బి.ఆర్.ఎస్. అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు తనకే సాధ్యమైన చాణక్యం ప్రదర్శించబోతున్నారా? తెలంగాణాలో అధికారం కోల్పోయిన నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు పై దర్యాప్తు చేయిస్తోన్న కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు తెగబడే అవకాశాలున్నాయని భావిస్తోన్న కేసీయార్ తెలివిగా కేంద్రంలోని బి.ఆర్.ఎస్. తో చేతులు కలపనున్నారా? కేంద్రంలో వరుసగా మూడో సారి అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకున్న బిజెపి నాయకత్వం కూడా కేసీయార్ ను అక్కున చేర్చుకోడానికి సిద్ధంగా ఉందని హస్తిన వర్గాల భోగట్టా. అసలు కేసీయార్ మదిలో ఏం ఉంది?
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణాకు మొట్ట మొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీయార్ వరుసగా రెండు దఫాలు ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన కేసీయార్ అనుకున్నది సాధించలేకపోయారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో క్లీన్ స్వీప్ చేసి సత్తా చాటినప్పటికీ గ్రామీణ తెలంగాణాలో కాంగ్రెస్ పాగా వేయగలిగింది. దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలే అంటున్నారు రాజకీయ పండితులు. ఆ గ్యారంటీలను కచ్చితంగా అమలు చేయకపోతే కాంగ్రెస్ ను వదిలిపెట్టేది లేదని బి.ఆర్.ఎస్. నేతలు హెచ్చరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బ తిన్న బి.ఆర్.ఎస్. లోక్ సభ ఎన్నికల్లో తిరిగి సత్తా చాటి కాంగ్రెస్ పై ప్రతీకారం తీర్చుకోవాలని నిశ్చయంగా ఉంది.
అయితే ఇటీవల వెలువడిన సర్వేల్లో లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు గెలుచుకోవడం ఖాయమని తేల్చాయి. కాంగ్రెస్ ను నేరుగా ఢీకొనడం కష్టమే అని భావిస్తోన్న కేసీయార్ కేంద్రంలోని బిజెపితో జట్టు కడితే అన్ని విధాలుగానూ మంచిదని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా ప్రతిపక్షాలను వేధిస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇపుడు కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే కేసీయార్ పైనా బి.ఆర్.ఎస్. పైనా మాటల దాడులు పెంచేశారు. ఇవి రాజకీయంగా అయితే ఫర్వాలేదు కానీ రాజకీయ కక్షసాధింపుకు దిగితే నష్టమే అని భావిస్తోన్న కేసీయార్ సరికొత్త వ్యూహంతో ఉన్నారని అంటున్నారు.
తెలంగాణా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. మేడిగడ్డ రిజర్వాయర్ వద్ద పియర్లు కుంగిపోవడాన్ని నిలదీసిన కాంగ్రెస్ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాల్లో ఎంతటి హోదాలో ఉన్న వారు దొరికినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. తనదేమీ తప్పులేకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపుగా తనపై బురద జల్లి బోనులో నిలబెట్టే ప్రమాదం ఉందని కేసీయార్ అంచనా వేస్తున్నట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఆ అవకాశం ఇవ్వకూడదని ఆయన నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలోనే ఢిల్లీ వెళ్లి బిజెపి అగ్రనేతలతో కేసీయార్ భేటీ అవుతారని ప్రచారం జరుగుతోంది. అటు బిజెపికి ఇటు బి.ఆర్.ఎస్. కు ఉమ్మడి శత్రువు కాంగ్రెస్సే కాబట్టి కాంగ్రెస్ కొట్టడానికి బిజెపి కూడా కలిసొస్తుందన్నది కేసీయార్ వ్యూహంగా చెబుతున్నారు. అటు బిజపి కూడా కేంద్రంలో వరుసగా మూడో సారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పట్టుదలగా ఉంది. ఈ క్రమంలోనే అంది వచ్చిన పక్షాలను కలుపుకు పోవాలని కమలనాథులు అనుకుంటున్నారు. దక్షిణాదిలో బిజెపికి ఏ మాత్రం బలం లేదు. అందుకే దక్షిణాన ప్రాంతీయ పార్టీలు కలిసొస్తే బిజెపి కాదనే పరిస్థితులు ఉండవంటున్నారు.
కొద్ది రోజుల క్రితమే కేంద్ర మంత్రి అమిత్ షా పొత్తుల గురించి మాట్లాడుతూ ఎన్డీయేలోకి వచ్చి చేరేందుకు మరి కొన్ని పార్టీలు సిద్దంగా ఉన్నాయని అన్నారు. అది ఎవరిని ఉద్దేశించి అన్నారో అర్ధం కాక రాజకీయ పండితులు బుర్రలు గోక్కుంటున్నారు. బిజెపి నుండే కేసీయార్ కు పిలుపు వచ్చిందని బి.ఆర్.ఎస్. వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కేసీయార్ బిజెపి అగ్రనేతల అపాయింట్ మెంట్ కోరుతున్నారని బిజెపి నేతలు అంటున్నారు. తెలంగాణా బిజెపినేతలు మాత్రం బి.ఆర్.ఎస్. తో పొత్తు ఉండదంటున్నారు. అంతిమంగా బిజెపి జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటే బి.ఆర్.ఎస్.-బిజెపిలు జట్టు కట్టే అవకాశాలు లేకపోలేదంటున్నారు విశ్లేషకులు..
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…