రాజకీయంగా కేసీఆర్ కు టెన్షన్ పెట్టించిన జిల్లా ఏదైనా ఉందంటే అది ఉమ్మడి ఖమ్మం జిల్లా అని చెప్పాలి. 2018లో రెండో సారి అధికారానికి వచ్చిన తర్వాత ఇతర పార్టీల ఎమ్మెల్యేలను లాక్కున్నారే తప్ప సొంత పార్టీని చక్కదిద్దలేకపోయారు. కేడర్ బేస్ పెంచుకోలేకపోయారు. సగటు ఓటర్లను ఆకర్షించలేకపోయారు. ఆయన ప్రయత్నాలన్నీ బెడిసి కొట్టడంతో ఇప్పుడిక చేతులు ఎత్తేసినట్లేనని బీఆర్ఎస్ వర్గాలే అంగీకరిస్తున్నాయి.
హైదరాబాద్ తర్వాత విద్యాధికులు ఎక్కువగా ఉండే జిల్లా ఖమ్మం అని చెబుతుంటారు. భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్ కు ఆనుకుని ఉండే జిల్లా కావడంతో ఆలోచనలు, అలవాట్లు కూడా అలాగే ఉంటాయి. అత్యధిక నియోజకవర్గాల్లో సెటిలర్ల ఓట్లు జయాపజయాలను నిర్దేశిస్తుంటాయి. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అదే పని జరిగింది. 2014 ఆ తర్వాత 2018లోనూ బీఆర్ఎస్ కు జిల్లా మొత్తం మీద కేవలం ఒక్కొక్క స్థానమే దక్కింది. గెలిచిన తర్వాత ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుని బీఆర్ఎస్ బలపడింది.
పార్టీలో అసమ్మతిని మాత్రం కేసీఆర్ చల్లార్చలేకపోతున్నారు. అనేక మంది నేతలు పక్క చూపులు చూస్తున్నారు. అందులో పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి ఒకరు. ఆయన వైసీపీ ఎంపీగా గెలిచిన తర్వాత బీఆర్ఎస్లోకి వచ్చినప్పటికీ తర్వాతి పరిణామాల్లో కేసీఆర్ దూరం పెట్టారు. తుమ్మలను ఓడించడంలో పొంగులేటి ప్రధాన భూమిక పోషించారని అనుమానించడమే ఇందుకు కారణమని చెప్పొచ్చు. దానితో పొంగులేటి కదలికలు ఇప్పుడు బీజేపీ వైపు ఉన్నాయని భావిస్తున్నారు. మరి తుమ్మల కూడా కేసీఆర్ పక్షంలో కొనసాగడం అనుమానమేనని భావిస్తున్నారు. జిల్లాలో కొందరు బీఆర్ఎస్ నేతలు తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని చాలా రోజులుగా ప్రకటనలిస్తున్న తుమ్మల సొంత పార్టీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారని చెబుతున్నారు. ఆయన కూడా బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఒక వేళ పొంగులేటి బీజేపీకి వెళితే తుమ్మల టీడీపీ వైపుకు ఉంటారని కూడా రాజకీయ వర్గాల్లో టాక్.
టీడీపీ మళ్లీ తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టిన తర్వాత అధికార పార్టీలోకి వచ్చిన కొందరు మళ్లీ సొంతగూటికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఇటీవల అలాంటి ప్రకటనే చేశారు. టీడీపీ కోసం తాను ఎంతో చేశానని ఆయన చెప్పుకున్నారు. మెచ్చా కూడా వెళ్లిపోయినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు. కాంగ్రెస్ కూడా ఖమ్మం జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టింది. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేనే ఖమ్మంలో ఈ సారి అత్యధిక స్థానాలు గెలిచి చూపిస్తామని కాంగ్రెస్ అధిష్టానానికి ఆయన భరోసా ఇచ్చారు. అందుకోసం కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి సహా పలువురిని ఆయన కలుపుకుని పోతున్నారు.
ఖమ్మం జిల్లాలో ఇప్పుడు బీఆర్ఎస్ పై ముప్పేట దాడి జరుగుతోంది. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ అన్ని వైపుల నుంచి బీఆర్ఎస్ ను ఇబ్బంది పెడుతున్నాయి. అధికార పార్టీకి కేడర్ బలం పెరగడం లేదు. పైగా జిల్లాలో పార్టీకి బలమైన నాయకుడు లేకుండా పోయారు. అందుకే ఆ జిల్లాపై ఆశలు వదులుకుని ఇతర ప్రాంతాలపై దృష్టి పెట్టాలని, ఎన్నికల నాటికి ఓట్ల చీలకపై లబ్ధి పొందొచ్చని కేసీఆర్ భావిస్తున్నారు.