సంక్రాంతి తర్వాత జనంలోకి గులాబీ దళపతి

By KTV Telugu On 12 November, 2024
image

KTV TELUGU :-

వనవాసం అనుకోండి, అజ్ఞాతవాసం అనుకోండి..ఏదైనా అనుకోండి.. కేసీఆర్ అటువంటి సుప్తచేతనావస్థ నుంచి బయటకు వచ్చారు. ఇకపై జనంలో ఉండేందుకు ఆయన ఇష్టపడుతున్నారు. ఈ అంశాన్ని పార్టీ కేడర్ తో జరిగిన భేటీలో వివరించారు. ఆ మాటలను కొందరు నేతలు తమ సెల్ ఫోన్లో బంధించి సోషల్ మీడియాలో పెట్టారు. దానితో కేసీఆర్ మళ్లీ జనంలోకి రావడం పక్కా అని తేలిపోయింది. నిజానికి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత కేసీఆర్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తుంటి ఎముకకు శస్త్రచికిత్స, అనారోగ్యంతో విశ్రాంతి కారణంగా ఆయన ఫామ్ హౌస్ కు పరిమితమయ్యాయి. ఇంతకాలం కేటీఆర్, హరీష్ రావు మొత్తం రాజకీయం నడిపించారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. బస్తీమే సవాల్ అంటూ తొడగొట్టారు. ఐనా పెద్దగా ప్రయోజనం లేకపోవడంతో ఇక లాభం లేదని కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారని భావిస్తున్నారు..

కేసీఆర్ ఇటీవల పాలకుర్తి నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. త్వరలోనే తాను ఫీల్డులోకి వస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. భూపాలపల్లిలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని, ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు తప్పకుండా వస్తానని వారికి హామీ ఇచ్చారు. అంతేకాకుండా.. కూల్చేందుకే ప్రజలు కాంగ్రెస్ అధికారాన్ని ఇచ్చారా అని నిలదీశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఈ టైమ్ పాస్ ముచ్చట్లు ఏందని నిలదీశారు. బీఆర్ఎస్ కార్యకర్తలెవరూ కేసులకు భయపడవద్దని, జైళ్లకూ బెదరవద్దని పిలుపునిచ్చారు. లోపలేస్తాం.. కూలగొడతాం.. ప్రభుత్వంలో వారు మాట్లాడే మాటలు ఇవేనా అని ప్రశ్నించారు. ‘మేం తిట్టలేమా.. మేం తిట్టడం స్టార్ట్ చేస్తే ఈ రోజు మొదలు పెడితే రేపటివరకూ తిట్టగలం’ అని హెచ్చరించారు.

కేసీఆర్ ఏమీ మాట్లాడినా దానికి ఒక పవర్ ఉంటుంది. దానికి ఒక పాలోయింగ్ ఉంటుంది. జనంపై సమ్మోహనాస్త్రం వేసినట్లవుతుంది.ఎన్నికల తర్వాత కేసీఆర్ తొలి పవర్ ఫుల్ పలుకులతో ఆయన అనుచరులు అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డికి చెక్ పెట్టే రోజులు వచ్చాయని చెప్పుకుంటున్నారు. రేవంత్ రెడ్డి దూకుడు పెరగకుండా ఆపాలంటే కేసీఆర్ రంగంలోకి దిగడం ఒక్కటే తగిన మార్గమని చెప్పుకుంటున్నారు. దమ్ముంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలని రేవంత్ రెడ్డి విసిరిన సవాళ్లకు సభా వేదికగానే కేసీఆర్ సమాధానం చెప్పబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు కేసీఆర్ వస్తారని చెప్పుకుంటున్నారు…

రెండు అంశాల కారణంగా కేసీఆర్ జనంలోకి రావాల్సిన అనివార్యత ఏర్పడుతోంది. వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ పార్టీని సమర్థంగా నిర్వహించలేకపోతున్నారన్నది మొదటి సమస్య. అవినీతి కేసులకు సంబంధించి కేటీఆర్ ను అరెస్టు చేసే అవకాశం ఉందన్నది రెండోది. కేటీఆర్ అరెస్టు జరిగితే ఉద్యమ స్వరూపాన్ని కొత్తగా నిర్దేశించాల్సిన అనివార్యత ఉంది. దాన్ని సమర్తంగా నిర్వహించే దమ్ము, ధైర్యం కేసీఆర్ కు మాత్రమే ఉంది. ఆ సంగతి బీఆర్ఎస్ కేడరుకు కూడా బాగానే తెలుసు…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి