కేసీఆర్‌కు అసలు” పొలిటికల్ బర్త్ డే “ఈ ఏడాదే

By KTV Telugu On 17 February, 2023
image

రాజకీయంగా ఆయనను ఎంత మంది అభిమానిస్తారో అంత కంటే ఎక్కువ మందే వ్యతిరేకించవచ్చు కానీ వ్యక్తిగత రాగద్వేషాలను పక్కన పెట్టి చూస్తే కేసీఆర్ ఓ విలక్షణమైన నేత. రాజకీయాల కోసమే అయినా ఆయన తీసుకున్న టాస్కులు చిన్నవి కావు. అసాధ్యం అన్నటువంటివే. అయినా వాటిని ధైర్యంగా చేపట్టి ముందుకెళ్లి విజయాలు సాధించారు. అసెంబ్లీలో కేసీఆరే చెప్పినట్లే రిటైర్మెంంట్ వయసులో ఆయన మళ్లీ ఇంకో టాస్క్ తీసుకున్నారు. ఈ పెంట ఎందుకు పెట్టుకుంటానని ఆయన తన నిర్ణయాన్ని జస్టిఫికేషన్ ఇచ్చుకోవడానికి చేసిన ప్రయత్నం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అన్నప్పటి కంటే ఇప్పుడు దేశ రాజకీయాల్లో ముద్ర వేస్తానని చెప్పడం నమ్మశక్యంగా లేకపోవడమే కానీ. కేసీఆర్ ను మాత్రం ఎవరూ తక్కువ అంచనా వేయలేరు.

కోట్ల మంది ప్రజల స్వప్నం తెలంగాణ రాష్ట్రం. దాన్ని నిజం చేసి చూపించారు కేసీఆర్. తెలంగాణ సాధకునిగా చరిత్రలో నిలిచిపోయిన ఆయన ఇప్పుడు దేశాన్ని టార్గెట్ గా పెట్టుకున్నారు. రాజకీయాలు చాలా మంది గెలుపోటములుగా చూస్తారని తనకు మాత్రం టాస్క్ అని ఆయన చెబుతున్నారు. తెలంగాణను ఎనిమిదేళ్లలోనే కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేశానని అదే మోడల్‌తో దేశాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఆయన జాతీయ రాజకీయాలు ప్రారంభించారు. తన రాజకీయ జీవితాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లిన టీఆర్ఎస్ పార్టీని కూడా ఆయన బీఆర్ఎస్‌గా మార్చారు. కవచకుండలం లాంటి తెలంగాణ సెంటిమెంట్ ను కూడా వదులుకున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఓ ప్రత్యేకమైన పుట్టినరోజు జరుపుకుంటున్నారు.

రాజకీయాల్లో ప్రజల మద్దతు ఉంటేనే ఎవరికైనా విజయాలు. ఈ విషయం కేసీఆర్‌కు తెలుసు. అందుకే తెలంగాణ ప్రజలు పంపిస్తే ఢిల్లీ కోటను బద్దలు కొడతానని చెబుతున్నారు. దానికి తగ్గట్లుగా ప్రజలు తనకు మద్దతు ఇచ్చేలాగా ట్యూన్ చేసుకుంటున్నారు. ఇప్పటికి ఆ విషయంలో ముందడుగు వేశారు. ప్రజలు తనకు మద్దతుగా ఉన్నారని నిరూపించేందుకు టీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్ బర్త్ డే ను చాలా స్పెషల్‌గా నిర్వహిస్తున్నాయి. మూడు రోజుల కార్యక్రమాలను ప్లాన్ చేశాయి. పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలో ఎక్కడ చూసినా ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయి వచ్చే ఏడాది మళ్లీ పుట్టిన రోజుకు ఆయన జాతీయ రాజకీయాల్లో ఏ స్థాయిలో ఉంటారనేదే ఇప్పుడు కీలకం. గతంలో ఎన్నో సాధించిన పుట్టిన రోజులు చేసుకున్నారు కానీ ఈ సారి సాధించడానికి సన్నద్ధమయ్యే దశలో పుట్టినరోజు చేసుకుంటున్నారు.

కేసీఆర్ రాజకీయ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాజకీయాల్లో ఆయన వ్యూహాలు ఆయన అడుగులు ఎవరూ ఊహించని విధంగా ఉంటాయి. తన మాటలే మంత్రంగా ఆయన చేసే రాజకీయాలు తెలంగాణ ప్రజల్ని కట్టి పడేస్తాయి. కేసీఆర్ అసెంబ్లీలో చెప్పినట్లుగా రిటైరయ్యే దశలో కొత్త టాస్క్ ఎంచుకున్నారు. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయడానికి వెళ్తున్నారు. కేసీఆర్ రాజకీయ జీవితాన్ని పరిశీలించిన వారికి ఆయనను తక్కువ అంచనా వేయలేరు. ఎందుకంటే అసాధ్యం అనుకున్న పనులెన్నో ఆయన చేసి చూపించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధి చెందిందన్నది కళ్ల ముందు కనిపించే నిజం. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడానికి రైతులకు అండగా నిలబడటానికి ఆయన శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. ఆయన చేసే రాజకీయాల విషయంలో చాలా మందికి భిన్నాభిప్రాయాలు ఉండంవచ్చు కానీ తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఆయన చిత్తుశుద్ధిని ఇతర పార్టీల నేతలు కూడా శంకించరు. రాజకీయాలకు అభివృద్ధికి ఎప్పుడూ ముడిపెట్టలేదు. చేయాల్సిన పని చేస్తూనే ఆయన రాజకీయంగా ముందుకెళ్తున్నారు.

ఈ పుట్టిన రోజుకు ఆయన ఒకటి కంటే ఎక్కువ టాస్కులు ఉన్నాయి . ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడంతో పాటు బీఆర్ఎస్ పార్టీని జాతీయ స్థాయిలో విస్తరించాల్సి ఉంది. వచ్చే పుట్టినరోజు నాటికి ఆయన మూడో సారి సీఎంగా పదవిలో ఉంటే జాతీయ రాజకీయాల్లలో ఆయన సూపర్ స్టార్‌గానే ఉంటారనడంలో సందేహం లేదు. ఒక వేళ తెలంగాణలో ఓడిపోతే మాత్రం ఆయన ఇంత కాలం నిర్మించుకుంటూ వచ్చిన కీర్తి కూడా మిగలదు. చివరికి తెలంగాణ సాధించారన్న క్రెడిట్ కూడా ఇవ్వరు.