తెలంగాణలో కిషన్ రెడ్డిని ఓడిస్తే ఆ పార్టీని నైతికంగా దెబ్బకొట్టనట్లే. అందుకే రేవంత్ రెడ్డి సైలెంట్ గా సికింద్రాబాద్ పై దృష్టి పెట్టి.. కిషన్ రెడ్డిపై పక్కాగా ట్రాప్ వేశారు. ఎలా గెలుస్తున్నారో స్టడీ చేసి.. ఆ ప్లస్ పాయింటన్నీ మైనస్ చేసేలా వ్యూహాలు పన్నుతున్నారు. ఇప్పుడు చూస్తే..కిషన్ రెడ్డి నిండా మునిగిపోయే దశలో ఉన్నారా అన్న అనుమానాలు వస్తున్నాయి. రేవంత్ ప్లాన్ ను కిషన్ రెడ్డి డీకోడ్ చేయగలరా ?. మరోసారి గెలిచి కేంద్ర మంత్రి కాగలరా ?
కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పోటీ చేస్తున్న సికింద్రాబాద్ నియోజకవర్గంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆయనను ఈ సారి ఓడించాలని సికింద్రాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. సీనియర్ బీసీ నాయకుడైన మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ను చేర్చుకుని మరీ ఎంపీ టిక్కెట్ ఇచ్చారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఖైరతాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ కు సొంత బలం, బలగం ఉంది. గతంలో నాంపల్లి ఎమ్మెల్యేగా ముస్లిం వర్గాలతోనూ ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. మజ్లిస్ తోనూ రేవంత్ లోపాయికారీ ఒప్పందాలు పెట్టుకుంటున్నారు. అన్ని కాంబినేషన్లు సెట్ చేసుకుని కిషన్ రెడ్డిని ఓడించడానికి ప్రయత్నిస్తున్నారు.
2004, 2009 లోక్ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ లో కాంగ్రెస్ విజయం సాధించింది. నిజానికి 2004లోనే దానం నాగేందర్ సికింద్రాబాద్ ఎంపీ కావాల్సింది. ఆ టిక్కెట్ కాంగ్రెస్ దానంకు కేటాయించింది. గెలిచే అవకాశమే లేదని ఆయన టీడీపీలో చేరి నాంపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఈ కారణంగా చివరి క్షణంలో నగర కాంగ్రెస్అధ్యక్షుడిగా ఉన్న అంజన్ కుమార్ యాదవ్ తో నామినేషన్ వేయించారు. అనూహ్యంగా ఆయన గెలిచారు. తర్వాత కూడా ఆయన గెలిచారు. గత రెండు ఎన్నికల్లో ఓట్ల చీలిక వల్ల ప్రధానంగా బీజేపీ లాభపడింది. బీజేపీకి సాలిడ్ ఓటు బ్యాంక్ ఉండగా.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ఇతర ఓట్లు చీలిపోవడం ద్వారా కిషన్ రెడ్డికి ఇబ్బంది లేకుండా పోయింది.
త్రిముఖ పోటీ అంటూ జరిగితే బీజేపీ సులువుగా బయటపడుతుంది. కానీ ముఖాముఖి పోరు జరిగితే బీజేపీకి ఇబ్బందికరమే. సీనియర్ నేత పద్మారావును బీఆర్ఎస్ అభ్యర్థిగా నిలబెట్టింది. ఎవరూ ముందుకు రాకపోవడం వల్ల ఆయనను నిలబెట్టారన్న ప్రచారం జరుగుతోంది. ఎన్నికలప్రచారం ఇంకా ఊపందుకోలేదు. అసెంబ్లీ ఎన్నికల పరాజయం తర్వాత బీఆర్ఎస్ తరపున సీరియస్ గా పని చేయడానికి ఎమ్మెల్యేలు కూడా రెడీగా లేరు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీ, బీసీ, ఎస్సీ,ఎస్టీ ఓట్లే కీలకం. ముస్లిం మైనారిటీలు సాధారణంగా మజ్లిస్ ఓటు బ్యాంక్. అయితే ఇప్పుడు మజ్లిస్ తో కాంగ్రెస్ సన్నిహిత సంబంధాలు కలిగి ఉంది. సికింద్రాబాద్ లో పోటీ పెట్టే అవకాశాలు కనిపించడం లేదు. పోటీ లేకపోతే ముస్లిం వర్గాలు కాంగ్రెస్ కు ఏకపక్షంగా మద్దతు పలుకుతాయి. యోజకవర్గంలో 5లక్షల మందికి పైగా ముస్లిం మైనారిటీ ఓటర్లే ఉన్నారు. గతంలో మజ్లిస్ బీఆర్ఎస్ కు సపోర్ట్ చేసేది. ఈ సారి కాంగ్రెస్ కే మజ్లిస్ సపోర్ట్ లభించనుంది. కీలకమైన స్సీ,ఎస్టీ, బీసీల ఓట్లను పొందడం ద్వారా విజయం సాధించాలని హస్తం నేతలు వ్యూహాలు రూపొందిస్తున్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ కు ముస్లిం వర్గంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దానం నాగేందర్ పోటీ చేయడం వల్ల బీసీ ఓట్లు సమైక్యం అవుతాయని అనుకుంటున్నారు. ఈ కీలకమైన రెండు వర్గాల ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్ అభ్యర్థికి పడితే ఆ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్ విజయం సులువు అవుతుందని రేవంత్ రెడ్డి నమ్ముతున్నారు. కేంద్రమంత్రి అయిన కిషన్ రెడ్డి ఐదేళ్లలో నియోజకవర్గానికి తక్కువ సమయమే కేటాయించారు. కానీ ఆయన అన్ని పార్టీల నేతలతోనూ సాఫ్ట్ గానే ఉంటారు. శత్రువులుగా ఎవరూ భావించరు. మళ్లీ బీజేపీ గెలుస్తుందని.. కిషన్ రెడ్డి ఖచ్చితంగా కేంద్ర మంత్రి అవుతారని నియోజకవర్గ ప్రజలు భావిస్తూ ఉంటారు. అది కిషన్ రెడ్డికి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. కానీ సామాజిక రాజకీయంలో వెనుకబడితే కిషన్ రెడ్డికి పరాజయం ఎదురొస్తుంది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…