రెడ్డి గారికి చివర్లో మంత్రి పదవి – కేసీఆర్ లెక్కలు తప్పాయా ?

By KTV Telugu On 30 August, 2023
image

KTV TELUGU :-

తెలంగాణ ఎన్నికలు రోజుల్లోకి వచ్చేశాయి. ఇంత కాలం పెద్దగా పట్టించుకోని పార్టీలో ఉన్నాడా లేడో కూడా పెద్దగా పట్టించుకోని నేత పట్నం మహేందర్ రెడ్డిని కేసీఆర్ మంత్రిని చేసేశారు. కానీ ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదు. టిక్కెట్టే ఇవ్వడానికి అనర్హుడైన నేతను మంత్రిని ఎందుకు చేశారన్నది కేసీఆర్‌కే తెలుసు. నిజంగా ఆయన మంత్రి పదవికి అర్హుడైన నేత అనిపిస్తే..ఇంత కాలం ఉండేవారు కాదు. ఎప్పుడో ఇచ్చి ఉండేవారు. టిక్కెట్ ఇవ్వలేకపోతున్నందున మూడు నెలలు మంత్రిగా ఉండనిస్తానని కేసీఆర్ హామీ ఇస్తే… అంత మాత్రం దానికే ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలుగుతానని ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉంటానని ఒప్పుకునేంత .. సాదాసీదా రాజకీయ నాయకుడు కాదు పట్నం మహేందర్ రెడ్డి. ఆయన ప్లాన్ లో ఆయన ఉన్నారు. అంటే ఇక్కడ కేసీఆర్.. పట్నం మహేందర్ రెడ్డి మీద రాజకీయం చేస్తే… అటు పట్నం కూడా కేసీఆర్ మీద అదే ప్లాన్ అమలు చేస్తున్నారన్నమాట. అర్థం కావాలంటే.. ఈ డీటైల్‌ స్టోరీ చూడాల్సిందే.

తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయం పక్కా ప్రొఫెషనల్. అంటే.. రాజకీయాన్ని రాజకీయంగానే చేస్తారు. ఎక్కడా రాజకీయంలో వ్యక్తిగత సంబంధాలు ఉండవు. సెంటిమెంట్లకు తావుండదు. ఎవరైనా రాజకీయ నాయకుడు తనకు అవసరం అయితే ఆదరిస్తారు. తనకు ఉపయోగపడినంత కాలం ప్రాధాన్యత ఇస్తారు. ఇక అదనపు లగేజీ అనుకున్న మరుక్షణం పట్టించుకోడం మానేస్తారు. కొంత మందిని కావాలనే నిర్వీర్యం చేస్తారు. ఇదంతా కేసీఆర్ మార్క్ రాజకీయం. అందుకే ఇంత కాలం పట్నం మహేందర్ రెడ్డి అనే నేతను పక్కన పెట్టేసినా.. ఎన్నికలకు ముందు మంత్రిని చేసేశారు. అంతకు ముందు ఆయన కాంగ్రెస్ తో చర్చలు జరిపారని తెలిసినప్పుడు కూడా పెద్దగా స్పందించలేదు. కానీ హఠాత్తుగా టిక్కెట్ ఇవ్వలేకపోతున్నందున… మంత్రిని చేసేందుకు సిద్ధమయ్యారు. చేశారు. మహేందర్ రెడ్డి కూడా ఇంత కాలం పట్టించుకోలేదు ఇప్పుడు ఎందుకు పదవి ఇస్తున్నారని ఆలోచించలేదు. తీసుకున్నారు. కానీ ఆయనను తక్కువ అంచనా వేయలేరు.. అలాగని కేసీఆర్ నూ అంతే. ఓకరంగా ఇద్దరూ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారన్నమాట.

పట్నం మహేందర్ రెడ్డి మాస్ లీడర్. టీడీపీలో ఉన్నప్పుడు రంగారెడ్డి జిల్లా మొత్తాన్ని తన గుప్పిట పెట్టుకున్నారు. ఎన్నికల్లో ఎలా గెలవాలో ఆయనకు బాగా తెలుసు. తెలంగాణ ఉద్యమం సమయంలో.. ఇక టీడీపీలో ఉంటే కష్టమని గుర్తించి.. రంగారెడ్డి జిల్లాలో ఉద్యమ ప్రభావం పెద్దగా లేనప్పటికీ .. ఆయన బీఆర్ఎస్‌లో చేరిపోయారు. తెలంగాణ ఏర్పాటు ప్రకటన సంబరాల్లో ఢిల్లీలోనే ఉన్న కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరేందుకు మహేందర్ రెడ్డి ఢిల్లీ వెళ్తూ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ను విమర్శించారు. అలా మాట్లాడి .. ఢిల్లీ వెళ్లి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ కండువా కప్పేసుకున్నారు. అది మహేందర్ రెడ్డి రాజకీయం. ఆయన సామర్త్యం తెలుసు కాబట్టి కేసీఆర్ కూడా రంగారెడ్డి జిల్లాను చేతుల్లో పెట్టారు. మంత్రిని చేశారు. కానీ 2018 ఎన్నికల్లో .. రేవంత్ రెడ్డిని ఓడించడానికి తన నియోజకవర్గంతో పాటు కొడంగల్ పైనా దృష్టి పెట్టాల్సి వచ్చింది. తన సోదరుడ్ని అక్కడ పోటీకి పెట్టి..తాను ఎక్కు బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది. అనుకున్నట్లుగా రేవంత్ రెడ్డిన ిఓడించగలిగారు కానీ.. తాను కూడా స్వల్ప తేడాతో పరాజయం పాలయ్యారు. అయినా సరే కేసీఆర్ తనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవిని ఇస్తారనుకున్నారు. కానీ కేసీఆర్ అలాంటి ఆలోచనే చేయలేదు. రేవంత్ రెడ్డిని ఓడించినందుకు రివార్డు ఇవ్వకపోగా తన పై గెలిచిన పైలట్ రోహిత్ రెడ్డిని పార్టీలో చేర్చుకుని నియోజకవర్గంపై పెత్తనం ఆయనకే అప్పచెప్పారు.ఇది మహేందర్ రెడ్డిని అవమానించడమే. టిక్కెట్ కూడా రోహిత్ రెడ్డికే ప్రకటించారు. అందుకే మహేందర్ రెడ్డి కాంగ్రెస్ తో సంప్రదింపులు కూడా జరుపుకున్నారు. మొదట్లో.. వెళ్తే వెళ్లనీ అనుకున్న కేసీఆర్.. రాజకీయ పరిస్థితుల్ని అంచనా వేశాక.. అందర్నీ వదులుకోవడం మంచిది కాదని.. ఎలాగైనా బుజ్జగించాలని ఫిక్సయి.. మంత్రి పదవి ఆఫర్ చేశారు.

తనకు మంత్రి పదవి ఇస్తామని చెప్పగానే మహేందర్ రెడ్డి మరో మాట లేకుండా అంగీకరించారు. ఏ రాజకీయ నేత అయినా పదవి ఇస్తానంటే వదులుకోరు. అది ఎంత స్వల్పకాలమైనా సరే. మహేందర్ రెడ్డి కూడా అంతే. వెంటనే ఒప్పుకున్నారు. బహుశా కేసీఆర్.. మళ్లీ గెలిస్తే.. మంత్రి పదవిని కంటిన్యూ చేస్తానని హామీ ఇచ్చి ఉంటారు. కానీ మహేందర్ రెడ్డి ఇలాంటి రాజకీయాలను తనదైన శైలిలో చేస్తారు. అందుకే మంత్రి పదవినితీసుకునేందుకు అంగీకరంచారు. కానీ .. ఆయన తన మనసులో మాటల్ని మాత్రం దాచుకోలేదు. మంత్రి పదవి వచ్చినంత మాత్రాన తాను మెత్తబడినట్లు కాదని.. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దూరమయ్యే ప్రసక్తే లేదని చప్పారు. తనది ముఫ్ఫై ఏళ్ల రాజకీయం అన్నారు. పట్నం మహేందర్ రెడ్డి మూడు నెలల మంత్రి పదవి కోసం.. ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉంటారని ఆయన అనుచరులు అసలు అనుకోరు. ఇప్పటికీ మహేందర్ రెడ్డి కూడా అదే చెబుతున్నారు. కాకపోతే కాస్త సాఫ్ట్ గా చెబుతున్నారు. ఎలా చూసినా మహేందర్ రెడ్డి.. ఎన్నికల్లో నిలబడతానంటున్నారు. అది టిక్కెట్ ఇస్తే బీఆర్ఎస్ కావొచ్చు.. లేకపోతే కాంగ్రెస్ అవుతుంది. మంత్రి పదవి ఇచ్చారని ఆయన సైలెంట్ గా ఉండే అవకాశం లేదు. అలాగని కేసీఆర్ భవిష్యత్ లో ఎంపీ, ఎమ్మెల్సీ, మంత్రి పదవులు ఇస్తారనే నమ్మకాన్ని ఆయన పెట్టుకుంటారన్న అబిప్రాయమూ లేదంటున్నారు.

మహేందర్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం వెనుక కేసీఆర్ ఆత్మరక్షణ ధోరణితో కూడిన రాజకీయం కనిపిస్తోంది. పొంగులేటి , జూపల్లిని వదలుకున్నంత సులువుగా వదులకోవడానికి సిద్ధంగా లేరు. ముందు ఏదో ఒకటి చేసి కాంగ్రెస్ లో చేరకుండా ఆపాలనుకున్నాు. దీనికి కారణం.. కూడా ఓ రకంగా రేవంత్ రెడ్డినే.

మైనంపల్లి హన్మంతరావు కన్నా ఎక్కువగా మాస్ పల్స్ తెలిసిన నేత మహేందర్ రెడ్డి. వికారాబాద్ జిల్లా మొత్తం రాజకీయ సమీకరణాల్ని మార్చగలరు. ఆ విషయం కేసీఆర్‌కు తెలియనిది కాదు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి పోటీ చేయబోతున్న కొడంగల్ నియోజకవర్గంలో ఆయన సోదరుడే ఎమ్మెల్యేగా ఉన్నారు. మహేందర్ రెడ్డి పార్టీ మారితే ఆటోమేటిక్ పట్నం నరేందర్ రెడ్డి కూడా వెళ్లిపోతారు. అదే జరిగితే రేవంత్ రెడ్డికి కేక్ వాక్ అవుతుంది. గత ఎన్నికల్లో పట్టుబట్టి మరీ ఓడించిన రేవంత్ రెడ్డిని ఈ సారి చాలా సులువుగా అసెంబ్లీ ప్రవేశాన్ని కేసీఆర్ అంగీకరించరు. అందుకే మహేందర్ రెడ్డిని ఇప్పటికిప్పుడు మంత్రిని చేసేశారు. తర్వాత కూడా ఎమ్మెల్సీకి కంటిన్యూషన్ ఇస్తానని .. మంత్రిగా కొనసాగిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చి ఉంటారు. కానీ కేసీఆర్ కు అయినా మహేందర్ రెడ్డికి అయినా ఎన్నికల తర్వాత చేస్తామనే హామీలు ఎంత వరకూ నమ్మశక్యమో బాగా తెలుసు. తన మాటలు నమ్మి ఉంటారని కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చారు. నమ్మినట్లుగా కనిపించి.. మహేందర్ రెడ్డి మంత్రి పదవి తీసుకున్నారు. ఇద్దరూ తమ వ్యూహాన్ని అమలు చేశామని అనుకుంటున్నారు. ఇద్దరికీ తెలుసు.. తమ రాజకీయం తాము చేస్తున్నామని . అయితే ఇక్కడ కేసీఆర్ కు చాయిస్ లేదు. రాజకీయం చేయదల్చుకుంటే అంతా మహేందర్ రెడ్డి చేతుల్లోనే ఉంది. ఆ ఆయుధాన్ని కేసీఆరే మహేందర్ రెడ్డికి ఇచ్చారు.

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఎవరికి మొగ్గు అనేదానిపై స్పష్టత లేదు. ఇటీవల వచ్చిన ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషనల్ సర్వేలో ఓ అడుగు కాంగ్రెస్ పార్టీకే ఉంది. పదేళ్ల అధికార వ్యతిరేకతను అధిగమించడం కేసీఆర్‌కు అంత తేలిక కాదు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి సానుభూతి ఓట్లతో పాటు అధికార వ్యతిరేకత కలిసి వచ్చే అవకాశం ఉందని విశ్లేషణలు వస్తున్నయి. అందుకే ఇతర పార్టీల్లోకి కీలక నేతలు కాంగ్రెస్ లో చేరబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంటోంది. బీజేపీ సీనియర్ నేత గడ్డం వివేక్.. కాంగ్రెస్ పార్టీలో చేరడం లాంచనమేనన్న చర్చ జరుగుతోంది. ఆయన సోదరుడు వినోద్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వివేక్ లోక్ సభ టిక్కెట్ ఆశిస్తున్నారు. ఆయనది సంప్రదాయంగా కాంగ్రెస్ ఫ్యామిలీ. ఇక ఈటల రాజేందర్ పేరు కూడా జోరుగా ప్రచారంలోకి వస్తోంది. ఈటలకు ఇటీవల కిషన్ రెడ్డి తర్వాత స్థానం ఇచ్చారు. అందుకే ఆయన ముందడుగు వేయలేకపోతున్నారు. కానీ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ను ఓడించాలంటే.. కాంగ్రెస్ లో చేరక తప్పని ఆయన డిసైడయ్యే చాన్స్ ఉందంటున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఇప్పటికీ అందరికీ డౌటే. మునుగోడులో ఆయన వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరపునే పోటీ చేస్తానంటున్నారు. ఇక ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావు చేరికను దాదాపుగా ఫైనల్ చేసుకున్నారని అంటున్నారు.

కాంగ్రెస్‌లో ఫీల్ గుడ్ పాజిటివ్ వాతావరణం కనిపిస్తోంది. బీఆర్ఎస్ లో కనిపించని ఓ రకమైన ఆత్మవిశ్వాసం.. కాంగ్రెస్ లో ఉంది. బీఆర్ఎస్ నేతలు … కాంగ్రెస్ నేతలు చేసిన ప్రకటనల్ని హైలెట్ చేసి.. బీఆర్ఎస్ కావాలా..కాంగ్రెస్ కావాలా అని ప్రశ్నిస్తున్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం.. తమ డిక్లరేషన్లను హైలెట్ చేస్తున్నారు. అదే సమయంలో పదేళ్ల అధికార వ్యతిరేకత ఊహించనంతగా ఉంటుందన్న అంచనాలు కిందిస్థాయిలోనూ వినిపిస్తూండటంతో..కాంగ్రెస్ కు డిమాండ్ పెరుగుతోంది. కేసీఆర్ రెండు చోట్ల పోటీ ప్రకటన .. సిట్టింగ్‌లకు అభ్యర్థులను ప్రకటించడాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు. ఈ పరిణామాల మధ్య మౌత్ టాక్ కాంగ్రెస్ కు అనుకూలంగా మారితే మహేందర్ రెడ్డి జెండా ఎత్తేస్తారు. ఎలాగైనా బీఆర్ఎస్సే గెలుస్తుందంటే.. కసీఆర్ వ్యూహమే గిలిచిందన్నట్లుగా ఎన్నికల్లో పోటీ చేయకుండా సైలెంట్ గా ఉంటారు. ఏ నిర్ణయం తీసుకున్నా.. అది మహేందర్ రెడ్డిదే.

వరుసగా పార్టీని వీడిపోతున్న సీనియర్లను ఆపడానికి కేసీఆర్ ఎక్స్ ట్రీమ్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంత వరకూ వర్కవుట్ అవుతాయన్నది ఎన్నికల షెడ్యూల్ నాటికి మాత్రమే ఓ క్లారిటీ వస్తుంది.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి