అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయ కార్యాచరణను కేసీఆర్ ఖరారు చేసుకున్నారు. అది కృష్ణా ప్రాజెక్టుల అంశం. కేంద్రానికి ప్రాజెక్టులు అప్పగిస్తున్నారని అది తెలంగాణకు తీవ్ర అన్యాయమని ప్రజల్లోకి వెళ్తున్నారు. రాజకీయాల్లో దేనికైనా ఇది ఎలా సాధ్యం అని అనుకోవడానికి అవకాశం లేదు. దేనినైనా సాధ్యం చేస్తేనే రాజకీయంగా విజయం లభిస్తుంది. కేసీఆర్ అలాంటి రాజకీయంలో సిద్ధహస్తులు. అందుకే.. సిద్ధించిన తెలంగాణలో మరోసారి తెలంగాణ సెంటిమెంట్ అస్త్రాన్ని అందుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బీఆర్ఎస్ తప్ప ఎవరున్నా తెలంగాణకు అన్యాయమేనని నిరూపించాలనుకుంటున్నారు. మరి ప్రజలు మళ్లీ నమ్ముతారా ? . కేసీఆర్ను మరోసారి ఉద్యమనేతగా ఆదరిస్తారా ?
కేసీఆర్ అంటే తెలంగాణ ప్రజలకు ఒకే రూపం గుర్తుకు వస్తుంది. అదే నిఖార్సైన తెలంగాణ ఉద్యమ రూపం. తెలంగాణ కొట్లాడిన స్వరూపం కనిపిస్తుంది. అదే ఆయనకు రాజకీయ కవచ కుండలంగా మారింది. కేసీఆర్ నేల విడిచి సాము చేశారో… ఆకాశానికి నిచ్చెనలు వేసే ప్రయత్నం చేశారో కానీ ఆ తెలంగాణకు దూరమయ్యే ప్రయత్నం చేయడంతో ఓటమి మిగిలింది. బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యేకమైన ఓటు బ్యాంక్ లేదు. కులం బలం లేదు. మతం బలం లేదు. ఉన్నదల్లా ప్రాంతీయ సెంటిమెంట్ మాత్రమే . కారణం ఏదైతేనే కేసీఆర్ తన తెలంగాణ సెంటిమెంట్ బలాన్ని వదిలేసుకుని జాతీయ వాద రాజకీయాలు చేయాలనుకున్నారు. అది ఎంత తప్పో ఇప్పుడు తెలిసి వచ్చింది. అసలుకే మోసం వచ్చే పరిస్థితి ఏర్పడటంతో వేగంగా తప్పు దిద్దుకునేందుకు ప్రయత్నిస్తున్నారు దానిలో భాగంగానే కృష్ణా ప్రాజెక్టులు .. కేఆర్ఎంబీకి అప్పగించడంపై ఉద్యమం ప్రారంభమయింది.
పార్లమెంట్ ఎన్నికలు ఇప్పుడు కేసీఆర్కు అత్యంత ముఖ్యం. ఆరేడు పార్లమెంట్ సీట్లు గెల్చుకోకపోతే తర్వాత పార్టీ నేతల్ని..క్యాడర్ ను..అంతిమంగా పార్టీని కాపాడుకోవడం కష్టం. ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా పార్టీని నిర్వీర్యం చేయడానికి రెండు జాతీయ పార్టీలు ప్రయత్నిస్తాయి. ఆ విషయం కేసీఆర్కు తెలియనిదేం కాదు. ఇప్పటికిప్పుడు పార్టీని కాపాడుకోవాలంటే మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ తప్ప మరో ఆయుధం కేసీఆర్ వద్ద లేదు. అందుకే మళ్లీ అందుకోవాలని డిసైడయ్యారు. తాను వదిలేసిన సెంటిమెంట్ అస్త్రం కోసం పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆఖరి ప్రయత్నం చేస్తున్నారు. దక్షిణ తెలంగాణలో బీఆర్ఎస్ పూర్తిగా దెబ్బతిన్నది. ప్రస్తుత కృష్ణా ప్రాజెక్టుల వివాదం కూడా పూర్తిగా దక్షిణ తెలంగాణపై ఆాధారపడి ఉంది. ఈ క్రమంలో ప్రాజెక్టుల అంశంతో ప్రజల్లో మరోసారి సెంటిమెంట్ రేపి.. పార్టీని బతికించుకోవాలని గట్టి ప్రయత్నం చేస్తున్నారు.
ప్రాజెక్టులు కేంద్రం చేతుల్లోకి వెళ్లిపోయానని.. ఇక తెలంగాణకు ఒక్క చుక్క నీరు రాదని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్తగా ఎలాంటి మార్పులు జరగలేదు. గతంలో పదేళ్ల పాటు బీఆర్ఎస్ హయాంలోనే ఉన్నట్లుగా ఉన్నాయి. ఎన్నికల రోజున ఏపీ ప్రభుత్వం సాగర్ ప్రాజెక్టును ఆక్రమించిన అంశంలో.. చెలరేగిన వివాదంతో మరోసారి అలాంటి పరిస్థితి ఏర్పడకుండా భద్రత ఏర్పాటు చేశారు. ఇరు రాష్ట్రాలకు వాటా ఉన్నా శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులు కేఆర్ఎంబీ పరిధిలో ఉంటాయి తప్ప.. ఇతర ప్రాజెక్టులు ఉండవు. వివాదం లేని ప్రాజెక్టులు కేఆర్ఎంబీ అధీనంలో ఉండవు. కానీ కేఆర్ఎంబీ పేరుతో అంది వచ్చిన అవకాశాన్ని వదులుకునేందుకు కేసీఆర్ సిద్ధంగా లేరు. అందుకే అసెంబ్లీకి వెళ్లకపోయినా.. అక్కడ తన వాదన వినిపించకపోయినా సమస్య లేదని.. ప్రజల ముందే తాను చెప్పాలనుకున్నది చెప్పాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
అంటే తెలంగాణ నీటి ప్రయోజనాల పేరుతో నల్లగొండలో కేసీఆర్ నిర్వహించే బహిరంగసభ పార్లమెంట్ ఎన్నికల ప్రచార భేరీకి ప్రారంభసభ అనుకోవచ్చు. దాన్ని ప్రాజెక్టుల సభగా చేసి.. తన పాత అస్త్రం తెలంగాణ సెంటిమెంట్ ను మళ్లీ పొందాలనుకుంటున్నారు. తెలంగాణ అంటే కేసీఆర్.. తనను కాదని వేరే పార్టీని ప్రజలు ఎన్నుకోరన్న నమ్మకంతో .. పార్టీని టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మార్చి జాతీయ రాజకీయాలపై ఎక్కువ దృష్టి పెట్టారు. చివరికి తెలంగాణలో గ్రౌండ్ కోల్పోవడంతో సర్వం కోల్పోయినట్లయింది. ఇప్పుడు మళ్లీ మూలలకు వచ్చి .. తన ఆయుధాన్ని వెదుక్కుంటున్నారు. ఇప్పుడు మళ్లీ కేసీఆర్ చెప్పే మాటల్ని విని ప్రజలు భావోద్వేగానికి గురవుతారా లేదా అన్నదానిపైనే ఆయన రాజకీయ భవితవ్యం ఆధారపడి ఉంది. నిజానికి కేసీఆర్ ఓడిపోయి రెండు నెలలు కూడా కాలేదు. ఈ లోపే తెలంగాణకు ఏదో జరిగిపోతోందని ప్రజల్ని నమ్మించడం అంత తేలిక కాదు. కానీ కేసీఆర్ కు మరో ఆప్షన్ లేదు. అందుకే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి విషయాల్లో కేసీఆర్ చేసే రాజకీయం ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. కానీ ప్రజలు ఎలా స్పందిస్తారన్నదానిపైనే అసలు విజయం ఆధారపడి ఉంటుంది…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…