తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మంపై ప్రత్యేక దృష్టి పెట్టారా. ఖమ్మంలో గెలవడంతో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బుద్ధి చెప్పాలన్న సంకల్పంతో కేసీఆర్ ముందుకు కదులుతున్నారా…జిల్లా నుంచి ఎవరు వస్తే వాళ్లని చేర్చుకోవడంతో పాటు ఎంత కష్టమైన వారి డిమాండ్లు నెరవేర్చేందుకు సిద్ధమవుతున్నారా. తన గేమ్ ప్లాన్ వర్కవుట్ అవుతుందన్న విశ్వాసం ఆయనలో కలుగుతోందా..
అటు తిరిగి…ఇటు తిరిగి ఖమ్మం అన్ని పార్టీలను టెన్షన్ పెడుతోంది. పొంగులేటి రాకతో కాంగ్రెస్ బలపడిందనుకుంటే ఆయన ఇప్పుడు డీలా పడినట్లు కనిపిస్తున్నారు. పైగా షర్మిల జాయిన్ అయితే ఆధిపత్య పోరు ఖాయమన్న అభిప్రాయమూ కనిపిస్తోంది. అక్కడ కమ్యూనిస్టులు కూడా మళ్లీ ఒకటి రెండు స్థానాలు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వారందరినీ దెబ్బకొట్టి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ జెండా పాతేందుకు కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. గతం వేరు వర్తమానం వేరు అన్న నిర్ణయానికి వచ్చి 2018 ఎన్నికల ఫలితాలను పక్కన పెట్టి ఖమ్మంలోని అన్ని నియోజకవర్గాల్లో గెలవాలని కేసీఆర్ నిర్ణయించుకోవడమే కొత్త వ్యూహానికి నాందిగా మారుతోంది.
2018 ఎన్నికల్లో ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ కు షాకిచ్చింది. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఒక్కరే గెలవగా, తుమ్మల నాగేశ్వరరావు కూడా ఓడిపోయారు. ఎన్నికల తర్వాత ఇతర పార్టీల ఎమ్మెల్యేలు వచ్చి చేరడంతో బీఆర్ఎస్కు ఖమ్మంలో బలం పెరిగింది.కాలచక్రంలో ఐదేళ్లు తిరిగే సరికి ఖమ్మం రాజకీయాలు మారిపోయాయి. బీఆర్ఎస్ పార్టీకి కమ్యూనిస్టుల అండ ఉంటుందా లేదా అన్నది ఇంకా తెలియలేదు. ఈ లోపే షర్మిల పార్టీ పెట్టడం , తన వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు సిద్ధం కావడం జరిగిపోయింది. కేసీఆర్ తీరు నచ్చక ఖమ్మం స్ట్రాంగ్ మేన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ వైపుకు వెళ్లి రాహుల్ సమక్షంలో చేరిపోయారు. దానితో కాంగ్రెస్ పార్టీ బలపడినట్లుగా కనిపిస్తోంది. కాకపోతే అక్కడ బీజేపీ బలం అంతంతమాత్రమేనన్న చర్చ కూడా జరుగుతోంది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని పది నియోజకవర్గాలను గెలుచుకోవాలంటే కాంగ్రెస్ ను దెబ్బకొట్టాలన్న సంగతి కేసీఆర్ కు బాగా తెలుసు. ఇప్పటికే పువ్వాడ అజయ్ ద్వారా కొంత వ్యూహాన్ని అమలు చేశారు. పొంగులేటి ప్రాబల్యం ఉన్న పాలేరు సహా ఐదారు నియోజకవర్గాలపై కేసీఆర్ స్వయంగా దృష్టి పెట్టారు. నేరుగా పొంగులేటి అనుచరులకు గాలం వేసే ప్లాన్ అమలు చేస్తున్నారు. తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్య లాంటి నేతలను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నంలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో భద్రాచలం టికెట్ ఇస్తామన్న హామీతో తెల్లం వెంకట్రావును ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. భద్రాచలానికి ఇచ్చిన హామీలను కూడా ఎన్నికల్లో గెలిచిన వెంటనే నెరవేరుస్తామని చెబుతున్నారట. మరో గేమ్ ప్లాన్ కూడా పారలల్ గా నడుస్తోంది. పొంగులేటి అనుచరులు తిరిగి పార్టీలోకి వస్తే వారికి కాంట్రాక్టులు కూడా ఇస్తామని చెబుతున్నారట.సంపాదించుకునే అవకాశం కల్పిస్తామని అంటున్నారట. పైగా ఏజెన్సీలోని రెండు నియోజకవర్గాల్లో అన్ని పార్టీల నేతలతో బీఆర్ఎస్ వర్గాలు టచ్ లో ఉన్నాయి. అందులో గెలిచే వారిని ఎంపిక చేసి పోటీలోకి దించాలని భావిస్తున్నారు..
మైండ్ గేమ్ ఆడటంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిట్ట అనే చెప్పాలి. ప్రత్యర్థులను కన్ ఫ్యూజ్ చేసి బోల్తా కొట్టించడం కూడా ఆయనకు తెలుసు. ఖమ్మం జిల్లాలో ఆయన రెండు ఆటలు ఆడుతున్నారు. ఎవరు ఎక్కడ ఉంటారో తెలియకుండా చేస్తున్నారు. కొందరికి టచ్ వెళ్లి… వెంటనే పార్టీలో చేరకుండా హోల్డ్ లో పెడుతున్నారు. దాని వల్ల ప్రత్యర్థులకు ఏమి అర్థం కాదు. కీలక నియోజకవర్గాల్లో నేతలను రేపోమాపో చేర్చుకుంటారు. దానితో కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు డిఫెన్స్ లో పడిపోతాయి. కేసీఆర్ లక్ష్యం నెరవేరుతుంది. అదీ అసలు సంగతి….
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…