మరోసారి అధికారం..కేసీఆర్‌కి సాధ్యమేనా?

By KTV Telugu On 24 November, 2022
image

తలపడాలి..నిలబడాలి.. అదే కేసీఆర్‌ టార్గెట్‌

సర్వేలన్నీ మనకే అనుకూలం. మళ్లీ మనమే అధికారంలోకి రాబోతున్నాం. వందసీట్లకు ఒక్కటీ తగ్గదు. మీరు కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుందంటూ గులాబీబాస్‌ ధైర్యవచనాలు పలుకుతున్నారు. ప్రతీ మీటింగ్‌లో తనదైన సర్వే ఫీడ్‌బ్యాక్‌ని తెరపైకి తెస్తున్నారు. లోపలెక్కడో కాస్త డౌట్‌ కొడుతున్నవాళ్లందరిలో తన మాటలతో ఉత్సాహం నింపుతున్నారు. కానీ ఏం సంస్థతో సర్వే చేయించారో, అదెంతవరకు నమ్మకమో కేసీఆర్‌ ఒక్కరికే తెలియాలి.
నాయకుడు అన్నవాడెవడూ మనం ఓడిపోతామని, మూటాముల్లె సర్దేసుకోమని చెప్పడు. వ్యతిరేకత ఉన్నా, మరోసారి గెలుపు కష్టమనుకున్నా వెనకడుగువేయడు. కేసీఆర్‌ చేస్తున్నదీ అదే. కొన్నాళ్లక్రితం సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై సర్వేలు చేయించారు. కొందరి పరిస్థితి అస్సలు బాలేదని పెదవివిరిచారు. కొందరు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు ఈసారి సీట్లు కష్టమేనన్న సంకేతాలిచ్చారు. ఫాంహౌస్‌ బేరసారాల తర్వాత కేసీఆర్‌ టోన్‌ మారింది. సిట్టింగ్‌లకే సీట్లు అంటున్నారు. ఇక నియోజకవర్గాల్లో జనంలోనే తిరగమంటున్నారు. ఎన్నికలకు మరో పదినెలలే ఉండటంతో అధినేత వ్యూహమే తమను గట్టెక్కిస్తుందని కొందరు ఎమ్మెల్యేలు ధీమాతో ఉన్నారు.

మొదటిసారి తెలంగాణవాదం గెలిపించింది. రెండోసారి ఆ వాదానికి సంక్షేమ పథకాలు కలిసొచ్చాయి. విపక్షాల బలహీనతలు పరోక్షంగా మేలుచేశాయి. 2014 ఎన్నికల్లో సొంతంగా 66సీట్లు గెలిచిన టీఆర్‌ఎస్‌, 2018 ఎన్నికల్లో 88 సీట్లు గెలిచింది. ఆపరేషన్‌ ఆకర్ష్‌తో పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య సెంచరీ దాటేసింది. మరి వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ఎన్ని సీట్లొస్తాయనేదానిపై ఎవరి లెక్కల్లో వారున్నారు. పైకి వందా నూటపది అంటున్నా సర్వే రిపోర్టులు టీఆర్‌ఎస్‌ అధినేతకు కూడా పెద్ద సవాలుగానే ఉన్నాయంటున్నారు. ఎందుకంటే వరసగా రెండుసార్లు అధికారంలోకి రావడంతో సహజంగానే కొంత ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది. దీంతోపాటు కొందరు ఎమ్మెల్యేల వ్యవహారశైలి పార్టీకి మైనస్‌ అయ్యేలా ఉంది. సిట్టింగ్‌లకు సీట్లు ఇవ్వకపోతే కొందరు చేజారిపోయే ప్రమాదం ఉంది. అందులో బీజేపీ గాలమేసి సిద్ధంగా ఉంది. అందుకే ముందు సీట్లపై భరోసా ఇస్తే లోటుపాట్లు సరిచేసుకోవచ్చనే వ్యూహంతో కేసీఆర్‌ ఉన్నారు. ఆయన సర్వే రిపోర్టుల ప్రకారం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ సీట్లు మూడంకెలు అందుకోకపోవచ్చని సమాచారం. పోయిన ఎన్నికల్లో వచ్చినన్ని సీట్లు దక్కినా గొప్పేనన్నట్లుంది క్షేత్రస్థాయి పరిస్థితి.

అందుకే 10నెలల ముందే ఎన్నికల నగారా మోగించిన కేసీఆర్‌ పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తున్నారు. ఎమ్మెల్యేలు పనితీరు పార్టీ పరిస్థితి ఆధారంగా నియోజకవర్గాలను మూడు కేటగిరీలుగా విభజించి వ్యూహాలు సిద్ధంచేస్తున్నారు. కచ్చితంగా గెలిచే, కాస్త కష్టపడితే గెలిచే, ట్రయాంగిల్‌ ఫైట్‌ ఉన్న నియోజవర్గాలను మూడు కేటగిరీలుగా తీసుకున్నారు. కచ్చితంగా గెలిచే కేటగిరీ 38 నుంచి 44మంది ఉన్నారని చెబుతున్నారు. కాస్త కష్టపడితే గెలిచే రెండో కేటగిరీలో 30 నుంచి 35 నియోజకవర్గాలు ఉన్నాయి. మళ్లీ అధికారంలోకి రావడానికి ఈ రెండు కేటగిరీల సీట్లు సరిపోతాయికానీ అంచనాలు కాస్త అటుఇటైతే మాత్రం అసలుకే మోసమొస్తుంది. మిగిలిన నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు బలహీనంగా ఉన్నారు. దీంతో రెండు, మూడు కేటగిరీలపై కేసీఆర్‌ ఎక్కువ ఫోకస్‌ పెడుతున్నారు. ఇంటగెలిచి రచ్చగెలవాలిగా. ముందు రాష్ట్రంలో గెలిస్తేనే జాతీయపార్టీకో కేరాఫ్‌ ఉంటుంది మరి!