తెలంగాణ బీజేపీ సీనియర్ నేతలు భవిష్యత్ రాజకీయాలపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయిన నేతలు ఈ సారి పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలని అనుకుంటున్నారు అందు కోసం ఇప్పటికే పూర్తి స్థాయిలో రంగంలోకి దిగిపోయారు. అయితే ఈటలకు మాత్రమే నియోజకవర్గ సమస్య ఏర్పడుతోంది. ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నది తేల్చుకోలేకపోతున్నారు. మిగతా సీనియర్లతో పోలిస్తే కిషన్ రెడ్డికి అతిపెద్ద లిట్మస్ టెస్ట్ ఎదురు కానుంది. తేడా వస్తే రాజకీయ భవిష్యతే కాదు.. హైకమాండ్ పెద్దల వద్ద పలుకుబడి కూడా కోల్పోతారు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన పొత్తుల రిస్క్ ఇక ఉండదని ప్రకటించారు.
తెలంగాణ బీజీపే నేతలు అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కొంత తమ ప్రభావం చూపించడానికి స్వయంగా రంగంలోకి దిగారు. మరి కొంత మంది లోక్‌సభను గురి పెట్టి అనుచరులకు టిక్కెట్లు ఇప్పించుకున్నారు అయితే అందరికీ నిరాశే ఎదురయంది. .కానీ పార్టీకి మాత్రం మంచి ఫలితాలే వచ్చాయి. ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఇప్పుడు అసలు పరీక్ష సీనియర్లకు లోక్ సభ ఎన్నికల రూపంలో రానుంది.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీ సీనియర్ నేతలకు పీడకల లాంటివి. ప్రధానమంత్రి సీఎంగా అభ్యర్థిగా భావించిన ఈటల రాజేందర్ రెండు చోట్ల పోటీ చేశారు. రెండు చోట్ల ఓడిపోయారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కోరుట్ల నుంచి బరిలోకి దిగారు కానీ పరాజయమే ఎదురయింది. బండి సంజయ్ కూడా కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఇక మరో ఎంపీ బాపూరావు దీ అదే పరిస్థితి. అంటే ముగ్గురు ఎంపీలు ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తే ముగ్గురూ ఓడిపోయారు. వీరితో పాటు ఇతర సీనియర్ నేతలు కూడా ఈ సారి పార్లమెంట్ బరిలోకి దిగాలనుకుంటున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ సిట్టింగ్ ఎంపీలకు హైకమాండ్ టిక్కెట్లు కేటాయిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్ స్థాయిలో ఎంపీ స్థానానికి పోటీపడే నాయకుడు లేకపోవడం ఆయనకు కలిసి వస్తుంది. బండి సంజయ్ కు హైకమాండ్ వద్ద మంచి పలుకుబడి ఉంది. పైగా ఆయన జాతీయ స్థాయిలో మంచి పదవిలో ఉన్నారు. ఆయనకు టిక్కెట్ నిరాకరించే అవకాశం లేదు. అాలాగే ఆదిలాబాద్ ఎంపీ బాపూరావుకు.. కూడా టిక్కెట్ ఇస్తారని చెబుతున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయని కిషన్ రెడ్డి తన సిట్టింగ్ స్థానం సికింద్రాబాద్ నుంచి పోటీ చేయడం ఖాయమే.
మరో వైపు ఈటల రాజేందర్ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారు. ఇంత కాలం రాష్ట్ర రాజకీయాల్లోనే ఉన్న ఆయన బీజేపీ తరపున లోక్ సభకు పోటీ చేయాలనుకుంటున్నారు. కానీ ఆయనకు సరైన స్థానం లేదు. కరీంనగర్ లో బండి సంజయ్ ఉంటారు. అందుకే మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. ఆయనకు హైకమాండ్ చాన్స్ ఇస్తుందా లేదా.. రాష్ట్ర రాజకీయాల్లోనే ఉండాలని చెబుతుందా అన్న దానిపై క్లారిటీ లేదు కానీ.. ఆయన మాత్రం పార్లమెంట్ కు పోటీ చేయాలన్న ఉద్దేశంలో ఉన్నారు.సీనియర్ నేతంలదరిలో ఎక్కువ టెన్షన్ కిషన్ రెడ్డికే. ఎందుకంటే తాను గెలవడంతో పాటు ఎక్కువ సీట్లు గెలిపించాల్సి ఉంటుంది. అందుకే పొత్తుల్ని వదిలేసుకున్నారు.
జనసేనతో ఇక పొత్తులు లేవని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఏ పార్టీతో పొత్తులు ఉండవని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. సర్వేలకు అందని విధంగా లోక్ సభ ఫలితాలు ఉంటాయని చెప్పుకొచ్చారు. ఆ మాత్రం నమ్మకం ఆయన పెట్టుకోవాల్సిందే. లేకపోతే ఆయన రాజకీయ భవిష్యత్ క్లిష్టంగా మారుతుంది. ఎందుకంటే సికింద్రాబాద్ లో అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరమైన పరాజయాల్ని చూశారు. అంబర్ పేటలో బీజేపీ అభ్యర్థి కనీసం రెండో స్థానంలో కూడా లేరు. అందుకే పొత్తుల రచ్చ పక్కన పెట్టాలనుకుంటున్నారు.
కిషన్ రెడ్డి వ్యాఖ్యలు జనసేన వర్గాల్లోనూ చర్చనీయాంసం అవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన బీజేపీతో పొత్తులు పెట్టుకోవాలని అనుకోలేదు. తన పార్టీ తరపున 32స్థానాల్లో పోటీ చేయాలని అనుకున్నారు. కానీ బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ రాయబారం చేసుకుని .. జనసేనకు ఎనిమిది సీట్లు ఆఫర్ చేసి.. పొత్తులు పెట్టుకున్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలతో కలిసి పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం చేశారు. తెలంగాణలో జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ ఇమేజ్ కలిసి వస్తుందనుకుని పొత్తు పెట్టుకున్న బీజేపీ వ్యూహం బెడిసికొట్టింది. జనసేనతో పొత్తు వల్ల ఇరు పార్టీలకు మేలు జరగలేదు. జనసేన పార్టీ పోటీ చేసిన ఎనిమిది చోట్లా బీజేపీ కార్యకర్తలు జనసేనకు మద్దతు ఇవ్వలేదని ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. సంప్రదాయంగా బీజేపీ ఓటు బ్యాంక్ కూడా జనసేనకు అనుకూలంగా రాలేదు. తాండూరు లాంటి చోట్ల గతంలో బీజేపీకి పది వేల ఓట్లు వచ్చాయి. ఆ ఓటు బ్యాంక్ బదిలీ కాలేదు. కూకట్ పల్లిలోనూ అంతేనన్న విశ్లేషణలు వచ్చాయి. ఈ కారణంగానే జనసేనతో పొత్తు విషయంపై కిషన్ రెడ్డి ప్రకటన చేసి ఉంటారని భావిస్తున్నారు.
పవన్ కల్యాణ్ ఇప్పటికే ఏపీలో బీజేపీతో కలిసి ఉన్నామని చెబుతూంటారు కానీ.. ఆ పార్టీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. టీడీపీతో కలిసి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ఎన్నికల సమయంలో ఏర్పడిన పొత్తు ఏపీకి కూడా వస్తుందని పవన్ మనసు మార్చుకుని బీజేపీతో కలిసి పోటీ చేస్తారని అనుకున్నారు. కానీ తెలంగాణలో జనసేనను దూరం చేసుకోవాలని బీజేపీ నిర్ణయించుకోవడంతో ఏపీలో కూడా ఇక బీజేపీతో కలిసే అవకాశం ఉండదని అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటికీ జనసేన పార్టీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. ఎన్డీఏ నంచి బయటకు రాలేదు. కానీ పొత్తుల గురించి జాతీయ పార్టీ నిర్ణయిస్తుందని కిషన్ రెడ్డి ప్రకటన కాదని జనసేన వర్గాలు చెబుతున్నాయి. కానీ పొత్తుల వల్ల పరస్పర ఉపయోగం ఉంటేనే… బీజేపీ హైకమాండ్ అంగీకరిస్తందని. అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ప్రయోజనం కలగనందున జనసేన పార్టీకి సీట్లు కేటాయించే అవకాశం ఉండదని అంచనా వేస్తున్నారు. ఏదైనా ఇప్పుడు సీట్లు గెలిపించాల్సిన బాధ్యత మాత్రం కిషన్ రెడ్డిపైనే ఉంటుంది.
ప్రస్తుతం తెలంగాణ రాజకీయ నేతల్లో ఎవరూ ఎదుర్కోనంత ఒత్తిడి కిషన్ రెడ్డి ఎదుర్కొంటున్నారు. తెలంగాణ బీజేపీ చీఫ్.. కేంద్రమంత్రిగా రెండు బాధ్యతల్ని నిర్వర్తిస్తూ.. ఫలితాల్ని చూపించాల్సి ఉంది…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…