గైర్హాజరుతో కవితపై ఈడీ కేసు మరింత స్ట్రాంగ్‌

By KTV Telugu On 17 March, 2023
image

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎంతోమంది ప్రముఖులు ఈడీ కేసుల్లో చిక్కుకున్నారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం, వైసీపీ ఎంపీ కొడుకు కూడా విచారణ తర్వాత అరెస్టయి జైల్లో మగ్గుతున్నారు. ఎంతోమందిని గంటలు రోజుల తరబడి విచారించి అరెస్ట్‌చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కి తెలంగాణ సీఎం కేసీఆర్‌ కూతురు కవిత మింగుడుపడటం లేదు. మార్చి16న ఈడీ ముందు హాజరుకావాల్సిన కవిత చివరిక్షణంలో తాను రావడంలేదంటూ లాయర్‌ ద్వారా వర్తమానం పంపించడంతో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. 11 గంట‌ల‌కు ఈడీ ముందు కవిత విచారణకు హాజరుకావాల్సి ఉండగా ఆమె తరపున హాజరైన లాయర్‌ కవిత పంపిన లేఖను అందించారు. ఈడీ విచారణపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవిత. మహిళను కార్యాలయానికి పిలిపించి విచారించడాన్ని ఆమె సవాలుచేశారు. అయితే ఈ కేసు విచారణను సుప్రీం 24వ తేదీకి వాయిదావేసింది. ఈలోపే ఈడీ విచారణ ఉండటంతో ఏం జరుగుతుందోనని అంతా ఉత్కంఠగా చూశారు. తీరా సుప్రీం విచారణలో ఉన్న కేసును ప్రస్తావిస్తూ కవిత గైర్హాజరయ్యారు. వ్యక్తిగతంగా హాజరుకావాలని ఈడీ సమన్లలో ఎక్కడా లేదన్నది కవిత చెబుతున్న లాజిక్‌.

సుప్రీంకోర్టు మార్చి 24న తన కేసు విచారణకు స్వీకరించే దాకా వేచి చూడాలని ఏమైనా సమాచారం కావాలంటే తన అధికారిక ప్రతినిధికి చెప్పాలని ఆమె ఆ లేఖలో ఈడీకి సూచించారు. అయితే ఆ లేఖను పరిశీలించిన ఈడీ మార్చి20న కవిత తమ ముందు వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందేనని మరోసారి నోటీసిచ్చారు. కవిత సుప్రీంని ఆశ్రయించినా ఈడీకి అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలేమీ ఇవ్వలేదు. కవితకు ఉపశమనమేమీ లభించలేదు. అయినా ఆ కేసును ప్రస్తావిస్తూ విచారణకు రాకపోవడం చట్టవిరుద్ధమన్న మాట వినిపిస్తోంది. 20వ తేదీన కూడా కవిత విచారణకు హాజరుకాకపోతే ఈడీ కఠినచర్యలకు దిగే అవకాశాలు ఉన్నాయి. ఢిల్లీ లిక్కర్‌స్కామ్‌లో విచారించాల్సింది ఇద్దరినేనని ఈడీ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. కవితతో పాటు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి కూడా నోటీసులు పంపింది. అయితే కవితను అనుమానితురాలిగానే ఈడీ చెప్పడం ఈ కేసులో ఆసక్తికరపరిణామం. అనుమానితురాలు విచారణ తర్వాత నిందితురాలు అయ్యే అవకాశాలు లేకపోలేదన్నది నిపుణులు చెబుతున్న మాట.

కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధ, ఆమె తనయుడు రాహుల్‌గాంధీనే స్వయంగా ఈడీ ముందు హాజరయ్యారు. సాంకేతిక అంశాలతో విచారణకు రానంటే కేసు మరింత క్లిష్టంగా మారుతుంది. ఈ విషయం కవితకి తెలియంది కాదు. కోర్టునుంచి ఎలాంటి ఉత్తర్వులు లేకున్నా ఆ పిటిషన్‌ని చూపించి ఈడీ విచారణకు డుమ్మాకొట్టారు కవిత. ఈడీ కూడా దీన్ని సీరియస్‌గా తీసుకుంది. విచారణకు వెళ్లకపోతే ఏం చేస్తారో చూసుకుందామన్న తెగింపు కవితలో కనిపిస్తోంది. ఒకటికి రెండుసార్లు విచారణకు హాజరైతే ఏ అరెస్ట్‌ వారంటో జారీ అవుతుంది నిర్బంధంగా అరెస్ట్‌ చేయాల్సి వస్తుంది. కవితతో పాటు ఆమె సకుటుంబ సపరివారం అదే కోరుకుంటున్నట్లుంది.

కవితను లిక్కర్‌స్కామ్‌ నిందితుడు అరుణ్‌ రామచంద్ర పిళ్లైతో కలిపి విచారించాలనుకుంటోంది ఈడీ. అతను కవిత బినామీ అని ఇప్పటికే రిమాండ్‌ రిపోర్టులో ఈడీ అభియోగాలు మోపింది. కవితతో కలిపి విచారించేందుకే ఈడీ అభ్యర్థనతో అరుణ్‌పిళ్లై కస్టడీని న్యాయస్థానం మార్చి 20దాకా పొడిగించింది. ఆరోజే కవిత-పిళ్లైలను ముఖాముఖి కూర్చోబెట్టి మ్యాటర్‌ తేల్చేయాలనుకుంటోంది ఈడీ. విచారణకు వెళ్తే ఈసారి అరెస్ట్‌ తప్పదన్న భయంతోనే కవిత కొత్త ఎత్తుగడకు తెరలేపినట్లు కనిపిస్తోంది. దీంతో 20న కూడా కవిత విచారణకు హాజరుకావడం అనుమానమే. ఆమె విచారణకు సహకరించకపోతే తర్వాత జరిగేది అరెస్టేనంటున్నారు. ఇంటికొచ్చి విచారించాలి వీడియో కాన్ఫరెన్స్‌లో విచారించాలని నిందితులు అనుమానితులు ఆంక్షలుపెడితే ఏ కేసులోనూ దర్యాప్తు ముందుకెళ్లదు. మరోసారి విచారణకు గైర్హాజరైతే కవితకు చట్టపరమైన తప్పకపోవచ్చు.