రేవంత్ , కేసీఆర్ జంగ్ !

By KTV Telugu On 15 February, 2024
image

KTV TELUGU :-

తెలంగాణలో పొలిటికల్ జంగ్ సైరన్ మోగింది. నీళ్ల మీద నిప్పులు మండించేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తూంటే…  కుంగిపోయిన మేడిగడ్డ కింద బీఆర్ఎస్ ను నిలబెట్టేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. లోక్ సభ ఎన్నికలు ముంచుకొస్తూండటంతో ఈ జంగ్ ముందు మరింతగా ముదరనుంది. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన రెండు నెలల్లోనే  రాజకీయం ఉద్రిక్తంగా మారడంతో.. వచ్చే ఐదేళ్లు తెలంగాణలో హైవోల్టెజ్ రాజకీయాలు ఉంటాయని అనుకోవచ్చు.

తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కూడా కాలేదు.  కానీ రాజకీయ సమరం మాత్రం తీవ్ర స్థాయిలో సాగుతోంది.  కృష్ణాబోర్డు విషయంలో కొత్త ప్రభుత్వాన్ని ఇరుకన పెట్టడానికి కేసీఆర్ కొత్త ఉద్యమం ఎత్తుకున్నారు.  అదే  సమయంలో రేవంత్ రెడ్డి  కళ్ల ముందు కనిపిస్తున్న మేడిగడ్డ ప్రాజెక్ట్ పగుళ్లను ప్రజల ముందు పెట్టి కేసీఆర్ పని తనాన్ని చర్చకు పెట్టారు.  రెండు పార్టీలు హోరాహోరీకి రెడీ అవ్వడంతో సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజకీయం రంజుగా మారిపోయింది.

పదేళ్లపాటు అప్రతిహతంగా అధికారాన్ని చెలాయించిన తెలంగాణ పార్టీ, బీఆర్‌ఎస్ కు మొన్నటి ఎన్నికల్లో తగిలిన షాక్‌తో దిగొచ్చింది. పార్టీ ప్రస్థానమంతా పోరాటాలు, ఉద్యమాలతో నడిచిన బీఆర్‌ఎస్, అప్పటి టీఆర్‌స్ పార్టీ వైఖరిలో అధికారం తర్వాత మార్పు వచ్చిందనే అభిప్రాయాలు ఉన్నాయి. ఓ రాజకీయ పార్టీగా నిర్థిష్ట అజెండాతో వెళ్లడం ముందుకు సాగడం సరైందే అయినప్పటికీ… తెలంగాణ ప్రజలు ఆ పంథాను అంగీకరించలేకపోయారని.. తెలంగాణ అనే పేరుకే దూరం కావడాన్ని కూడా ఆమెదించలేకపోయారన్న చర్చ నడుస్తోంది. జరిగిన నష్టాన్ని సరిచేయాలన్న తలంపుతో బీఆర్‌ఎస్ చాలా త్వరగానే పాత పంథాలోకి వచ్చింది. కొత్త ప్రభుత్వం కృష్ణా ప్రాజెక్టుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తోందని.. ప్రాజెక్టులను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు- KRMB కు అప్పగించేందుకు ప్రయత్నిస్తోందని ఛలో నల్లగొండకు పిలుపునిచ్చింది.

బీఆర్‌ఎస్ వ్యూహాన్ని ముందుగానే పసిగట్టిన ప్రభుత్వం KRMB విషయంలో అప్పటి ప్రభుత్వం తప్పు చేసిందని నిరూపించే ప్రయత్నం చేసింది. అప్పటి ముఖ్య కార్యదర్శి స్మితా సభర్వాల్ తెలంగాణ ప్రాజెక్టులను యాజమాన్య బోర్డుకు అప్పగించేందుకు అంగీకరిస్తూ లేఖ రాశారని బయటపెట్టింది. దానిని సరిదిద్దడానికే ప్రాజెక్టులను KRMB కి  అప్పగించమనే తీర్మానం చేస్తున్నామని .. దీనికి బీఆర్‌ఎస్ సహకరించాలని చెప్పింది. దీంతో బీఆర్‌ఎస్ కొంత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంది. సభలో ముఖ్యమంత్రితో సహా మంత్రులంతా ముప్పేట దాడి చేస్తుంటే.. హరీష్‌రావు ఒక్కరే  ప్రతిఘటించారు. కృష్ణా ప్రాజెక్టులపై రాద్దాంతం చేస్తున్న బీఆర్‌ఎస్ రాయలసీమ ఎత్తిపోతలకు సహకరించిందని కాంగ్రెస్ బాంబు పేల్చింది. రాయలసీమ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ పూర్తయ్యే వరకూ కేసీఆర్ ఉద్దేశ్య పూర్వకంగా అపెక్స్ కమిటీ సమావేశానికి గైర్హాజరయ్యారని.. బయటపెట్టింది. ఇది బీఆర్‌ఎస్‌ను దెబ్బతీసింది.

ఓ వైపు కృష్ణా ప్రాజెక్టులపై దాడి కొనసాగిస్తూనే రేవంత్ పాత అస్త్రాన్ని బయటకు తీశారు. కేసీఆర్ కలల ప్రాజెక్టు కాళేశ్వరం ను టార్గెట్  చేశారు. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ముందు మేడిగడ్డ ప్రాజెక్టులో పిల్లర్లు కుంగిపోవడంతో బీఆర్‌ఎస్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఎన్నికల్లో గెలిచిన వెంటనే దానిపై విజిలెన్స్ ఎంక్వైరీ వేసి అవకాశం కోసం చూస్తున్న రేవంత్ సరైన సమయంలో టార్గెట్ ఫిక్స్ చేశారు. కేసీఆర్ నల్లగొండ సభ పెట్టిన రోజునే ఆయన మేడిగడ్డ యాత్ర మొదలుపెట్టారు.  కాళేశ్వరం వెళదాం రండి రావుగారూ అంటూ కేసీఆర్‌ను టీజ్ కూడా చేశారు.  డ్యామ్ సైట్ దగ్గరకు వెళ్లి మరీ పబ్లిక్ ఇన్‌స్పెక్షన్ చేశారు. ఏ ప్రాజెక్టు గురించైతే బీఆర్‌ఎస్ ఘనంగా చెప్పుకుందో.. అదే తెలంగాణ తలమానికం అని చాటుకుందో దానినే దెబ్బతీసేందుకు రేవంత్ యత్నించారు. కాళేశ్వరం పారింది నీళ్లు కాదు.. నిధులు మాత్రమే అన్నారు. కేసీఆర్ చెప్పినట్లు కోటి ఎకరాలకు నీళ్లు రాలేదని కేవలం 90వేల ఎకరాలకు మాత్రమే నీళ్లిచ్చారని చెప్పారు. లక్ష ఎకరాలు కూడా తడవకుండానే లక్షకోట్లు ఖర్చుచేశారని తేల్చేశారు. ఓ వైపు రేవంత్ మీటింగ్ జరుగుతుండగానే మేడిగడ్డలో “మీరేం తేలుస్తారు.. నేను మీ అందరి సంగతి తేలుస్తా”  అంటూ కేసీఆర్ నల్లగొండ నుంచి హుంకరించారు.

కొత్త ప్రభుత్వం వచ్చిన రోజుల వ్యవధిలోనే జలజగడం హీటెక్కింది. నీళ్లు నిప్పులై మండుతున్నాయి. ప్రజల్లో మళ్లీ పరపతి పెరగాలంటే పోరాట పంథానే ముఖ్యం అనుకున్న బీఆర్ఎస్.. టీఆర్‌ఎస్‌ తరహాలో విజృంభించేందుకు సిద్ధమవుతోంది. ఆల్రెడీ దెబ్బతిన్న పార్టీని రెక్కలు విరచాలంటే.. వారి ఆయువుపట్టుపై కొట్టాలన్నట్లుగా రేవంత్ జోరు కనిపిస్తోంది.  ఈ రాజకీయం మరింత ఉద్రిక్తంగా లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యే వరకూ సాగనుంది…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి