ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభను సీఎం కేసీఆర్ గ్రాండ్ సక్సెస్ చేశారు. అత్యంత అట్టహాసంగా నిర్వహించిన ఈ సభలో ఆప్ సీఎంలతో పాటు కేరళ ముఖ్యమంత్రి, మరికొందరు కమ్యూనిస్టు నేతలు పాల్గొని కేంద్రంలోని బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సైతం హాజరై బీజేపీని తరిమికొట్టాలంటూ పిలుపునిచ్చారు. అయితే ఇక్కడ కేసీఆర్‌తో మొదటి నుంచీ ఉన్న జేడీఎస్ నేత కుమారస్వామి, ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉంటున్న ప్రకాష్ రాజ్ కనిపించలేదు. ఇద్దరి గైర్హాజరుపై రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. కేసీఆర్ జాతీయ పార్టీ నిర్ణయం తీసుకున్న నాటి నుండి ప్రతీ సందర్భంలోనూ కుమారస్వామి ఆయన వెంటే ఉన్నారు. కానీ అసలైన బిఆర్ఎస్ ఆవిర్భావ సభలో మాత్రం కుమారస్వామి కనిపించలేదు.
కుమారస్వామికి ఇతర కార్యక్రమాలు ఉండడం వల్ల రాలేకపోయారని బిఆర్ఎస్ వర్గాలు చెబుతున్నప్పటికీ కెసిఆర్ కు కుమారస్వామికి మధ్య పొర పచ్చాలు వచ్చాయా అన్న ఆసక్తికర చర్చ కూడా రాజకీయ వర్గాలలో సాగుతుంది. బీఆర్ఎస్ పార్టీకి అత్యంత కీలకంగా భావించిన ఐదు లక్షల మందితో నిర్వహించిన ఆవిర్భావ సభకు ఆయన రాలేనంత ముఖ్యమైన కార్యక్రమాలు ఏమిటి అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ తాను రాకపోతే తన తరపున పార్టీ ప్రతినిధిని ఎవరినైనా పంపేవారు కదా అన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. ఇదే సమయంలో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఓ బాంబ్ పేల్చారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ను ఓడగొట్టేందుకు కేసీఆర్ కుట్ర పన్నారని ఆరోపించారు. కర్ణాటకలోని సుమారు 25 మంది కాంగ్రెస్ నేతలను ఫామ్ హౌజ్ కు పిలిపించి వారికి కేసీఆర్ రూ.500 కోట్ల ఆఫర్ ఇచ్చారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఆ విషయం కుమారస్వామికి కూడా తెలియకుండా కేసీఆర్ చేశారని అందుకే ఖమ్మం సభకు జేడీఎస్ నేత రాలేదనే విషయాన్ని చెప్పుకొచ్చారు.
ఇక అదే సమయంలో సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉంటూ కర్ణాటక రాజకీయాలలో కీలక భూమిక పోషిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన ప్రకాష్ రాజ్ కూడా బీఆర్ఎస్ ఆవిర్భావసభలో పాల్గొనలేదు. కర్ణాటక బీఆర్ఎస్ బాధ్యతలు ఆయనకు అప్పగిస్తారని ప్రచారం జరిగినప్పటికీ ఇంకా సీఎం కేసీఆర్ ఈ వ్యవహారంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ క్రమంలో ప్రకాష్ రాజ్ బీఆర్ఎస్ సభకు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. సీఎం కేసీఆర్ కర్ణాటక రాష్ట్రంలో జేడీఎస్ కు పూర్తిస్థాయిలో మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటకలో ప్రచారం కూడా చేస్తామని ప్రకటన కూడా చేశారు. అయితే కర్ణాటక ఎన్నికలలో బీఆర్ఎస్ పోటీ చేస్తుందంటూ ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో కుమారస్వామి, ప్రకాష్ రాజ్ బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో కనిపించకపోవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.