ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సొంత దారి ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆమె బీఆర్ఎస్ దారిలో నడవడం లేదు. బీఆర్ఎస్ సపోర్టు తీసుకోవడం లేదు. అసలు ఆ పార్టీ నిర్ణయాలను పట్టించుకోవడం లేదు. తన దారిలో తాను వెళ్తున్నారు. కార్యక్రమాలన్నీ జాగృతి పేరు మీదనే నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున కూడా పోటీ చేయడం లేదు. అన్నింటికి మించి అసలు బీఆర్ఎస్ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడంలేదు. కవిత తీరుపై బీఆర్ఎస్‌లో విస్తృత చర్చ జరుగుతోంది. ఇక నుంచి సొంత రాజకీయానికి ప్రాధాన్యమిస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్ోతంది.
బీఆర్ఎస్ ఓడిపోయాక కవిత యాక్టివ్ గా ఉన్నారు. దాదాపుగా ప్రతీ రోజూ ఏదో ఓ కార్యక్రమం పేరుతో ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. సహజంగా కవిత చేస్తున్న కార్యక్రమాలన్నీ బీఆర్ఎస్ కార్యక్రమలే అనుకుంటారు. నిజానికి కవిత బీఆర్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. సొంతంగా భారత జాగృతి పేరు మీదనే ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. బీఆర్ఎస్ పిలుపు మేరకు ఇచ్చిన కార్యక్రమాల్లో పాల్గొనకుండా కేవలం తన సంస్థ వేదికగా వేరే కార్యక్రమాలు నిర్వహిస్తుండటం రాజకీయవర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం పెట్టాలన్న డిమాండ్ ను కూడా కవిత తెరపైకి తెచ్చారు. ఈ డిమాండ్ పూర్తిగా బీఆర్ఎస్‌కు సంబంధం లేకుండా.. తెలంగాణ జాగృతిపేరు మీదనే నిర్వహించారు. రౌండ్ టేబుల్ సమవేశాలు కూడా నిర్వహించారు. కవిత చేసే రాజకీయం జాగృతి పేరు మీదనే ఉంది. బీఆర్ఎస్ తో సంబంధం లేదన్నట్లగా ఆమె చేస్తున్న రాజకీయం.. ఏదో తేడా ఉందన్న విషయం హాట్ టాపిక్ గా మారింది.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతిపై విమర్శలు వస్తున్న తరుణంలో బీఆర్ఎస్ చలో మేడిగడ్డ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ ప్రోగ్రాంకు కవిత వెళ్లలేదు. ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు నిర్వహించింది. ఈ కార్యక్రమాల్లో ఎక్కడా కవిత కనిపించలేదు. ఇదే సమయంలో చిన జీయర్ స్వామితో భేటీ అయ్యారు. అదే సమయంలో కవిత పార్లమెంటు ఎన్నికల బరిలో ఉండటం లేదని స్పష్టమయింది. నిజామాబాద్ నుంచి గతంలో గెలిచిన కవిత.. ఓ సారి ఓడిపోయారు. ఈ సారి అక్కడే పోటీ చేసేందుకు గతంలో సన్నాహాలు చేశారు. కానీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఒక్క సారిగా వెనుకడుగు వేశారు. పోటీ గురించి మాట్లాడటం లేదు. అంతే కాదు నిజామాబాద్ బీఆర్ఎస్ వ్యవహారాలు కూడా చూసుకోవడంలేదు.
లోక్ సభ ఎన్నికలకు సంబంధించి పార్టీ అధినేత నిర్వహించిన కీలక సమావేశాల్లో సైతం ఆమె కనిపించలేదు. కవిత పార్లమెంటు ఎన్నికల్లో నిలబడాలంటే ఆమె సొంత నియోజకవర్గంగా చెప్పుకునే నిజామాబాద్ నుండే బరిలో దిగుతారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ఆమె ఉమ్మడి నిజామాబాద్ లోనే ఎక్కువగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కానీ అక్కడ 9 అసెంబ్లీ సెగ్మెంట్లకు గానూ కేవలం రెండు స్థానాల్లో మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది. 2018 ఎన్నికల్లో 8 స్థానాల్లో గెలవగా, యల్లారెడ్డిలో కాంగ్రెస్ గెలిచింది. అనంతరం ఆ ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా గులాబీ గూటికి చేరారు. కానీ ఈసారి కేవలం రెండు స్థానాలకే బీఆర్ఎస్ పరిమితం అయింది. 2018 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవని బీజేపీ 3 సీట్లు, కాంగ్రెస్ 4 సీట్లు గెలుచుకుంది. అంతేకాదు కామారెడ్డిలో సీఎం అభ్యర్థులు కేసీఆర్, రేవంత్ రెడ్డిలు సైతం బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. నిజామాబాద్ కి పసుపు బోర్డు కేటాయించడంతో స్థానిక ఓటర్లలో బీజేపీపై విశ్వాసం పెరిగిందన్న అభిప్రాయం ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఆ ప్రభావం పార్లమెంటు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కి పాజిటివ్ అవ్వొచ్చు. దీంతో ఉమ్మడి నిజామాబాద్ వ్యాప్తంగా పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ఉండే ఛాన్స్ ఉంది. ఈ సమీకరణాలన్నీ అంచనా వేసుకున్న తర్వాత పోటీకి దూరంగా ఉన్నారన్న అభిప్రాయాలు ఉన్నాయి.
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే ఆలోచనతో కేసీఆర్ టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చారు. ఆ సమయంలో కేసీఆర్‌కు జాతీయ రాజకీయాల్లో కవితే కీలకంగా వ్యవహరించారు. జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ కు ప్రచారం వచ్చేలా చేయడంలో కవితే కీలకంగా వ్యవహరించారు. తానొకటి తలిస్తే దైవమొకటి తలచినట్లు స్వరాష్ట్రంలో ఓటమి చవిచూడటంతో కారు పార్టీ డీలా పడింది. ఓటమి భయంతో కేసీఆర్ కూతుర్ని నిజామాబాద్ లో పోటీ చేయించడం లేదని, దమ్ముంటే పోటీ చేయించాలని రేవంత్ రెడ్డి భద్రాచలంలో సవాల్ విసిరారు. బీఆర్ఎస్ – బీజేపీ మధ్య లోపాయికారిక ఒప్పందం ఉందని అధికార కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.
అయితే కేవిత ఇవేమీ పట్టించుకోవడం లేదు. బీఆర్ఎస్ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఎంపీ స్థానాలకు సరైన అభ్యర్థులు లేక ఎవరో ఒకర్ని నిలబెట్టాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా కవిత పార్టీకి అండగా ఉండటం లేదు. లోక్ సభ ఎన్నికలు వస్తున్నందున అభ్యర్థి కోసం కూడా నిజామాబాద్‌లో పని చేసేందుకు సిద్ధపడటం లేదు. దీంతో రాజకీయం విషయంలో కవిత తన సొంత బాటను ఎంచుకుంటున్నారన్న వాదన వినిపిస్తోంది. దీనికి కారణం రాజకీయ వ్యూహమా కాదా అన్నది ముందు ముందు జరిగే పరిణామాల్ని బట్టి అంచనా వేయవచ్చు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…