పార్టీ ఖాళీ అవుతున్నా కేసీఆర్ పట్టించుకోవడం లేదు. ఫామ్ హౌస్‌లో వ్యవసాయం చేసుకుంటున్నారు. రోజుకు మొక్కలు ఎంత పెరిగాయో లెక్కలు తీసుకుంటున్నారు కానీ పార్టీ ఎంత తరిగిపోతుందో పట్టించుకోవడం లేదు. పార్టీలో ఉన్న నేతలందరిపైనా పార్టీ మార్పు ప్రచారం జరుగుతోంది. దీంతో కొంత మంది ఫామ్ హౌస్ కు వచ్చి.. తాము పార్టీ మారడం లేదని చెప్పి వెళ్లాలనుకుంటున్నారు. వారితో కేసీఆర్ ఒకటి, రెండు నిమిషాలు మాట్లాడి పంపించేస్తున్నారు. అది వ్యూహమా.. లేకపోతే నిర్లక్ష్యమా అన్నది పార్టీ నేతలకు అర్థం కావడం లేదు.
పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ రాజకీయాలు మరింత డైనమిక్‌గా మారిపోయాయి. భారత రాష్ట్ర సమితి ఒక్క ఎంపీ స్థానం కూడా గెలుచుకోకపోవడం మెజార్టీ స్థానాల్లో డిపాజిట్లు కోల్పోవడంతో ఆ పార్టీ భవిష్యత్‌పై నేతల్లో ఆందోళన ప్రారంభమయింది. లోక్ సభ ఎన్నికల్లో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా చూస్తే అసెంబ్లీ స్థానాల్లో కేవలం మూడు అంటే మూడు స్థానాల్లో మాత్రమే ఆధిక్యత లభించింది. దీంతో కాంగ్రెస్, బీజేపీ బీఆర్ఎస్ లీడర్లు, క్యాడర్లను చేర్చుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. కేసీఆర్‌కు అత్యంత సన్నిహితులుగా పేరు పడిన బాన్స్ వాడ ఎమ్మెల్యే , మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. వీరు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని తెలిస్తే.. బీఆర్ఎస్ ఆపేందుకు అన్ని రకాల ఒత్తిళ్లు పెడుతుందని తెలుసుకాబట్టి.. వారికి కండువా కప్పిన తర్వాతనే అసలు విషయం వెలుగులోకి వచ్చేలా చేశారు. ఇక వారితో పెద్దగా సాన్నిహిత్యం లేని.. ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ సిగ్నల్ ఇస్తే అప్పుడు ఆ పార్టీలో చేరిపోవడానికి రెడీగా ఉన్నారు. పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టేందుకు అసెంబ్లీ సమవేశాలు వచ్చే నెలలో జరగనున్నాయి. ఆ సమావేశాల్లోపు కేసీఆర్‌కు ప్రతిపక్ష నేత హోదా లేకుండా చేస్తామని కాంగ్రెస్ పార్టీ అంటోంది.
పార్టీ దుర్భర పరిస్థితుల్లో ఉంటే అధినేత కేసీఆర్ పట్టించుకోవడం మానేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం అయిపోయిన తర్వాత ఆయన ఫామ్‌హౌస్‌కు వెళ్లిపోయారు. పూర్తిగా వ్యవసాయం మీద దృష్టి పెట్టారు. ఎవరైనా పార్టీ నేతలు వస్తానంటే కలుస్తున్నారు కానీ.. అదీ కూడా చాలా తక్కువే. గ్రేటర్ పరిధిలోని నలుగురు ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ చర్చలు జరిపిన విషయం తెలియడంతో ఫామ్ హౌస్‌కు పిలిచి మాట్లాడారు. ఆ తర్వాత ఇక ఏ విషయాలు పట్టించుకోవడం లేదు. తనకు అత్యంత సన్నిహితులు కూడా పార్టీ వీడి పోతున్నా స్పందిండం లేదు. మామూలుగా అయితే కేసీఆర్ ప్రజల్లోకి వచ్చి పోరాడతారని క్యాడర్ అనుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అనైతిక పద్దతులకు పాల్పడి .. తెలంగాణ అస్థిత్వం అయిన బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తోందని ప్రజల్లో సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తారని అనుకున్నారు. కానీ కేసీఆర్ ఏమీ పట్టనట్లుగానే ఉన్నారు. పోతే పోనీ అన్నట్లుగా కేసీఆర్ ఉండటం ఆ పార్టీ క్యాడర్ ను కూడా ఆశ్చర్య పరుస్తోంది.
కేటీఆర్ కూడా వలసలపై పెద్దగా ఆందోళన చెందుతున్నట్లుగా కనిపించడం లేదు. పార్టీని వీడిపోతే.. అనర్హతా వేటు వేయించే విషయంలో వెనక్కి తగ్గబోమని మాత్రం హెచ్చరిస్తున్నారు. బుజ్జగించడం కన్నా హెచ్చరికల మీదనే దృష్టి పెడుతున్నారు. సుప్రీంకోర్టుకు వెళ్లి అయినా పదవి ఊడగొడతామని అంటున్నారు. మాములుగా అయితే బీఆర్ఎస్ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. కాంగ్రెస్ పై ప్రజలకు కోపం వస్తే తమకే ఓట్లేస్తారని అనుకుంటారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రత్యామ్నాయంగా బీజేపీ పూర్తి స్థాయిలో ఎదిగి ఎదురుగా నిలుచుంది. ఇప్పుడు ఓటర్లను ఆకట్టుకునే మరో తెలంగాణ సెంటిమెంట్ లాంటి ఆయుధం దొరికితే కానీ బీఆర్ఎస్ ఉనికి పోరాటంలో సక్సెస్ కాదు. మరి అలాంటి ఆయుధం సృష్టించుకోకుండా కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో వ్యవసాయం చేసుకుంటున్నారు. అందుకే బీఆర్ఎస్ నేతల్లో మరింత ఆందోళన పెరుగుతోంది.
ఒడిదుడుకులు బి ఆర్ ఎస్ కు కొత్త కాదని కొంచెం ఓపిక పడితే మళ్ళీ ప్రజల్లో ఆదరణ లభిస్తుందని కేసీఆర్ పార్టీ నేతలకు చెబుతున్నారు. , ఇప్పటికే బి ఆర్ ఎస్ ప్రభుత్వం లేకపోవడం వల్ల విద్యుత్ , తాగు నీటి సరఫరా వంటి అనేక అంశాల్లో నష్టం జరుగుతున్నదనే అంశాన్ని ప్రజలు గుర్తిస్తున్నారని కేసీఆర్ అంటున్నారు. కేసీఆర్ తీరు చూస్తే తాము లేని లోటును ప్రజలు ఫీల్ అవుతారని.. మళ్లీ పిలిచి మరీ పట్టం కడతారన్న ధీమాలో ఉన్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అందుకే పూర్తిగా ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారని.. ప్రజల కోసం ఇప్పటికిప్పుడు రోడ్డెక్కడం కన్నా… ప్రభుత్వంపై ప్రజాగ్రహం పెరిగే వరకూ ఉండాలని అనుకుంటున్నారని అంటున్నారు. మొత్తంగా కేసీఆర్ ఇప్పుడు తనకు అలవాటైన మౌన వ్యూహంలో ఉన్నారు.
కేసీఆర్ మౌనం ఫలించి బీఆర్ఎస్ కు మంచి రోజులు వస్తే ఆయనను చాణక్యుడంటారు. లేకపోతే విఫలనేతగా మరోసారి ముద్ర వేస్తారు. ఏదైనా కేసీఆర్ చేతుల్లోనే ఉంది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…