ఖమ్మం గుమ్మంలో ఆ రెండు పార్టీలు

By KTV Telugu On 5 December, 2022
image

ఖమ్మం జిల్లాపై పార్టీలు ఎందుకు ప్రత్యేక దృష్టి పెట్టాయి ? ఉమ్మడి జిల్లాకు ఉన్న ప్రత్యేకతలేమిటి ? చంద్రబాబు ఆశిస్తున్నదేమిటి ? షర్మిల కోరుకుంటున్నదేమిటి ? టీడీపీ, వైఎస్సార్టీపీకి ఖమ్మం జిల్లాలో ఉన్న అవకాశాలేమిటి ?

తెలంగాణ నేతలు కొందరు టీడీపీని వేరుగా చూడొచ్చు. ఆంధ్ర పార్టీకి ఇక్కడేం పని అని చంద్రబాబును నిలదీయొచ్చు. పచ్చ చొక్కాలకు ఒక్క సీటు కూడా రాదని సవాలు చేయొచ్చు. అయినా ఎన్టీయార్ స్థాపించిన తెలుగుదేశానికి తెలంగాణలో బలముందని ఒప్పుకోకతప్పదు. ఎందుకంటే నాలుగు దశాబ్దాల ప్రస్థానంలో ఆ పార్టీ ఎన్ని ఆటు పోట్లను ఎదుర్కొన్నా తెలంగాణలో టీడీపీకి కేడర్ బలముంది. సానుభూతిపరుల మద్దతుంది. ఒక్క ఛాన్స్ వస్తే మళ్లీ పూర్వవైభవం దక్కుతుందన్న విశ్వాసం ఉంది. అందుకే వరుస ఓటములను పక్కన పెట్టి 2023 ఎన్నికల్లో విజయం సాధించేందుకు మరో ప్రయత్నం చేస్తోంది. ఇక కొత్తగా ఏర్పాటైన షర్మిల పార్టీ వైఎస్సార్టీపీ కూడా తమది తెలంగాణ సెంటిమెంట్ అని చెప్పుకుంటోంది. తాను తెలంగాణ బిడ్డనని అక్కడే పెళ్లి చేసుకున్నానని పిల్లలు ఇక్కడే పుట్టారని తన పార్టీ పేరులోనే తెలంగాణ ఉందని చెబుతూ వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతోంది.

చంద్రబాబు పార్టీ, షర్మిల పార్టీ రెండు ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాను టార్గెట్ గా రాజకీయాలు చేయాలనుకుంటున్నాయి. పార్టీలకు ఖమ్మం ఒక సెంటిమెంట్ గా భావిస్తున్నారు. ఏపీలో ఉమ్మడి కృష్ణా జిల్లాను ఆనుకుని ఉన్న ఖమ్మంలో సెటిలర్లు ఎక్కువ ఏపీతో అనుబంధమూ ఎక్కువ, రాకపోకలు ఎక్కువ, వివాహ సంబంధాలూ ఎక్కువ. అందుకే అక్కడ ఆంధ్రా లింకులతో పోటీ చేస్తే విజయం సాధించే అవకాశాలూ ఎక్కువేనని భావిస్తున్నారు. పైగా ఖమ్మం ఎంపీలుగా చేసిన వారిలో ఆంధ్రా లింకు ఉన్న వారే ఎక్కువ.

2018 ఓటమి తర్వాత తెలంగాణలో కాస్త నిదానించిన టీడీపీ ఇప్పుడు కొత్త రూటు వెదుకుతోంది. తెలంగాణ రాజకీయాల్లో పట్టు సాధించేందుకు ఖమ్మం రూట్లో ప్రయాణించాలనుకుంటోంది. అందుకే కాసాని జ్ఞానేశ్వర్ ను తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా నియమించిన వెంటనే ఖమ్మంలో భారీ బహిరంగ సభకు చంద్రబాబు ప్లాన్ చేశారు. డిసెంబర్ 21న ఖమ్మంలో లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు నిర్ణయించారు. ఈ సభ ద్వారా యావత్ తెలంగాణ టీడీపీ శ్రేణులు, నాయకులకు అధినేత దిశానిర్దేశం చేయనున్నారు.

ఒకప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీడీపీ హవా సాగింది. క్యాడర్‌తోపాటు ఖమ్మం జిల్లా ప్రజలు అండగా నిలిచారు. దీంతో ఖమ్మం నుంచి ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతం అవుతుందనేది చంద్రబాబు సెంటిమెంట్‌గా చెప్తుంటారు 2018 ఎన్నికల్లో ఖమ్మం జిల్లా సత్తుపల్లి, అశ్వరావుపేటలో తెలుగుదేశం గెలుపొందింది. సత్తుపల్లి నుంచి సండ్ర వెంకట వీరయ్య టీడీపీ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అశ్వరావుపేట నుంచి మెచ్చా నాగేశ్వరరావు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. అంతేకాదు 2018 ఎన్నికల్లో మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్, సీపీఎం, సీపీఐతో కలిసి టీడీపీ ఎన్నికల బరిలో నిలచింది. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభంజనం కొనసాగినప్పటికీ ఖమ్మం జిల్లాలో మాత్రం మహాకూటమి అభ్యర్థులే విజయఢంకా మోగించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది స్థానాలకు తొమ్మిదింట మహాకూటమి క్యాండేట్స్‌ విజయకేతనం ఎగరవేశారు. తర్వాతి పరిణామాల్లో సండ్ర, మెచ్చా ఇద్దరూ గులాబీ కండువా కప్పుకున్నారు.

ఖమ్మం జిల్లాలో చాలా మంది నేతలు టీఆర్ఎస్ లో చేరిపోయినా చంద్రబాబుతో టచ్ లో ఉన్నారు. జిల్లాలో తెలుగుదేశం కార్యక్రమాలను వేగం పెంచితే తిరిగి పార్టీలోకి వచ్చేందుకు ఎలాంటి ఇబ్బందీ లేదని ఆయనకు చెబుతున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ మంత్రి తుమ్మల నాగశ్వరరావు తన గ్రూపుతో మళ్లీ పచ్చ జెండా మోసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అదే జరిగితే టీడీపీకి ప్లస్ పాయింట్ అవుతుందని చెప్పక తప్పదు. వెళ్లిపోయిన సండ్ర, మెచ్చా కూడా వెనక్కి రావచ్చు.

టీఆర్ఎస్ రాకముందు ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్, టీడీపీ మధ్య గట్టి పోటీ ఉండేది. యోధానుయోధులు కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఉండేవారు. కొందరు నేతలు కాంగ్రెస్, టీడీపీ అంటూ మారుతూ ఉండేవారు. ఇప్పుడు వైఎస్సార్టీపీని ప్రారంభించిన షర్మిల తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఖమ్మంలో కాంగ్రెస్ మిత్రబృందం ఉండేది. ఆమె అన్న జగన్ కు కూడా ఒకప్పుడు ఖమ్మంలో బలమున్న నేత అని చెప్పాల్సిందే. 2014 ఎన్నికల్లో ఖమ్మం లోక్ సభా నియోజకవర్గం నుంచి వైసీపీ ఎంపీగా పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి గెలిచిన సంగతి మరిచిపోకూడదు. అందుకే ఖమ్మంపై షర్మిల ప్రత్యేక దృష్టి పెట్టారని అంటున్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న పాదయాత్ర ముగిసిన వెంటనే ఖమ్మంలో వైఎస్సార్టీపీని బలోపేతం చేయడంపై ఆమె సమీక్షలు జరుపుతారని పార్టీ వర్గాలు అంటున్నాయి. జిల్లాలో కొన్ని నియోజకవర్గాలను ఎంపిక చేసుకుని అక్కడ ఇప్పుడే అభ్యర్థులను ఖరారు చేసుకుంటే 2023 మొత్తం ప్రచారం చేసుకునే వీలుంటుందని షర్మిల భావిస్తున్నారు. ఏదమైనా వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా విపక్ష పార్టీలకు కీలకం కాబోతోంది..