ఢిల్లీకి వెళ్లిన కవిత… అరెస్టు తప్పదా

By KTV Telugu On 9 March, 2023
image

ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఈడీ దూకుడు పెంచింది. విచారణలో వెల్లడైన ఆధారాలతో ఈ స్కామ్‌తో సంబంధం ఉన్నవారిని ఒక్కొక్కరినీ అరెస్టు చేస్తోంది. ఇప్పటివరకు మొత్తం 11 మందిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన అరుణ్‌ రామచంద్ర పిళ్లైని కూడా ఈడీ అధికారులు విచారించారు. కవితకు లబ్ధి చేకూర్చడానికి అరుణ్‌ పిళ్లై అన్నీ తానై వ్యవహరించానని తాను కవితకు బినామీని అని పిళ్లై ఒప్పుకున్నట్లు ఈడీ వర్గాలు చెబుతున్నాయి. పిళ్లై రిమాండ్‌ రిపోర్టులో కూడా ఈడీ కవిత పేరు ప్రస్తావించింది. దీంతో కవితను అరెస్టు చేయడం ఖాయమని బీఆర్‌ఎస్‌ నాయకులు భావించారు. ఊహించినట్లుగానే కవితకు ఈడీ నోటీసులు పంపింది. ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న పిళ్లైతో కలిపి కవితను విచారించే అవకాశం ఉంది.

ఇదే స్కామ్ కు సంబంధించి గత డిసెంబర్‌లో సీబీఐ అధికారులు హైదరాబాద్‌లోని కవిత ఇంటికి వెళ్లి దాదాపు ఏడు గంటలు విచారించారు. ఇప్పుడు ఈడీ నుంచి నోటీసులు రావడంతో ఆమెను అరెస్టు చేయడం ఖాయం అని బీఆర్‌ఎస్‌లో ఆందోళన మొదలైంది.అయితే 10వ తేదీన ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద మహిళల రిజర్వేషన్ల కోసం ధర్నా చేయనున్నట్లు కవిత ఇదివరకే ప్రకటించారు. ధార్నాతో పాటు ఇతర కార్యక్రమాలు ఉన్నందున 9న విచారణకు హాజరు కాలేనని 15న హాజరవుతానని కవిత ఈడీని కోరారు. అయితే ఈడీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దాంతో కవిత ఢిల్లీకి బయలుదేరారు. ఢిల్లీకి వెళ్లే ముందు ఆమె తన తండ్రి కేసీఆర్ కు ఫోన్ చేశారు. అయితే భయపడాల్సిన అవసరం లేదని కేసీఆర్‌ ఆమెకు ధైర్యం చెప్పారు. ఆందోళన చెందవద్దని బీజేపీపై న్యాయపరంగా పోరాడుదామని ఆయన భరోసా ఇచ్చినట్టు సమాచారం. ఇక ఢిల్లీలో ఏం జరగబోతోందనేది బీఆర్‌ఎస్‌ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.