కల్వకుంట్ల కవిత ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యారు. సుప్రీం కోర్టు తీర్పు తర్వాత తీహార్ జైలు నుంచి ఆమె బయటకు రాగానే భావోద్వేగ సన్నివేశాలు కనిపించాయి. అప్పుడామె కొంత ఉద్వేగానికి లోనై…తర్వాత నిలదొక్కుకున్నారు. పిడికిలి బిగించి జై తెలంగాణ నినాదం చేసిన కవిత….గట్టి స్టేట్ మెంట్ కూడా ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీకి, తమ కుటుంబానికి ఇబ్బందులు సష్టించిన వాళ్లకు వడ్డీతో సహా చెల్లిస్తామని ఆమె సవాలు చేశారు. వినడానికి రక్తి కట్టించే సన్నివేశమైనా ఆమెకు అంత సీన్ ఉందా అన్న ప్రశ్న తలెత్తుతోంది. బీఆర్ఎస్ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యాలా లేదా అని రాజకీయ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి…
ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితను ఈ ఏడాది మార్చి 15న ఈడీ అరెస్టు చేయగా, ఏప్రిల్ 15న సీబీఐ అరెస్టు చేసింది. అప్పట్నుంచి ఆమె తీహార్ జైలులోనే ఉంటున్నారు. కవితకు బెయిల్ తెచ్చేందుకు బీఆర్ఎస్ అధిష్ఠానం ఐదు నెలలుగా చేయని ప్రయత్నాలు లేవు. చివరికి విషయం సుప్రీంకోర్టుకు చేరగా.. విచారణ చేసిన ధర్మాసనం ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ బెయిల్ ఇచ్చింది. కవిత భర్త అనిల్ కుమార్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర.. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో పూచీకత్తు సమర్పించారు. దీంతో ఆమె విడుదలను అంగీకరిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీహార్ జైలుకు వారెంట్ ఇచ్చింది. దీంతో 164 రోజులుగా జైలులో ఉన్న కవిత మంగళవారం రాత్రి బయటకు వచ్చారు. మరుసటి రోజే రౌస్ ఎవెన్యూ కోర్టులో విచారణకు ఆమె వర్చువల్ గా హాజరయ్యారు. విడుదల సందర్భంగా ఆమె భారీ స్టేట్ మెంట్ ఇచ్చారు. తాను కేసీఆర్ బిడ్డనని, తప్పు చేసే ప్రసక్తే లేదన్నారు. ప్రజల కోసం మరింతగా పోరాడతానని చెప్పుకొచ్చారు. తనకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదులు చెబుతూ..ప్రత్యర్థులను మాత్రం వదిలేది లేదన్నారు. ప్రతీ ఒక్కరికీ వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు..
కవిత భావోద్యేగానికి అర్థం ఉందా. కవిత విడదలపై రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న వాదనలు ఏమిటి. ఈ అంశంలో అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ చేస్తున్న ఆరోపణలేమిటి.. కాళ్లు పట్టుకున్నారన్న స్టేట్ మెంట్స్ ఎందుకు వస్తున్నాయి….
ఇకపై రాజకీయంగా కవిత ఎలాంటి పాత్ర పోషిస్తారన్న చర్చ మొదలైంది. పార్టీ ఇంతకాలం తనను దూరం చేసినందున ఇప్పుడు తనంతట తానుగా ఇన్‌వాల్వ్ అవుతారా?.. లేక పార్టీ ఆహ్వానిస్తే పాలుపంచుకుంటారా? అధికారంలో లేని సమయంలో పార్టీలో ఆమె పాత్ర ఎలా ఉండబోతున్నది? ఇవన్నీ ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. రానున్న రోజుల్లో ఆమె తీసుకునే నిర్ణయం కీలకంగా మారనున్నది. అరెస్టుకు ముందు బీజేపీపై నిప్పులు చెరిగిన కవిత ఇప్పుడు ఆ పార్టీ పట్ల ఎలాంటి వైఖరి తీసుకుంటారనేది ఆసక్తికరం. ఒకవైపు బీజేపీకి బీఆర్ఎస్ బీ-టీమ్‌గా మారిందనే ఆరోపణల నేపథ్యంలో కవిత ఫ్యూచర్ ప్లాన్ చర్చకు దారితీసింది.పొలిటికల్ ప్రయోజనాల కోసమే బీజేపీ తనను అరెస్టు చేయించిందని, ఇలాంటి బెదిరింపులకు లొంగేది లేదని, కడిగిన ముత్యంలా బైటకు వస్తానని, డాటర్ ఆఫ్ ది ఫైటర్‌గా భయపడే ప్రసక్తే లేదని… అరెస్టుకు ముందు కవిత అనేక రకాల స్టేట్‌మెంట్లు ఇచ్చారు. నిన్నటి దాకా ఇచ్చిన స్టేట్ మెంట్స్ వేరు..ఇప్పుడు జరగబోయేది వేరు. కవితపై ఆరోపణలు వచ్చిన తర్వాత అరెస్టయ్యే వరకు కూడా బీఆర్ఎస్ కార్యక్రమాలకు ఆమెను దూరంగా ఉంచారు. మరి లిక్కర్ స్కాంలో తీర్పు వచ్చే వరకు అదే పంథాను కొనసాగిస్తారా.. లేక ఏమైనా రూటు మార్చి కవితను క్రియాశీలంగా ఉండాలని చెబుతారా అన్నది వేచి చూడాలి. పైగా బీజేపీ వాళ్ల కళ్లు పట్టుకోవడం వల్లే కవితకు బెయిల్ వచ్చిందని కాంగ్రెస్ ఆరోపిస్తుండగా ఆ రెండు పార్టీలు ఒకటవ్వడం వల్లే కేసీఆర్ తనయ తీహార్ నుంచి బయటకు వచ్చారని బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు.అదే కేసులో సిసోడియాకు బెయిల్ వచ్చేందుకు 18 నెలలు పడితే, కవితకు ఆరు నెలలు కాకుండానే ఎలా వచ్చిందన్నది ఒక ప్రశ్న. అయితే చార్జీషీటు దాఖలైనందున బెయిల్ ఇవ్వడంలో తప్పులేదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆమెకు బెయిల్ రావడం సహేతుకమే అవుతుంది. అందుకే ఇప్పుడు బీఆర్ఎస్ పై వస్తున్న ఆరోపణలను కొట్టి పారేయ్యడం, అవి తప్పు అని నిరూపించడం కవిత ముందున్న పెద్ద సవాలు…
వంద కోట్లు ముడుపుల ఆరోపణలపై బీఆర్ఎస్ సరిగ్గా స్పందించలేదన్న వాదన ఉంది. తమకు పైసా కూడా అందలేదని నిరూపించే చర్యలు ఇప్పుడు కవిత కూడా చేపట్టాల్సి ఉంది. లిక్కర్ కేసులో తీర్పు వచ్చేందుకు ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేము. ట్రయల్ తీరుపై సుప్రీం కోర్టు కూడా అసహనం వ్యక్తం చేసింది. అందుకే తను ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత కవితపైనే ఉంది. పైగా బీఆర్ఎస్ ను ఢీ కొట్టలేక రెండు జాతీయ పార్టీలు కుట్రలు పన్నాయని కూడా ప్రచారం చేసే వీలుంది. చూడాలి మరి…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…