ఢిల్లి లిక్కర్ కేసులో అరెస్టయిన కల్వకుంట్ల కవిత మరిన్ని ఇబ్బందులను ఎదుర్కోబోతున్నారు. ఇప్పటికే 23 వరకు కవిత ఇప్పటికిప్పుడు బయటకు వచ్చే అవకాశాలు లేవన్నది ఓ వాదన. ఇప్పుడు ఆమె భర్త అనిల్ కుమార్ కు ఈడీ సమన్లు చర్చనీయాంశమవుతున్నాయి. ఇంతకాలం భార్య చాటు భర్తగా ఉన్న అనిల్.. కూడా స్కాంలో పాత్రధారి అయి ఉంటారని అనుమానిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులైతే.. జరూర్ దాల్ మే కుఛ్ కాలా హై అని వ్యాఖ్యానిస్తున్నారు…
ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టులో రోజంతా జరిగిన విచారణ, వాదోపవాదాల తర్వాత న్యాయమూర్తి నాగ్ పాల్.. ఈడీ వాదనతో కొంతమేర ఏకీభవించారు. కవితను పది రోజుల కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరగా…ఈ నెల 23 వరకు ఈడీ విచారించుకోవచ్చని న్యాయమూర్తి ప్రకటించారు. న్యాయమూర్తి ఉత్తర్వులు ఇచ్చిన గంట లోపే ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో ట్విస్ట్ బయటపడింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న కవిత భర్త అనిల్ కుమార్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. అనిల్ తో పాటు కవిత పీఆర్వో రాజేష్, మరో ముగ్గురు పర్సనల్ అసిస్టెంట్లు కూడా ఈడీ సమన్లు పంపింది. సోమవారం విచారణకు హాజరు కావాలని ఈడీ వారిని ఆదేశించింది. ఇప్పటికే కవితను రెండు దఫాలుగా ప్రశ్నించిన తర్వాత మరింతగా విచారణ జరపాల్సి ఉందంటూ ఆమెను అరెస్టు చేశారు. పైగా రెండు దఫాలుగా వారి ఫోన్లను స్వాధీనం చేసుకున్న అధికారులు అనేక కోణాల్లో విచారణ జరుపుతున్నారు…
కవిత కుటుంబం పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా తయారైంది. భర్త అనిల్ హాజరు కావాలా వద్దా అన్నది ఇప్పుడు వాళ్లు తేల్చుకోలేని అంశంగా మారింది. ఈడీ పిలిచిన ఐదుగురు ఒకేసారి వెళ్లాలా వద్దా అన్నది కూడా సుదీర్ఘంగా ఆలోచించుకోవాల్సిన అంశం. ఎందుకంటే ఈడీ ముందుకు వెళితే పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించడం కష్టమే అవుతుంది…
అనుమానం వచ్చిన ఇద్దరిని ఎదురెదురుగా కూర్చొబెట్టి ప్రశ్నించడం దర్యాప్తు సంస్థలు పాటించే వ్యూహాల్లో ఒకటి. ముందు విడివిడిగా అడిగిన ప్రశ్నలకు, తర్వాత కలిపి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు తేడా ఉంటే మాత్రం నిందితులుగా పేర్కొన్న వాళ్లు ఇరుక్కుపోవాల్సిందే. అందులో ఎలాంటి సందేహమూ ఉండదు. కవిత భర్త అనిల్ ఈడీ ఆఫీసుకు వెళితే మాత్రం కవితను ఆయన్ను ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నించడం ఖాయమని న్యాయనిపుణులు చెబుతున్న మాట.పైగా మొత్తం వ్యవహారాలు ఆమె పీఏలు చూసుకునే క్రమంలో వారి వాగ్మూలం కూడా కీలకమవుతుంది. దానితో ఇప్పుడు వారందరినీ ఒకే గదిలో కూర్చోబెట్టి ప్రశ్నల వర్షం కురిపిస్తే ఏమవుతుందనేది పెద్ద ప్రశ్న. అనేక కీలక సాక్ష్యాలు ఈడీకి దొరికినట్లే అవుతాయి. అప్పుడు కవిత ఒక్కరే కాదు.. ఆమె భర్త అనిల్ కూడా ఈ కేసులో ఇరుక్కున్నట్లే అవుతుందని చెబుతున్నారు.కవిత దాదాపు ఆరు నెలల పాటు ఢిల్లీలోని ఐదు నక్షత్రాల హోటల్లో లిక్కర్ మంత్రాంగం నడిపారని కూడా వార్తలు ఉన్నాయి. ఆ సమయంలో భర్త ఆమెకు సహకరించారా అన్నది కూడా ఈడీ పరిశీలనలో ఉందని చెబుతున్నారు. కవిత వెంట అనిల్ ఎన్ని సార్లు ఢిల్లీ వెళ్లారు. వారిద్దరి మధ్య ఫోన్లో జరిగిన సంభాషణ ఏమిటన్నది కూడా దర్యాప్తులో భాగమైంది. కవిత నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్ల సమాచారాన్ని వాళ్లు అధ్యయనం చేస్తున్నారు….
ఢిల్లీ లిక్కర్ స్కాంలో తవ్వే కొద్ది కొత్త విషయాలు బయటపడుతున్నాయి. కేజ్రీవాల్ కు ప్రస్తుతానికి బెయిల్ లభించినా తర్వాత హాజరు కాక తప్పదు. ఈ లోపే జైల్లో ఉన్న మనీష్ సిసోడియాను, కవితను ఏకకాలంలో ప్రశ్నించే అవకాశం ఉందని చెబుతున్నారు. పైగా కవిత ఫ్యామిలీ కూడా అదే చోట ఉండొచ్చు. ఏదేమైనా కవితకు కష్టాలు ఖాయంగా కనిపిస్తోంది..
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి….