లోక్ సభ ఎన్నికల వేళ కవితను ఎందుకు అరెస్టు చేశారు. కేంద్రంలో అధికార పార్టీ ఇవ్వాలనుకున్న క్లారిటీ ఏమిటి. మోదీ హైదరాబాద్ లో ఉన్న రోజే వ్యూహాత్మకంగా అరెస్టు చేశారా. ఆమెను అదుపులోకి తీసుకున్న తీరు కరెక్టేనా.. కవిత అరెస్టుపై ప్రజా స్పందన ఎందుకు రాలేదు. అరెస్టు తీరుపై బీఆర్ఎస్ అభ్యంతరాలేమిటి….
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. శుక్రవారం అనూహ్య పరిణామాల మధ్య ఆమెను అరెస్టు చేసి ఢిల్లీకి తరలించారు. లిక్కర్ కేసుకు సంబంధించి మనీలాండరింగ్ కోణంలో పీఎంఎల్‌ఏ యాక్ట్ ప్రకారం అరెస్టు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఊహించని విధంగా శుక్రవారం హైదరాబాద్‌కు వచ్చిన ఈడీ బృందం సుమారు నాలుగు గంటలపాటు కవిత నివాసంలో సోదాలు నిర్వహించిన అనంతరం ఆమెను అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించింది. లిక్కర్ స్కాం కేసులో తనపై ఎటువంటి చర్యలు చేపట్టవద్దంటూ కవిత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణలో ఉన్నందున.. ఆమెను అరెస్టు చేసే అవకాశం ఉండదని, ఈడీ బృందం సోదాలు నిర్వహించి ఆమె స్టేట్‌మెంట్ రికార్డు చేసుకుని వెళ్తారని అంతా భావించినా.. అందుకు భిన్నంగా జరిగింది. ఈడీ అధికారులు కవిత నివాసంలోకి ప్రవేశించిన వెంటనే ఆమెతోపాటు ఇంట్లోని సిబ్బంది ఫోన్లను కూడా స్వాధీనం చేసుకోవడంతో లోపల ఏం జరుగుతుందనే విషయం బయటకు వచ్చేందుకు కొంత సమయం పట్టింది. కాగా, కవిత అరెస్టును బీఆర్‌ఎస్ తీవ్రంగా తప్పుబట్టింది. దీనిపై న్యాయపోరాటం చేస్తామని ప్రకటించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో మనీలాండరింగ్ కోణంలో పీఎంఎల్‌ఏ యాక్ట్ ప్రకారం కవితను అరెస్ట్ చేసినట్లు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్.. అరెస్ట్ ఆర్డర్‌లో పేర్కొన్నారు. మొత్తం కారణాలు పొందుపరిచిన 14 పేజీల నివేదికను కవిత భర్త అనిల్‌కుమార్‌కు ఈడీ అధికారులు అందజేశారు. ఈడీ వచ్చిన సంగతిని తెలుసుకున్న కవిత సోదరుడు కేటీఆర్.. అక్కడకు చేరుకుని వారితో వాగ్వాదానికి దిగారు. సుప్రీం కోర్టులో కేసు ఉన్నప్పుడు ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. ట్రాన్సిట్ రిమాండ్ లేకుండా అరెస్టు చేసి వేరొక నగరానికి తీసుకెళ్లడం కుదరదని చెప్పారు. దానితో అరెస్టు చేసిన 24 గంటల్లో హాజరు పరుస్తారమని ఈడీ అధికారులు సమాధానం ఇవ్వడంతో పాటు ఏమైనా అభ్యంతరాలుంటే కోర్టు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవచ్చని చెప్పడంతో మౌనంగా ఉండటం మినహా కేటీఆర్ చేయగలిగింది కూడా ఏమీ లేదని తెలిపోయింది…ఐనా అరెస్టు చేసి తీసుకెళ్తుంటే పిడికిలి బిగించి విప్లవ సంకేతం ఇవ్వడం ఏమిటన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి….
బీఆర్ఎస్ కు బీజేపీ కొంత దూరం జరిగినట్లు నిరూపించాలనుకుంది. ఇద్దరి మధ్య లోపాయకారి ఒప్పందం లేదని చెప్పుకోవాలనుకుంది. కాకపోతే అరెస్టు చేసిన టైమింగ్, అరెస్టు చేసిన తీరుపై కొన్ని రోజులు చర్చ జరగొచ్చు. విచారణకు కవిత సహకరించనందునే మెరుపుదాడితో అరెస్టు చేయాల్సి వచ్చిందని ఈడీ కోర్టుకు విన్నవించే అవకాశాలున్నాయి. ఐనా బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనని నిరూపించి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన నేపథ్యంలో ఆ ట్రాప్ నుంచి బయట పడటం అంత సులభం కాదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు….
ఎప్పుడు, ఎక్కడ, ఏమి చేయాలో మోదీకి, అమిత్ షాకు ఒక లెక్క ఉంటుంది. మిత్రపక్షాలను సైతం అవసరం దాటితే ఎలా వదిలించుకోవాలో కూడా వారికి తెలుసు. బీజేపీ తన రాజకీయ ప్రయోజనాలు, క్షేత్రస్థాయి సమీకరణాల ఆధారంగానే పనిచేస్తుంది.బీఆర్ఎస్, బీజేపీ మధ్య లోపాయకారి ఒప్పందం ఉందని విస్తృత ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిందని కూడా కమలం పార్టీ గుర్తించింది. లోక్ సభ ఎన్నికల్లో ఆ సీన్ రిపీట్ కాకుండా చూసేందుకే బీజేపీ వ్యూహాత్మకంగా కరెక్టుగా ఎన్నికల షెడ్యూల్ కు ముందు రోజు కవితను అరెస్టు చేయించింది. ఏడాదిగా సమన్లకు స్పందించకుండా కోర్టు పిటిషన్లతో తప్పించుకుంటున్న కవితను, ఆమె తండ్రి కేసీఆర్ పార్టీని అదును చూసి దెబ్బకొట్టింది. అయితే ఏమనుకుందో ఏమో.. లేడీ సెంటిమెంట్ కూడా పనిచేయకుండా చూడాలనుకున్నదో తెలీదు కానీ..అరెస్టు చేసి తీసుకువెళ్లేప్పుడు మాత్రం కవితను పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. ఆమె కారులోనే శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు తీసుకెళ్లారు. పైగా వీఐపీ ట్రీట్మెంట్ గా ఆమెను ముందు సీటులో కూర్చోనిచ్చారు. ఏదో పార్టీ మీటింగుకు వెళ్తున్నట్లుగా ఉన్నదే తప్ప అరెస్టు అయిన వ్యక్తి జైలుకు వెళ్తున్నట్లుగా అనిపించలేదు.ట్రాన్సిట్ పర్మిషన్ అంటూ కేటీఆర్ ప్రస్తావించిన అంశంలో కూడా పస ఉండకపోవచ్చన్న చర్చ లీగల్ వర్గాల్లో వినిపిస్తోంది. ఎందుకంటే ఈడీ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థకు ట్రాన్సిట్ రిమాండ్ వర్తించకపోవచ్చు. ఆ సంగతి నిదానంగా కోర్టు విచారణ తర్వాత తేలుతుంది. ఆమె ఆ కేసులో లేకపోతే, చార్జి షీటులో ఆమె పేరు లేకపోతే, స్కాం ఆధారాలు లేకపోతే, అనుమానితుల జాబితాలో ఆమె లేకపోతే ఆ అరెస్టు అక్రమం అవుతుంది. అన్నీ ఉన్నప్పుడు అక్రమం ఎలా అవుతుంది.,? అనైతికం ఎలా అవుతుంది..? అన్నది ఇప్పుడు తెలంగాణ ప్రజలు అడుగుతున్న ప్రశ్న. నిజానికి కవిత అరెస్టు పట్ల బీఆర్ఎస్ ఊహించినంత నెగెటివ్ స్పందనేమీ తెలంగాణ సొసైటీ నుంచి రాలేదు… ఆమె అరెస్టును తెలంగాణ ప్రజలు లైట్ తీసుకున్నారు… చివరకు సోషల్ మీడియా కూడా పెద్ద సానుభూతిని చూపించలేదు… కవిత అరెస్టు వల్ల బీఆర్ఎస్ కు సింపథీ రాదని నిర్థారించుకున్న తర్వాతే ఈడీని రంగంలోకి దించారనుకోవాలి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కవితను అరెస్టు చేస్తే మరో విధమైన లాబీయింగ్ తో పాటు శాంతి భద్రతల సమస్యలు వస్తాయని ఆగి ఉండొచ్చు. ఇప్పుడు లైన్ క్లియర్ అయ్యింది. బీఆర్ఎస్ నుంచి ఒక్కరొక్కరుగా నేతలంతా జారుకుంటున్నారు. లోక్ సభ ఎన్నికలు ముగిసే నాటికి బీఆర్ఎస్ పూర్తిగా ఒట్టిపోవడం ఖాయమనిపిస్తోంది. అప్పుడు కేసీఆర్ కుటుంబానికి బాసటగా నిలిచేవాళ్లు ఎవరూ ఉండదు. వాళ్ల వెంట నడిస్తే తాము కూడా అరెస్టు అవుతామని భయపడి నేతలు వెనక్కి తగ్గుతారు..ఇవన్నీ లెక్కలేసుకునే బీజేపీ ముందుకు వెళ్లిందని చెప్పాలి. ప్రస్తుతానికి మొక్కుబడి నిరసనలు జరిగి కొన్నిరోజుల తర్వాత విషయం చప్పబడుతుంది. ఇందులో మరో కోణం కూడా ఉంది. దేశంలో ప్రాంతీయ పార్టీలకు మనుగడ లేకుండా చేయాలన్నది మోదీ ఆలోచనా విధానం. ఈ క్రమంలో ఒక్కో పార్టీని కొట్టుకుంటూ వస్తున్నారు.. ఇప్పుడు బీఆర్ఎస్ పై ఆయన దృష్టి పడిందనుకోవాలి. కవిత అరెస్టుతో ఆ కార్యక్రమం మొదలైందా లేదా అన్నది చూడాలి..
కవిత అరెస్టుతో బీజేపీ సాధించబోయేదేమిటన్నది చూడాలి. అది తాత్కాలిక ప్రభావమా, శాశ్వత ప్రయోజనమా అన్నది నినాదంగా తెలియాల్సిన అంశం. అరెస్టుపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని బీజేపీ ఇప్పటికే తమ శ్రేణులను హెచ్చరించింది. ఈ మొత్తం వ్యవహారంపై కాంగ్రెస్ ముసిముసి నవ్వులు నవ్వుకుంటోంది. వాళ్లిద్దరూ కొట్టుకుంటుంటే తమకు ప్రయోజనకరమని కాంగ్రెస్ విశ్వసిస్తోంది..
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…