యాక్టివ్ అవుతున్న తెలంగాణ బతుకమ్మ..

By KTV Telugu On 23 November, 2024
image

KTV TELUGU :-

కల్వకుంట్ల కవిత.. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తెగా తొలుత ఫేమస్ అయ్యారు. తెలంగాణ జాగృతి నేతగా మరోసారి ఫేమస్ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితురాలిగా మూడో సారి ఫేమస్ అయ్యారు. ఆరునెలలకు పైగా ఢిల్లీ తీహార్ జైల్లో గడిపిన తర్వాత బెయిల్ పొందిన కవిత.. అప్పటి నుంచి బయటకు రావడం లేదు. కొంతకాలం లో ప్రొఫైల్ గా ఉండాలని కేసీఆర్ సూచన మేరకే ఆమె మౌనవ్రతం పట్టారని పార్టీ వర్గాలు చెబుతూ వచ్చాయి. బీఆర్ఎస్ పై కాంగ్రెస్ వరుస ఆరోపణలు చూస్తూ.. కేసులు కూడా నమోదు చేసినప్పటికీ కవిత స్పందించలేదు. కేటీఆర్, హరీష్ రావు కాంగ్రెస్ పై వరుస ఎదురుదాడులు చేసినా కవిత ఏమీ ఎరుగనట్లున్నారు. పూజలు, ప్రార్థనలతో ఇంతవరకు టైమ్ పాస్ చేశారు….

ఇప్పుడు ప్రపంచాన్నే కుదిపేస్తున్న అదానీ వ్యవహారంపై కామెంట్స్ తో కవిత మళ్లీ వార్తల్లో వ్యక్తిగా మారేందుకు ప్రయత్నిస్తున్నారు. భారత్ లో భారీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టును దక్కించుకునేందుకు గౌతం అదానీ, మరో ఏడుగురితో కలిసి అధికారులకు లంచాలు ఆఫర్ చేసినట్లు అమెరికా ఎఫ్.బీ.ఐ. చెబుతోన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో బ్యాంకులు, ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి నిధులను సమీకరించేందుకు యత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఈ వ్యవహారం దేశ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది. అదానీ వ్యవహారంపై కాంగ్రెస్ నేతలు విరుచుకుపడుతున్నారని.. వారిపై బీజేపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో కల్వకుంట్ల కవిత స్పందించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో అదానికో న్యాయం.. ఆడబిడ్డకో న్యాయమా అంటూ ప్రశ్నించారు. “అఖండ భారతంలో అదానీకో న్యాయం.. ఆడబిడ్డకో న్యాయమా? ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్ట్ చేయడం ఈజీ. ఆధారాలు ఉన్నా అదానీని అరెస్ట్ చేయడం మాత్రం కష్టమా? ఎన్ని సార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని అదానీ వైపేనా??” అంటూ కల్వకుంట్ల కవిత ఎక్స్ వేదికగా స్పందించారు. ఇదే సమయంలో… “వారు అఖండ భారత్ ను ప్రచారం చేస్తారు కానీ.. సెలక్టివ్ జస్టిస్ ను అందిస్తారు! రాజకీయ ప్రత్యర్థులను సాక్ష్యాలు లేకుండా అరెస్ట్ చేసి నెలల తరబడి విచారణలో ఉంచారు.. అదే సమయంలో గౌతం అదానీ పదే పదే తీవ్ర ఆరోపణలు వచ్చినప్పటికీ స్వేచ్ఛగా నడుచుకుంటారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఆపేది ఏమిటి?” అని మరో ట్వీట్ చేశారు

నిజానికి రాజకీయ ప్రకటనల విషయంలో కవిత ఎప్పుడూ అగ్రసివ్ గా ఉండేవారు. ప్రత్యర్థులపై పవర్ ఫుల్ ట్వీట్లు చేసేవారు. ప్రత్యర్థుల కంటే బలమైన డైలాగులు వాడేవారు. ఇటీవలి కాలంలో మాత్రం ఆమె మౌన వ్రతం పాటించారు. చాన్నాళ్ల తర్వాత ఇప్పుడే తన కలానికి పదును పెడుతున్నట్లుగా ఉంది. తాజా ట్వీట్ తో కవిత అభిమానులు కూడా హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇక దబిడి దిబిడేనని చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతలను ఆమె కడిగిపారేస్తారని అంటున్నారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కవిత యాక్టివ్ గా ఉంటారని కూడా బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. చూడాలి మరి…..

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి