. సీబీఐ కేంద్ర కార్యాలయంలోని యాంటీ కరెప్షన్ బ్యూరోలో అలోక్ డీఎస్పీగా ఉన్నారు.

నోటీసును ఆయన ఒక్క పేజీలో తేల్చేశారు. వచ్చే మంగళవారం అంటే 6వ తేదీన కవితను విచారిస్తామని అలోక్ వెల్లడించారు. వెలుగులోకి వచ్చిన కొన్ని వాస్తవాల ఆధారంగా స్కామ్ లో కవితకు సంబంధం ఉన్నట్లు గుర్తించామని సీబీఐ అంటోంది. విచారించాల్సిన అవసరం ఉన్నందునే ఆరో తేదీన కవితకు అనుకూలమైన ప్రదేశంలో విచారణకు చేపడతామన్నారు. ప్లేస్ ఏదో నిర్ణయించుకునే ఛాయిస్ కవితకే వదిలేశారు. నోటీసులు అందిన విషయాన్ని కవిత కూడా ధృవీకరించారు. దానితో తన నివాసంలోనే వారిని కలుసుకుని అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు సుముఖంగా ఉన్నట్లు కవిత సీబీఐ అధికారులకు సమాచారం పంపారు.

కవితకు అందిన నోటీసుల ప్రకారం కేంద్ర హోం శాఖ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ రాయ్ నుంచి సీబీఐకి లిఖిత పూర్వక ఫిర్యాదు అందింది. మద్యం విధాన రూపకల్పనలో అవకతవకలను విచారించాల్సిన అనివార్యత ఏర్పడిందని ఆ సంస్థ వెల్లడించింది. ఆరోపణలపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 7 రెడ్‌ విత్‌ సెక్షన్‌ 120బీ, ఐపీసీ సెక్షన్‌ 447 ఏ కింద ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాతో పాటు మరో 14 మందిని నిందితులుగా చేరుస్తూ సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ దిశగానే కవితను ప్రశ్నించాలని సీబీఐ అధికారులు తీర్మానించారు.

ఢిల్లీ మద్యం విధానం రూపకల్పనలో కవిత పాత్ర ఉందని ఆ పాలసీని రూపొందించే సమయంలో ఢిల్లీలోని ఒబెరాయ్‌ హోటల్‌లో జరిగిన సమావేశాల్లో ఆమె పాల్గొన్నారని ఆరోపణలు వినిపించాయి. ఆ ఆరోపణలు నిజమేనని ఈడీ వర్గాలు ఇటీవలే సీబీఐ ప్రత్యేక కోర్టుకు సమర్పించిన ఓ రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఈ కుంభకోణంలో కవిత పాత్ర ఏమిటి? ఆమెతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన అరబిందో ఫార్మా డైరెక్టర్‌ శరత్‌చంద్రారెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వీరంతా కలిసి ముడుపులను ఎవరికి ఇచ్చారు? ఎలా లబ్ధి పొందారు? అనే వివరాలను కోర్టుకు సమర్పించిన రిపోర్టులో ఈడీ అధికారులు స్పష్టంగా వివరించారు. కవిత, శరత్‌ చంద్రారెడ్డి, మాగంటి, మనీశ్‌సిసోడియాతో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న మొత్తం 38 మంది సుమారు 170 ఫోన్లను మార్చేసి తర్వాత వాటిని ధ్వంసం చేశారని అలా ధ్వంసం చేసిన డివైజ్‌ల విలువ రూ. 1.30 కోట్లుగా ఉంటుందని న్యాయస్థానానికి తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగేలా రూపొందించిన మద్యం పాలసీ కారణంగా వంద కోట్ల రూపాయలు ముడుపులు అందినట్లు ఈడీ రిమాండ్ రిపోర్టులో వెల్లడించింది.

హోల్‌సేల్‌ లిక్కర్‌ వ్యాపారి అమిత్‌ అరోరా ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించారని ఆయనను విచారిస్తున్నప్పుడు కవిత, శరత్‌, మాగుంట పాత్ర బయటపడిందని పేర్కొన్నారు. మరోవైపు కవితకు గతంలో సహాయకుడిగా వ్యవహరించిన హైదరాబాద్‌ వ్యాపారవేత్త అభిషేక్‌ బోయినపల్లి ఈ కేసులో ఇప్పటికే అరెస్టయితిహార్‌ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. శరత్‌చంద్రారెడ్డి కూడా అదే జైలులో ఉన్నారు. కవిత ఆడిటర్‌ గోరంట్ల బుచ్చిబాబును కూడా ఇటీవలే ఈడీ విచారించింది. మొత్తమ్మీద గడిచిన కొద్దిరోజులుగా ఈ కేసులో పావులు చకచకా కదులుతున్నాయి. అమిత్‌ అరోరా విచారణలో కవిత పేరు బయటపడడం ఈడీ కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో ఆమె పేరు ప్రస్తావించడం ఆ తర్వాత 48 గంటలు గడిచేలోపే ఆమెకు సీబీఐ నోటీసులు జారీ చేయడం చక చకా జరిగిపోయాయి.

అనుమానిత నిందితులను అన్ని వైపుల నుంచి కమ్ముకునేందుకు వీలుగా రెండు దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. రిమాండ్ రిపోర్టులో తొలుత కవిత పేరు ప్రస్తావించినదీ ఈడీ మాత్రమే వ్యూహత్మాకంగా ఆమెను మొదట ప్రశ్నస్తున్నది మాత్రం సీబీఐ అని మరిచిపోకూడదు. అంతే సీబీఐ ప్రశ్నించిన తర్వాత మళ్లీ ఈడీ కూడా లైన్లోకి వచ్చే అవకాశం ఉంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఒకసారి ప్రశ్నించడంతో వదిలిపెట్టవని అందరికీ తెలుసు. మళ్లీ మళ్లీ ప్రశ్నిస్తూనే ఉంటారు. వివిధ రకాల ప్రశ్నలతో మానసిక వత్తిడిని సృష్టిస్తారు. కొన్ని సందర్భాల్లో ఇద్దరు ముగ్గురు నిందుతులను ఒకే చోట కూర్చోబెట్టి క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. అప్పుడు కల్లబొల్లి కబుర్లతో తప్పించుకునే వీలుండదు.

ప్రస్తుతానికి కవిత కోరినట్లుగా ఆమె ఇంటికి వచ్చి ప్రశ్నించేందుకు సీబీఐ అంగీకరించింది. ప్రతీ సారి అలా జరగకపోవచ్చు. ఏదోక రోజున ఢిల్లీలోని కేంద్ర కార్యాలయానికి రావాలని కోరడం ఖాయం. పైగా రిమాండ్ రిపోర్టు కోర్టుకు సమర్పించిన ఈడీ నజర్ పెడితే మరికొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి.

కేంద్రం పగబడితే దర్యాప్తు సంస్థలపై వత్తిడి తెచ్చి అరెస్టు చేయిస్తుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మనీష్ సిసోడియాను ప్రశ్నించినప్పుడు అదే ప్రస్తావన వచ్చింది. రెండు వారాలైనా జైల్లో ఉండాల్సి వస్తుందని సీబీఐ అధికారులు చెప్పినట్లు సిసోడియా మీడియాకు వెల్లడించారు. మోదీ అలా కోరుకుంటున్నారని అన్నారు. పైగా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బయటకు వస్తే కేసులు ఆగిపోతాయని కూడా ఆఫరిచ్చారన్నారు. ఈ ఆరోపణలను సీబీఐ ఖండించిందనుకోండి. ఇప్పుడు కవిత కేసులోనూ అలాగే అనుకోవాలి. ఆమె ఇప్పటి వరకు కవిత కేవలం అనుమానితురాలు మాత్రమే. ఎక్కడా ఎఫ్ఐఆర్ లో కవిత పేరు చేర్చలేదు. సీబీఐ, ఈడీ చెరో చార్జ్ షీటు దాఖలు చేసినా ఆమె పేరు నిందితుల జాబితాలో లేదు. బహుశా పూర్తిగా సాక్ష్యాలు సేకరించిన తర్వాతే పేరు చేర్చాలనుకుని ఉండొచ్చు. అంటే అసలు కథ ముందుందని మనం చెప్పుకోవాలి..