ఢిల్లీ లిక్కర్ స్కామ్ దర్యాప్తు చేస్తోంది బీజేపీ నేతలా సీబీఐనా

By KTV Telugu On 1 March, 2023
image

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కూడా విచారణకు పిలిపించి అరెస్ట్ చేస్తారని బీజేపీ నేత వివేక్ తిరుమలలో ప్రకటించారు. దేవుడి దర్శనానికి వెళ్లిన ఆయన తానే లిక్కర్ స్కాం దర్యాప్తు కేసును పర్యవేక్షిస్తున్నట్లుగా ప్రకటించారు. ఆయన ఒక్కరే కాదు చాలా మంది బీజేపీ నేతలు అదే తరహా ప్రకటనలు చేశారు. అందుకే లిక్కర్ స్కాం విషయంలో చాలా మందికి సందేహాలు ఉన్నాయి. అసలు ఈ కేసు రాజకీయంగా స్కోర్లు సెటిల్ చేసుకోవడానికి తెరపైకి తెచ్చారా అన్నదే ఆ సందేహం. ఎందుకంటే ఈ స్కాం బయటకు రావడం ఆనంతరం బీజేపీ నేతల హడావుడి వారి తీరుకు తగ్గట్లుగానే సీబీఐ, ఈడీ వెంట పడుతూండటం సంచలనంగా మారింది.

ఢిల్లీలో లిక్కర్ పాలసీలో స్కాం జరిగిందని లెఫ్టినెంట్ గవర్నర్ విచారణకు ఆదేశించిన తర్వాత సీబీఐ రంగంలోకి దిగింది. అసలు సీబీఐ ఏ ప్రకటనా చేయక ముందే ఢిల్లీ స్థాయిలో బీజేపీ నేతలు ముందుగా కవితను టార్గెట్ చేసకున్నారు. అసలు సీబీఐ ఎలాంటి వివరాలు బయట పెట్టనప్పుడే ఢిల్లీ బీజేపీ నేతలు చాలా లోతుగా ఆరోపణలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంకు కేంద్రం హైదరాబాద్ అని మనీష్ సిసోడియా చాలా సార్లు హైదరాబాద్ వెళ్లి చర్చలు జరిపి డీల్ కుదుర్చుకున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. నిజంగా ఇలాంటిదేమైనా ఉంటే సీబీఐ దర్యాప్తులో తేలుతుంది. బీజేపీ నేతల దగ్గర ఖచ్చితమైన సమాచారం ఏదైనా ఉంటే ముందుగా సీబీఐ చట్టపరమైన చర్యలు తీసుకుంటే నమ్మశక్యంగా ఉంటుంది కానీ బీజేపీ నేతలు ఇలా ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా రాజకీయమనే అనుకుంటారు. బీజేపీ నేతలు చెప్పిన విషయాల్నే రేపు తాము దర్యాప్తులో కనుగొన్నామని సీబీఐ అధికారులు ప్రకటిస్తే చాలా మందికి సందేహాలు వస్తాయి. బీజేపీ నేతలు చెప్పిందే సీబీఐ చెబుతోందని విమర్శలు వస్తాయి. అయితే ఇప్పటికీ కవితను ఎలా అరెస్ట్ చేస్తారో కూడా బీజేపీ నేతలు చెబుతున్నారు.

సీబీఐ, ఈడీలు ఢిల్లీ లిక్కర్ స్కాంపై ఇప్పటి వరకూ చార్జిషీట్లు దాఖలు చేశాయి. అందులో కవిత నేరం చేసారని నిందితురాలిగా ఎప్పుడూ చేర్చలేదు. కానీ పలువురు నిందితుల రిమాండ్ రిపోర్టుల్లో కవిత పేరునూ చూపించారు. చార్జిషీట్‌లో కవిత చేసిన నేరం ఏమిటో మాత్రం ఈడీ చెప్పలేదు. ఫోన్లు మార్చారని సౌత్ లాబీ అని చెప్పారు. రెండు పోన్ నెంబర్లను ఉపయోగిస్తూ కవిత పది ఫోన్లు మార్చారని ఓ నిందితుడి ఈడీ రిమాండ్ రిపోర్టులో చెప్పింది. కవిత పది కాకపోతే ఇరవై పోన్లు మార్చుకుంటారు అది ఆమె ఇష్టం. అది నేరంగా చెప్పడానికి ఎలా ప్రాతిపదిక అవుతుందనేది ఎక్కువ మందికి వస్తున్న సందేహం. అదే సమయంలో ఆమె పాత్ర గురించి ఇంక పెద్దగా ప్రస్తావించలేదు. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టును బట్టి చూస్తే కవిత పేరును ప్రస్తావించారు కానీ ఆమె ఎలా నేరం చేశారు. అలా ముడుపులు ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రయోజనం పొందలాలనుకున్నారు లేకపోతే పొందారు అన్న అంశాలపై మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. వాటి గురించి చెప్పకుండా కవితను నేరం చేశారని ప్రచారం చేయడం రాజకీయమే అవుతుంది.

ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేసిన ఇండో స్పిరిట్ కంపెనీకి అసలైన యజమానికి కల్వకుంట్ల కవితేనని ఈడీ ఓ చార్జిషీట్‌లో ఆరోపించింది. పేర్కొంది. శరత్ రెడ్డి, మాగుంట రాఘవ్ రెడ్డితో కలిసి కవిత ఈ వ్యాపారం చేశారు. అరుణ్ రామచంద్ర పిళ్లైను బినామీగా పెట్టుకున్నారని ఈడీ చెబుతోంది. ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్‌లో మొత్తం కవితే చేశారన్నట్లుగా స్పష్టంగా పేర్కొన్నారు. ఈడీ దాఖలు చేసిన 181 పేజీల చార్జ్‌షీట్లో 28 సార్లు కవిత పేరును ప్రస్తావనకు వచ్చింది. కవిత, మాగుంట రాఘవ్‌, శరత్‌రెడ్డి నిర్వహిస్తున్న సౌత్‌గ్రూప్ ఈ కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిందని అప్రూవర్ గా మారిన దినేష్ అరోరా స్పష్టం చేశారు.హైదరాబాద్, ఢిల్లీ స్టార్ హోటళ్లలో పలుమార్లు సమావేశం అయ్యారు. కవిత పలుమార్లు ఫేస్ టైమ్ ద్వారా నిందితులతో మాట్లాడి కలసి వ్యాపారం చేస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారని ఈడీ చార్జిషీట్‌లో పేర్కొంది. సమీర్ మహేంద్ర కవితను ఆమె నివాసంలో కలిసి చర్చలు కూడా జరిపారని ఈడీ చెబుతోంది. అదే నిజం అయితే ఒక్క కవితను కాకుండా మిగిలిన వారిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు. ఆరేడు నెలల నుంచి ఈ స్కాం సీరియల్ ఎందుకు కొనసాగిస్తున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పాత్ర ఇప్పటికీ అస్పష్టంగా ఉంది. నేరం చేసినట్లుగా నిరూపించాలంటే ముందుగా ఆమె ఫలానా ప్రయోజనం పొందారని చెప్పాలి. ఆ ప్రయోజనం పొందడానికి అక్రమానికి పాల్పడినట్లుగా నిరూపించాలి. కానీ ఇప్పటి వరకూ అలాంటిదేమీ లేదు. అవి కవితని నిరూపించిన తర్వాతే ఆమెపై ఆరోపణలు చేస్తే ఎవరైనా నమ్ముతారు లేకపోతే రాజకీయం అనుకుంటారు. ఇప్పుడు అదే రాజకీయం జరుగుతోంది. కారణం ఏమైనా ఈ కేసులో అరెస్టవుతున్న వారికి బెయిల్ కూడా రావడం లేదు.