టార్గెట్ కేసీఆర్

By KTV Telugu On 15 June, 2024
image

KTV TELUGU :-

మీరు ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశారంటే..  సార్ చేయమంటే చేశామంటున్నారు.   విద్యుత్ ఒప్పందాల్లో ఈ అక్రమాలేంటి అని విచారణ కమిషన్ విద్యుత్ ఉన్నతాధికారులను అడిగితే.. వారు కూడా అదే డైలగ్ చెబుతున్నారు.  కాళేశ్వరంపై కమిషన్ విచారణలోనూ అధికారులు అదే చెబుతున్నారు.  అంటే అన్నీ కేసీఆరే చేశారా.. చేయించారా..? మిగతా వారికి బాధ్యత ఉండదా ? .  ఒక్క కేసీఆర్‌నే బాధ్యుడ్ని చేసే రాజకీయాలు నడుస్తున్నాయా ?

కేసీఆర్ ప్రభుత్వంలో ఏం జరిగినా అందరూ కేసీఆర్ వైపే వేలు చూపిస్తున్నారు. కేసీఆర్ పదేళ్ల పాటు ఇష్టారాజ్య పరిపాలన చేశారు. నిబంధనలను పాటించారా లేదా అన్నది పట్టించుకోలేదు. తాను  పెట్టిందే రూల్.. చేసిందే శాసనం అన్నట్లుగా పాలన చేశారు. అధికారులు కూడా ఆయనను కాదనే పరిస్థితి లేదు.  అధికారం అసలు పోనే పోదనుకున్నారు. కానీ పోయింది. ఇప్పుడు అన్నీబయటకు వస్తున్నాయి . అయితే చెప్పినట్లుగా చేసిన తాము ఎందుకు ఇరుక్కోవాలని అనుకుంటున్నారేమో  కానీ నిర్మోహమాటంగా అందరూ కేసీఆర్ పేరు చెబుతున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయగానే విద్యుత్ కొనుగోలు అంశంపై దృష్టి పెట్టింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించింది. ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశాలు ఇచ్చింది. అదులో భాగంగా జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ను ఏర్పాటు చేసింది. యాదాద్రి, దామరచర్ల విద్యుత్ ప్లాంట్లకు సంబంధించిన ఒప్పందాలపై బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పీపీఏలలో జరిగిన అవకతవకలపై జస్టిస్ నరసింహా రెడ్డి కమిషన్ దర్యాప్తు చేస్తోంది. కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చింది. మాజీ సీఎం స్పందన సంతృప్తికరంగా లేకుంటే వ్యక్తిగత హాజరు ప్రక్రియను ప్రారంభిస్తామని కమిషన్ హెచ్చరించింది.

మరో వైపు కాళేశ్వరపై విచారణ ఊపందుకుంది. ఈ ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ పై అనేక ఆరోపణలను అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ చేశాయి.  బీజేపీ సీబీఐ విచారణకు డిమాండ్  చేసింది. అయితే ఇందులో అవినీతిని తామే తేలుస్తామని కాళేశ్వరంపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ను నియమించారు.   టెక్నికల్ అంశాల విచారణ పూర్తి అయ్యాక, ఆర్థిక అంశాల పై విచారణ మొదలు అవుతుందని  ఆయన ప్రకటించారు.  ప్రభుత్వం వద్ద నుంచి రిపోర్టులు అన్ని అందాయని అంటున్నారు. ఈ విషయంలోనూ కేసీఆర్‌కు నోటీసులు జారీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.  ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక దశకు చేరుకుంది.  స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌  కేంద్రంగా సాగిన ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో  రి మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌ పేరు వెలుగులోకి వచ్చింది. కేసీఆర్‌, ఆయన కుటుంబసభ్యులు, పార్టీలో ఆయన సన్నిహితుల వ్యవహారాలను చక్కబెట్టేందుకే తామంతా కలిసి పనిచేశామని టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ  రాధాకిషన్‌రావు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు.

నిన్నటి వరకూ ఎన్నికల కోడ్ ఉంది. ఇప్పుడు కోడ్ లేదు. పూర్తి పాలన రేవంత్ చేతుల్లోకి వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాజకీయం కూడా మారిపోయింది. బీఆర్ఎస్ పూర్తిగా వెనుకబడిపోయింది. ఒక్క ఎంపీ సీటు కూడా తెచ్చుకోలేకపోయింది. కవిత జైల్లో ఉన్నారు. ఇలాంటి సమయంలో కేసీఆర్ ను కూడా కేసులతో ఉక్కిరిబిక్కిరి చేస్తే.. ఇక పార్టీ కోలుకోవడానికి అవకాశం ఉండదన్న వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది.  స్కామ్‌లు జరిగితే.. నేరుగా ప్రమేయం ఉంటే తప్ప.. సీఎం బాధ్యుడు కాదు. అధికారులే చట్టం, రాజ్యాంగం ప్రకారం నిర్ణయం తీసుకోవాలి.  అధికార వ్యవస్థ ఉంది..  రాజకీయ వ్యవస్థను నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చేయడానికే. ఇప్పుడు తప్పులు చేస్తే.. దానికి అధికారులే ప్రథమ బాధ్యులు.  కేసీఆర్ పై తోసేసినా అధికారులు బయటపడే అవకాశం లేదు. వారు కూడా ఇరుక్కుంటారు.  అయినా ఏపీలో గత ఐదేళ్లలో చంద్రబాబును టార్గెట్ చేసుకుని చేసినట్లుగా కేసీఆర్‌ను టార్గెట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే అందరూ…  అప్రూవర్ల మాదిరిగా మారిపోయి.. కేసీఆర్ ఒక్కరినే కారణంగా చూపిస్తున్నారని అనుకోవచ్చు.

రాజకీయ నాయకులకు కేసులు బలంగా మారుతున్నాయి.  కేసీఆర్ ను టార్గెట్ చేసి ఏదో చేయాలనుకుంటే.. ఇంకేదో జరిగే అవకాశం ఉంది. అందుకే కష్టాలు పడినా సరే … తమను టార్గెట్ చేసినా పర్వాలేదని బీఆర్ఎస్ వర్గాలనుకుంటున్నాయి.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి