తెలంగాణ తెచ్చింది తామేనని .. తమ నాయకుడు కేసీఆర్ తెలంగాణ బాపు అని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసుకుంటూ వచ్చారు కానీ.. ఇప్పుడు పరిస్థితి తిరగబడింది. తెలంగాణపై వారి ముద్ర లేకుండా చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. టీఎస్ అనే పేరు మార్చడం దగ్గర నుంచి అధికారిక చిహ్నం మార్పు వరకూ కేసీఆర్ ముద్ర లేకుండా తెలంగాణలో కొత్త రాజకీయం ప్రారంభించారు. ఈ రాజకీయం వర్కవుట్ అవుతుందా ..? తెలంగాణపై కేసీఆర్ ముద్రను రేవంత్ తుడిచేయగలరా ?
ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలని తెలంగాణ ప్రజలు కోరుకోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి సాంస్కృతిక వైరుధ్యం. భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడినప్పటికి తెలంగాణలో ప్రజల సాంస్కృతిక జీవనం.. ఏపీ ప్రజల సాంస్కృతిక జీవనం భిన్నంగా ఉంటాయి. విభజన డిమాండ్ పెరగడానికి ఇది కూడా ఓ కారణం. తెలంగాణ ఏర్పడిన తర్వాత తన సాంస్కృతిక వైభవాన్ని తెలంగాణ చాటుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో కేసీఆర్ తెలంగాణ చిహ్నాన్ని, తెలంగాణ తల్లి విగ్రహాలకు రూపకల్పన చేశారు. అధికారికంగా ప్రకటించారు. తెలంగాణ గేయాన్ని మాత్రం ప్రకటించలేదు. కానీ అనధికారికంగా జయదయహే తెలంగాణనే ఉపయోగిస్తు్ున్నారు పదేళ్ల తర్వాత ఇప్పు డు అధికారం మారడంతో కేసీఆర్ ప్రభుత్వం రూపొందించిన అన్ని గుర్తులను తీసేసి కొత్త వాటికి రూపకల్పన చేస్తున్నారు. జూన్ రెండో తేదీన తెలంగాణ పదో ఆవిర్భావ దినోత్సవం రోజున అధికారికంం చేయబోతున్నారు.
అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం’ గీతాన్ని ‘తెలంగాణ రాష్ట్ర గీతం’గా మారుస్తామని ఎన్నికల ప్రచార సభల్లోనే రేవంత్ రెడ్డి ప్రకటించారు. అన్నట్లుగానే అధికారంలోకి వచ్చిన తర్వాత ఫిబ్రవరిలో జరిగిన కేబినెట్ భేటీలో మార్పు నిర్ణయం తీసుకున్నారు. ‘జయ జయహే తెలంగాణ’ అనే పాటనే తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతంగా భావిస్తూ వస్తున్నారని .. ఇది తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం కాదని 2021లో కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. కానీ తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు, కాలేజీలు, స్కూళ్లు, నగరాలు, పట్టణాలు, పల్లెలు, గ్రామాలు, అన్ని వీధుల్లోనూ ఇదే గేయం మోర్మోగింది. కేసీఆర్ పట్టించుకోకపోవడాన్ని రేవంత్ అవకాశంగా తీసుకున్నారు.
ఇక తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రముఖ ఆర్టిస్ట్ ఏలే లక్ష్మణ్‌కు ప్రభుత్వ చిహ్నం రూపొందించారు. చిహ్నంలో వరంగల్ కాకతీయ తోరణం, చార్మినార్ రెండు కనిపిస్తాయి. అయితే ఈ రెండు రాచరిక పోకడలకు నిదర్శనం అని రేవంత్ రెడ్డి భావన. అధికారిక చిహ్నంలో కాకతీయ తోరణం కూడా ఉండబోదని సమ్మక్క-సారక్క, నాగోబా జాతర స్ఫూర్తి ప్రతిబింబించేలా తెలంగాణ చిహ్నాన్ని తయారు చేస్తున్నామని రేవంత్ ప్రకటించారు. తెలంగాణ తల్లి విగ్రహం కూడా తలపై కిరీటంతో రాచరికానికి చిహ్నంగా ఉందని తెలంగాణ అస్తిత్వం ఉట్టిపడేలా తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేర్పులు చేపడతామని రేవంత్ కేబినెట్ ప్రకటించింది. ఆ ప్రకారం మార్పు చేర్పులు చేశారు. ఈ విగ్రహాన్ని జూన్ రెండో తేదీన ఆవిష్కరించనున్నారు.
ఇప్పటికే కేసీార్ సర్కార్ తీసుకున్న పలు నిర్ణయాలను రేవంత్ మార్చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టిజి అనే పదం వినిపించేది, కనిపించేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దాన్ని టిజిగా పిలుచుకోవాలని, వాహనాలపై టిజి వుంటుందని అందరూ భావించారు. కానీ కేసీఆర్ మాత్రం టిజి కాదని టీఎస్ ను ఖరారు చేశారు.త పదేళ్లుగా కొనసాగిన టీఎస్ ను కాంగ్రెస్ అధికారంలోకి రాగానే టిజిగా మార్చింది. రేవంత్ ఎన్ని మాటలు చెప్పినా ఆయన ఉద్దేశం మాత్రం స్పష్టం. తెలంగాణ నుంచి కేసీఆర్ ముద్రను చెరిపేయాలన్నదే లక్ష్యం. ఎలా చూసినా తెలంగాణ ఇచ్చింది.. కాంగ్రెస్ అనే ముద్ర మాత్రమే ఉండేలా రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అది సాధ్యమేనా అన్నది కాలమే నిర్ణయించాలి.
తెలంగాణ ఉద్యమ చరిత్రలో కేసీఆర్ కో ప్రత్యేక స్థానం ఉంటుంది. తొలి పదేళ్లు పరిపాలించిన సీఎంగా ఆయన ముద్రల్ని చెరిపేయాలనుకోవడం అత్యుత్సాహమే అనుకోవచ్చు. మరి రేవంత్ ఈ నిర్ణయాలను ప్రజలు సమర్థిస్తారా ?
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…