ప్రగతి భవన్ నుంచి సచివాలయానికి పరిపాలనను మార్చే ప్రక్రియ మరింత జాప్యమవుతోంది. ఫిబ్రవరి 17న నిర్వహించాల్సిన నూతన సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం వాయిదా పడింది. ఈ లోపే జరిగిన అగ్నిప్రమాదం కూడా అధికార బీఆర్ఎస్ కు కొంత ఇబ్బందికరంగా మారింది. అయితే ఆ అవకాశాన్ని వ్యూహాత్మకంగా తమకు అనుకూలంగా మార్చుకోవాలని అధికార పార్టీ నిర్ణయించుకుంది.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని 28 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. మొత్తం 10 లక్షల 51 వేల 676 చదరపు అడుగులు ఉంటుంది. ఈ నెల 17న కేసీఆర్ జన్మదనం రోజున కేసీఆర్ ఈ సచివాలయాన్ని ప్రారంభించాలనుకున్నారు. అంతలోనే అక్కడి ఆరో అంతస్థులో అగ్నిప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ముఖ్యమంత్రి కార్యాలయం ఉండే ఆరో అంతస్తులోనే సంభవించడం కాకతాళీయం కావచ్చు. ఎందుకలా జరిగిందని ఆలోచించే లోపే ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చి పడ్డాయి. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 13న పోలింగ్ నిర్వహిస్తారు. మార్చి 16 ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. మార్చి 21 వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది.
మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్థన్ రెడ్డి పదవీ కాలం మార్చి 29తో ముగుస్తుంది. హైదరాబాద్ స్థానిక సంస్తల ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ రావు పదవీ కాలం మే ఒకటి వరకూ ఉంది. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పుడే జరపాల్సిన అవసరం లేదు. నెల తర్వాత కూడా జరపొచ్చు. పనిలో పనిగా జరిపేస్తున్నారనే చెప్పాల్సి ఉంటుంది. రెండు ఎమ్మెల్సీ ఎన్నికలను అధికార బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఒక్క స్థానం కూడా విపక్షాలకు వెళ్లకుండా రెండింటినీ తాము లేదా తమ మిత్రపక్షాలకు చెందే విధంగా వ్యూహరచన చేస్తున్న కేసీఆర్ ఆ దిశగానే ఈ రెండు ఎన్నికలను ముందుగానే వచ్చేట్టుగా ఏర్పాట్లు చేసుకున్నారని చెప్పాలి.
టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించి గతంలో తాము సమర్థించిన జనార్థన్ రెడ్డికి ఈసారి మద్దతివ్వకూడదని బీఆర్ఎస్ తీర్మానించింది. పీఆర్టీయూ – టీఎస్ పార్టీకి చెందిన చెన్నకేశవ రెడ్డిని సమర్థించాలని బీఆర్ఎస్ అధినాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. మరో పక్క హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికకు సంబంధించి మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఎవరిని నిలబెడితే వారికి మద్దతివ్వాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అందుకు ఒక కారణం ఉంది. హైదరాబాద్ మేయర్ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థికి ఇబ్బంది రాకుండా ఎంఐఎం సహకరించింది.
అసెంబ్లీ ఎన్నికలే వ్యూహంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మజ్లీస్ కు సపోర్టు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఏడాది ఆఖరుకు జరిగే ఎన్నికల్లో 50 స్థానాలకు పోటీ చేస్తామని మజ్లీస్ ప్రకటించిన నేపథ్యంలో కేసీఆర్ ఆలోచనలో పడ్డారు. అదే నిజమైతే తమ పార్టీకి ఉన్న ముస్లిం ఓటుబ్యాంక్ దెబ్బతింటుందని ఆయన భయపడుతున్నారు. హైదరాబాద్ పాత బస్తీ దాటి మజ్లీస్ బయటకు వస్తే మొదట దెబ్బతినేది తామేనని బీఆర్ఎస్ నేతలు అంగీకరిస్తున్నారు. దానితో ఎమ్మెల్సీ పోస్టును ఎరగా వేసి మజ్లీస్ వారి ముందరి కాళ్లకు బంధం వేయగలిగితే అసెంబ్లీ ఎన్నికల్లో ఇబ్బంది ఉండదని కేసీఆర్ అనుకుంటున్నారట. 2017లో కూడా రెండు ఎమ్మెల్సీ స్థానాలను ఎంఐఎంకు వదిలేశారు. కాకపోతే అప్పట్లో మంచి స్నేహం ఉండేది. ఇప్పుడు రెండు పార్టీలు కొంచెం దూరం జరిగాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో మళ్లీ దగ్గరయ్యేందుకు కేసీఆర్ పావులు కదుపుతున్నారు.
మజ్లీస్ తో స్నేహంగా ఉంటేనే కాంగ్రెస్ ను నిలువరించే వీలుంటుంది. మజ్లీస్ దూరమైతే ఓట్లు చీలి బీజేపీకి ప్రయోజనం కలగొచ్చు. రెండు వైపుల నుంచి ఇబ్బంది రాకుండా ఉండాలంటే అసదుద్దీన్ ను బుట్టలో వేసుకోవాలి. ఆ పని వీలైనంత త్వరగా జరగాలి. ఆయన ఎవరికైనా కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత చర్చలకు వెళ్లినా ప్రయోజనం ఉండదు. మరి ఆయన్ను ప్రసన్నం చేసుకునేందుకు ఏదోక పాచిక వేయాలి కదా. అదే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కావచ్చని చెబుతున్నారు. అందుకే తొందరపడుతున్నారని ఆనుకోవాలి.
కేసీఆర్ పుట్టిన రోజున సచివాలయం ఎందుకు ప్రారంభించాలని కొన్ని పార్టీలు ప్రశ్నలు సంధిస్తున్నాయి. ధర్నాలు ఉద్యమాలకు సిద్ధమవుతున్నాయి. దానితో డైవర్షన్ కోసం కూడా సచివాలయ ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారని చెబుతున్నారు. ఇప్పుడు అంబేద్కర్ జయంతి అయిన ఏప్రిల్ 14న సచివాలయాన్ని ప్రారంభించి అందరినీ సంతృప్తి పరచాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఏదేమైనా ఎమ్మెల్సీ ఎన్నికలను అడ్డుపెట్టుకుని సచివాలయ ప్రారంభోత్సవాన్ని వాయిదా వేయడం వెనుక కేసీఆర్ మదిలో పెద్ద వ్యూహమే ఉందని చెప్పాలి.