తెలంగాణ ముఖ్యమంత్రి ఓవరాక్షన్ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫామ్ హౌస్ కేసులో సిట్ దర్యాప్తుకు ఆదేశించి తన గొయ్యి తానే తవ్వుకున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పైగా కేసీఆర్ పెట్టిన ప్రెస్ మీట్ ఇప్పుడాయన మెడకు కొండ చిలువలా చుట్టుకుందన్న టాక్ నడుస్తోంది.
వందకోట్లకు నలుగురు ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం జరిగిందన్న ఆరోపణలతో మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి వ్యవహారం చినికి చినికి గాలివానగా మారింది. తెలంగాణ సిట్ తన విచారణను కొనసాగిస్తుండగానే ముగ్గురు నిందితులపై వేరే కేసులు కూడా పెట్టి బయటకు రాకుండా చూడాలని తెలంగాణ సర్కారు ప్రయత్నిస్తోంది. బీజేపీ జాతీయ నాయకుడు బీఎల్ సంతోష్ ను ఇరికించి ముప్పు తిప్పలు పెట్టడమే కేసీఆర్ ఉద్దేశం. రెండాకులు ఎక్కువే తిన్నామన్నట్లుగా బీజేపీ కూడా అడుగులు వేస్తోంది. పైలట్ రోహిత్ రెడ్డిని ఈడీ విచారిస్తోంది. ఇంతలోపే సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం అందుకు న్యాయస్థానం అంగీకరించడం జరిగిపోయాయి.
సీబీఐ విచారణ మొదలైతే కేసీఆర్ ను ఆయన టీమ్ ను ముప్పుతిప్పలు పెట్టడం ఖాయమని చెబుతున్నారు. ఇకపై సిట్ విచారణ ఉండదని హైకోర్టు ప్రకటించడం కేసీఆర్ కు ఎదురు దెబ్బే అవుతుంది. పైగా సీబీఐ విచారణలో అధికారులు మొదటి నుంచి నరుక్కుంటూ వస్తారు. నిందితులుగా జైల్లో ఉన్న వారిని ఫామ్ హౌస్ కేసులో ఫిర్యాదు చేసిన నలుగురు ఎమ్మెల్యేలను ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నిస్తారు. పరస్పర విరుద్ధమైన సమాధానాలు వస్తే పైలట్ రోహిత్ రెడ్డి టీమ్ కు ఇబ్బందులు తప్పవు విచారణకు సహకరించడం లేదన్న నెపంలో ఆయన్ను, లేదా నలుగురిని సీబీఐ అరెస్టు చేసినా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు. కేసును సీబీఐకి ఇవ్వడానికి 45 కారణాలను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి తన తీర్పులో వెల్లడించడంతో విచారణ పకడ్బందీగానే జరుగుతుందని భావించాల్సి ఉంటుంది.
వంద కోట్లు ఇచ్చి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారన్నది ముగ్గురు నిందుతులతో పాటు బీజేపీ నేతలపై వచ్చిన ప్రధాన ఆరోపణ. సీబీఐ కూడా ఇప్పుడు అదే అడగబోతోంది. తాము పూజలు చేసేందుకు వస్తే అరెస్టు చేశారని జైల్లో ఉన్న నిందుతులు చెప్పుకుంటున్నారు. అలాంటప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వంద కోట్లు ఇవ్వజూపినది ఎవరన్న సీబీఐ ప్రశ్నలకు వాళ్లే సమాధానం చెప్పాలి. పైసా డబ్బులు చేతికి వచ్చినట్లు అంగీకరించినా అవినీతి నిరోధక చట్టం కింద వారిని అరెస్టు చేయించే అవకాశం ఉంది. డబ్బులు రానప్పుడు చర్చ ఎందుకు జరిగిందీ అసలు సూత్రధారులు ఎవ్వరూ అన్నది వెల్లడించక తప్పదు.
కేసీఆర్ ను కూడా సీబీఐ ప్రశ్నించాల్సిన అనివార్యత ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఫామ్ హౌస్ కేసు ఆధారాలు బయటపెట్టారు. కేసీఆర్ కు ఆ ఆధారాలు ఎక్కడ నుంచి వచ్చాయో సీబీఐ ముందు ఆయన వెల్లడించాలి. కేసీఆర్, పైలట్ రెడ్డిని ఎదురెదురుగా కూర్చోబెట్టి మాట్లాడించాల్సిన పరిస్థితి వస్తే అంతకంటే దౌర్భ్యాగ స్థితి ఉండకపోవచ్చు. సీబీఐ తిప్పితిప్పి అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఉండవని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేంద్రం నుంచి సీబీఐపై వత్తిడి ఉండే తరుణంలో ఆ శాఖ అధికారులు కఠినంగానే వ్యవహరించే అవకాశం ఉంది. ఏదేమైనా సీబీఐ విచారణపై సుప్రీం కోర్టు స్టే ఇవ్వకపోతే బీఆర్ఎస్ నేతలకు కఠిన పరీక్షలే ఎదురవుతాయి