కేసీఆర్ రిటైర్మెంట్ !

By KTV Telugu On 17 June, 2024
image

KTV TELUGU :-

భారత రాష్ట్ర సమితి ఉనికి సమస్యల్లో పడింది. అసెంబ్లీ ఎన్నికల వరకూ బలంగా ఉన్న పార్టీ తర్వాత ఒక్క సారిగా  వెనుకబడిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలు కావడం.. తర్వాత ఐదు నెలలకే వచ్చిన లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు కావడం  భారత రాష్ట్ర సమితి నేతల్ని ఒక్క సారిగా  నిరాశకు గురి చేసింది. పార్టీ భవిష్యత్ పై నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.  అందుకే కేసీఆర్ బీఆర్ఎస్ రివైవ్ ప్లాన్ రెడీ చేసుకున్నారు. అందులో కీలకమైన విషయం కేసీఆర్ రిటైర్మెంట్.

బీఆర్ఎస్ పార్టీ ఊపిరి పోకుండా ఉండేందుకు కేసీఆర్ అనేక రకాల సమీకరణాలపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పుడు  తెలంగాణ సెంటిమెంట్ లేకపోవడంతో  బీఆర్ఎస్‌కు ఓటు బ్యాంక్ లేకుండా పోయింది. ఆ విషయంలో లోక్ సభ ఎన్నికల్లో తేలిపోయింది. మరోసారి బీఆర్ఎస్  నిలవాలంటే బలమైన వర్గం అండగా ఉండాలి. అందుకే కేసీఆర్ ఇప్పుడుకొత్త ఆలోచన చేస్తున్నారని బీఆర్ఎస్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.

భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా హరీష్ రావును నియమించాలని కేసీఆర్ అనుకుంటున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ గౌరవాధ్యక్షుడిగా తాను ఉండి నడిపిస్తానని ప్రత్యక్షంగా పార్టీ ఫేస్‌గా హరీష్ రావు ఉండాలని కేసీఆర్ అనుకుంటున్నారు. ఈ మేరకు మాజీ సీఎం తనకు అత్యంత సన్నిహితులు, సీనియర్లతో సమాలోచనలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.   కేటీఆర్ కాకుండా హరీషే ఎందుకు అన్న ప్రశ్న కూడా వస్తుంది. అయితే కేటీఆర్ కన్నా  హరీష్ రావే ప్రస్తుతం మంచి  చాయిస్ అనుకుంటున్నారు. గతంలో హరీష్ రావును నిర్లక్ష్యం చేశారన్న ప్రచారం జరిగింది. అందుకే తరచూ ఆయన పార్టీ మారబోతున్నారన్న పుకార్లు వస్తున్నాయి. అయితే హరీష్ రావు మాత్రం ఎప్పుడూ అలాంటి పుకార్లకు బలం ఇచ్చేలా వ్యవహరించలేదు. కేసీఆర్ చెప్పింది చేస్తూ వెళ్లారు. పార్టీ వ్యవహారాల్లో కేటీఆర్ చాలా కీలకంగా వ్యవహరిస్తున్నప్పటికీ  ఆయన కన్నా.. ప్రస్తుత పరిస్థితుల్ని హరీష్ రావే చక్కదిద్దగలరని కేసీఆర్ గట్టి నమ్మకంగా ఉన్నారని  చెబుతున్నారు.

ఒక వేళ హరీష్ రావును అధ్యక్షుడిగా చేయలేకపోతే కేసీఆర్ మరో ఆలోచన చేస్తున్నారు. అదే దళిత అధ్యక్షుడు. తెలంగాణ ఉద్యమ సమయంలో దళితుణ్ని ముఖ్యమంత్రి చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు.  ఆ మాటను నిలబెట్టుకోలేదు. దీనిపై ఇప్పటికీ ఇతర పార్టీల నేతలు విమర్శలు చేస్తూంటారు. ఈ కారణంగా బీఆర్ఎస్‌కు దళిత ఓటు బ్యాంక్ పెద్దగా లేదన్న  అభిప్రాయం ఉంది. ఈ మైనస్‌ను  చెరుపుకోవడంతో  పాటు దళిత ఓటు బ్యాంక్‌ను  సాధించేందుకు  ప్రవీణ్‌ కుమార్‌నే అధ్యక్ష స్థానంలో కూర్చోబెడితే ‘ఉభయ తారకం’గా ఉంటుందన్న కోణంలోనూ కేసీఆర్ సమీకరణాలు లెక్కపై చర్చలు జరుగుతున్నాయంటున్నారు.  ఇలా ముందుకెళితే గతంలో ఉన్న మచ్చను పోగొట్టుకోవచ్చు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలను మళ్లీ దగ్గర చేసుకోవచ్చనే వ్యూహంతో కేసీఆర్‌ ఉన్నారు.

అయితే కేసీఆర్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుని హరీష్ రావు లేదా ప్రవీణ్ కుమార్‌లకు ఇస్తారంటే… కేసీఆర్ మార్క్ రాజకీయాలను దగ్గరగా చూసిన వారు నమ్మడం లేదు. గతంలో ఎదురు దెబ్బలు తగిలినప్పుడల్లా కేసీఆర్ తాను రాజీనామా చేస్తానని ప్రకటించేవారు.  ఆయనే ఉండాలని పార్టీ క్యాడర్ ఉద్యమం చేసేది. చివరికి క్యాడర్ కోరిక మేరకు తానే అధ్యక్షుడిగా ఉంటున్నానని ఆయన ప్రకటించేవారు. ఈ సారి కూడా అలాంటిదేదో జరుగుతోందని కొంత మంది నమ్ముతున్నారు. ఆయన వైదొలగాలంటే  ఇంత చర్చ పెట్టేవారు కాదని చెబుతున్నారు.  త్వరలోనే పార్టీ విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు.  ఆ సమావేశంలో పార్టీ పూర్వ వైభవం కోసం తాను తీసుకోబోతున్న చర్యలేమిటో వివరించే అవకాశం ఉంది.

కేసీఆర్ లేని బీఆర్ఎస్ ను ఊహించడం కష్టం. అయితే గౌరవాధ్యక్షుడిగా ఉండి యువతను ముందుకు జరపాలనుకుంటున్నారు కాబట్టి  ప్రయోగం చేసినట్లే.  ఇప్పుడు సమస్యల్లో ఉంది కాబట్టి సరైన సమయం కూడా.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి