అవే మాటలు, అవే తిట్లు, అవే భావోద్వేగాలు, అవే రెచ్చగొట్టే వ్యాఖ్యలు, మధ్యమధ్యలో కల్లబొల్లి కబుర్లు, జనాన్ని నమ్మించాలన్న ప్రయత్నాలు..నల్గొండలో కేసీఆర్ చూపించిన పొలిటికల్ సీన్. దూకుడు మీదున్నట్లు కనిపించినా ఎక్కడో ముందు జాగ్రత్తగా సంయమనం పాటిస్తున్నట్లు కూడా అనిపించింది. మేడిగడ్డ కుంగడంతో డిఫెన్స్ లో పడిపోయిన అనుభూతి తెలంగాణ ప్రజలకు కనిపించింది.
రాష్ట్రాన్ని దద్దమ్మలు, చేతకానివాళ్లు పాలిస్తున్నారని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. తాను పదవి నుంచి తప్పుకోగానే రాష్ట్రంలో కరెంటు కోతలు మొదలయ్యాయన్నారు. ప్రజల కోసం తాను ఎక్కడెక్కడి నుంచో కరెంటు తెచ్చి ఇచ్చానని, కానీ.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో అసెంబ్లీని కూడా జనరేటర్ పెట్టి నడిపించుకుంటున్నారని విమర్శించారు. ప్రజలు ఏ భ్రమలకో లోనై.. పాలిచ్చే బర్రెను కాదని దున్నపోతును తెచ్చుకున్నారని వ్యాఖ్యానించారు. అయినా తమకు అప్పజెప్పిన ప్రతిపక్ష బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తామని, తెలంగాణ ప్రజల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. మళ్లీ రెట్టింపు వేగంతో అధికారంలోకి వస్తామని ప్రకటించారు. నిజానికి దద్దమ్మలు, సన్నాసులు, చేతకానివాళ్లు ఇలాంటి మాటలు మలిదశ ఉద్యమకాలంలో కేసీఆర్….. తెలంగాణ జనంపైకి వదిలిన బాణాలనే చెప్పాలి. అప్పట్లో కేసీఆర్ స్పీచ్ తో యువత భావోద్వేగాలకు లోనైన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఉద్యమాన్ని రక్తపాత రహితంగా, చివరికంటా నిలబెట్టేందుకు కూడా ఆయన తిట్ల పురాణం ఉపయోగపడింది. ఇప్పుడు పదేళ్ల తర్వాత ఆ భావోద్వేగం లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమంపై ప్రభుత్వాలు చేస్తున్నదేమిటి అనేది మాత్రమే ఇప్పుడు జనంలో మెదులుతున్న అంశం. ఈ క్రమంలో కేసీఆర్ కుటుంబం బొక్కిందెంత, బీఆర్ఎస్ నేతలు తిన్నది ఎంత అన్నదే ఇప్పుడు చర్చనీయాంశం. ఆ సంగతి కేసీఆర్ అర్థం చేసుకున్నారో లేదో.. తన పాత ధోరణిలోనే మాట్లాడేస్తున్నారు….
బీఆర్ఎస్ ని మళ్లీ తానే గాడిలో పెట్టాలన్న తపన కేసీఆర్ లో కనిపించింది. జననాడి ఏమిటో తనకే తెలుసున్న వాదనను కేసీఆర్ ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. రెండు నెలల్లోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెయిలయ్యిందని ప్రూవ్ చేసేందుకు ఆయన మాటల గారడీకి తెరతీశారు.అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వ తప్పులను ప్రస్తావిస్తున్నారు… కొన్ని అంశాల్లో మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అవినీతి ఆరోపణలను ఎక్కడా టచ్ చేయలేదు.
ఓడిపోయిన వాళ్లు కొంతకాలం మౌనంగా ఉండటం సాధారణంగా జరిగే విషయం. ఫలితం వచ్చిన రోజు నుంచే ఎదురుదాడి మొదలు పెట్టడం ఇప్పుడు కొత్త ట్రెండ్. బీఆర్ఎస్ కూడా అదే పని చేస్తోంది. ఈ రెండు నెలల కాలంలో కేటీఆర్, హరీష్ రావు ఇతర నేతలు రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారానికి వచ్చి వంద రోజులు కాకముందే ఆ ఆరు గ్యారెంటీల సంగతేమిటని నిలదీస్తున్నారు. అప్పుడప్పుడు ఎదురుదాడికి గురై తిట్లు తింటున్నారు. ఇప్పడు గులాబీ దళపతి కేసీఆర్ అదే పని చేస్తున్నారు. పైగా కాంగ్రెస్ ను గెలిపించినందుకు తెలంగాణ ప్రజలను కూడా తప్పుబడుతున్నారు. పాలిచ్చే బర్రెను వదిలేసి దున్నపోతును తెచ్చుకున్నారన్నది కేసీఆర్ ఆరోపణ. ఇక రైతు బంధు అడిగితే చెప్పుతో కొట్టాలని అంటున్నారని, రైతులు చెప్పుతో కొడితే కాంగ్రెస్ నేతల 32 పళ్లూ రాలిపోతాయని అంటూ.. అన్నదాతలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజల సొమ్ము బొక్కేశారన్నది కాంగ్రెస్ ప్రధాన ఆరోపణ.కాళేశ్వరం పేరుతో లక్షకోట్లు ఖర్చు పెట్టి లక్ష ఎకరాలకు కూడా నీళ్లివ్వలేదన్నది రేవంత్ నేరుగా చేసే ఆరోపణ. అలాంటి విషయాల్లో కేసీఆర్ వ్యూహాత్మక మౌనం పాటించారు. ఎందుకంటే వాటిపై మాట్లాడితే తేనె తుట్టెను కదిలించినట్లవుతుందని ఆయనకు తెలుసు. ప్రస్తుతానికి ఆయన రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆరోపణలతో కాలయాపన చేస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని కూడా లేదు..
నల్గొండ మీటింగ్ బీఆర్ఎస్ నేతలకు, కార్యకర్తలకు ధైర్యం చెప్పేందుకే ఏర్పాటు చేశారని అనుకోవాలి. ఇలాంటి మరిన్ని మీటింగులు ఉంటాయన్న సంకేతమూ అందులో ఉందని తెలుసుకోవాలి. రేవంత్ ప్రభుత్వానికి టార్గెట్ అయ్యే బీఆర్ఎస్ శ్రేణులకు ధైర్యం చెప్పాల్సిన అనివార్యతను గుర్తించినందుకే ఆ బహిరంగ సభ ఏర్పాటు చేశారని నిర్థారించుకోవాలి. ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా జనం కోసం, కార్యకర్తల కోసం కేసీఆర్ వచ్చారని సందేశం ఇచ్చే ప్రయత్నం కూడా అందులో ఉందని గుర్తించాలి. రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీయగలిగారా అంటే మాత్రం అంత సీన్ లేదనే చెప్పుకోవాల్సి వస్తుంది..
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…